అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే నాయిని
హన్మకొండ కల్చరల్: శ్రీభద్రకాళి దేవాలయాన్ని శుక్రవారం వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి, భూపాలపల్లి జిల్లా ఎలక్షన్ అబ్జర్వర్, టీజీఎంఎస్‌ఐడీసీ, ఏండీ ఫణింద్రరెడ్డి ఐఏఎస్ సందర్శించారు. ఈసందర్భంగా ఆలయ అర్చకులు భద్రకాళి శేషు, పార్నంది నరసింహమూర్తి వారిని ఆలయ మర్యాదలతో స్వాగతించారు. వారు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో ధర్మకర్తలు ఓరుగంటి పూర్ణచందర్, పాలడుగుల అంజనేయులు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా అమ్మవారిని దర్శించుకున్న భారతీయ హిందూ పరిషత్ అంతర్రాష్ట్రీయ సంస్థ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కోల శివరామకృష్ణ మాట్లాడుతూ.. భారతదేశాన్ని హిందూ దేశంగా, గోమాతను జాతీయ జంతువుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈమేరకు దేవాలయ ప్రాంగణంలో ఐదు కోట్ల సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు గంప శ్రవణ్‌కుమార్, సభ్యులు వరుణ్‌కుమార్, దిడ్డి రాజు తదితరులు పాల్గొన్నారు.
వరంగల్ స్పోర్ట్స్: హనుమకొండలోని జేఎన్‌ఎస్‌లో శుక్రవారం 11వ సబ్ జూనియర్స్ అండర్–14 బాలబాలికల జిల్లా స్థాయి టెన్నికాయిట్ ఎంపిక పోటీలు ఉత్సాహంగా కొనసాగాయి. కాంగ్రెస్ యువజన నాయకుడు విష్ణురెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ఎంపికలు ప్రారంభించారు. ఉజ్వల భవిష్యత్‌కు క్రీడలు దోహదపడతాయన్నారు. ఇందులో ప్రతిభ కనబర్చిన క్రీడాకారులు ఈనెల 26 నుంచి 28వ తేదీ వరకు మేడ్చల్‌లో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని అసోసియేషన్ వరంగల్ జిల్లా సెక్రటరీ గోకారపు శ్యామ్‌కుమార్ తెలిపారు. కార్యక్రమంలో అసోసియేషన్ రాష్ట్ర, ఉమ్మడి జిల్లా కోశాధికారులు రాజ్‌కుమార్, మహ్మద్ జాహూర్, పీఈటీ, పీడీలు నర్సయ్య, శ్రీధర్, శ్రీనివాస్, నిర్మల, సీనియర్ క్రీడాకారులు సీతారాం, శ్రీనివాస్ పాల్గొన్నారు.
వరంగల్ క్రైం: ఈనెల 21వ తేదీన జరిగే జాతీయ మెగా లోక్ అదాలత్‌ను కక్షిదారులు వినియోగించుకోవాలని, రాజీమార్గం ద్వారా వారి కేసులు పరిష్కరించుకోవాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం లోక్ అదాలత్‌కు సంబంధించి వరంగల్ కమిషనరేట్ పోలీసులు రూపొందించిన వాల్ పోస్టర్లను సీపీ సన్‌ప్రీత్ సింగ్ ఆవిష్కరించారు. ఈసందర్భంగా సీపీ మాట్లాడుతూ.. ఈ జాతీయ మెగా లోక్ అదాలత్‌లో రాజీ పడదగిన క్రిమినల్, సివిల్, ఆస్తి, కుటుంబ, వైవాహిక, బ్యాంకు రికవరీ, విద్యుత్, చెక్ బౌన్స్, తదితర కేసులు పరిష్కరించుకోవచ్చని సూచించారు. చిన్న చిన్న కేసులతో కక్షలు పెంచుకుని కోర్టుల చుట్టూ తిరుగుతూ సమయాన్ని, డబ్బులను వృథా చేసుకోవద్దన్నారు. ఎవరైనా కేసుల్లో రాజీ కావాలనుకున్నవారు పోలీస్ అధికారులను సంప్రదించాలని, లోక్ అదాలత్ ద్వారా బాధితులకు సత్వర న్యాయం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమం వరంగల్ ఏఎస్పీ శుభం, ఏసీపీ డేవిడ్ రాజు, ఇన్‌న్‌స్పెక్టర్లు రమేశ్, కరుణాకర్ పాల్గొన్నారు.
ఖిలా వరంగల్: ఖిలా వరంగల్ కోటను ప్రపంచ పర్యాటకులను ఆకర్శించే స్థాయిలో అభివృద్ధికి అడుగులు పడుతున్నాయి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి వర్చువల్ రియాల్టీని అందుబాటులో తీసుకుని రావడానికి మంత్రి కొండా సురేఖ కసరత్తు చేశారు. ఆమె ఆదేశాల మేరకు శుక్రవారం సాయంత్రం ఖిలా వరంగల్ మధ్యకోటలోని శిల్పాల ప్రాంగణాన్ని హైదరాబాద్‌కు చెందిన ఐఎఫ్‌ఎస్ అధికారి రంజిత్ నాయక్, డీఎఫ్‌ఓ అనూజ్ అగర్వాల్, వరంగల్ డీఆర్‌ఓ విజయలక్ష్మి, తహసీల్దార్ ఇక్బాల్, డీటీఓ శివాజీ సందర్శించారు. ఆనాటి కట్టాడాలు, నిర్మాణాల్ని వారు పరిశీలించారు. ప్రపంచ పర్యాటకులను ఆకర్షించేలా అభివృద్ధి పనులపై కసరత్తు చేశారు. చేయాల్సిన అభివృద్ధి పనులపై ప్రత్యేక నివేదిక తయారు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తామని అధికారులు పేర్కొన్నారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్లు బైరబోయిన ఉమ, వేల్పుగొండ సువర్ణ, టార్చ్ కార్యదర్శి అరవింద్ ఆర్య, గైడ్ రవియాదవ్, కాంగ్రెస్ నేతలు బోగి సురేశ్, బైరబోయిన దామోదర్ తదితరులు పాల్గొన్నారు.
అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే నాయిని


