 
															తుపాన్ ఎఫెక్ట్.. రైళ్ల రద్దు, దారి మళ్లింపు, నిలిపివ
కాజీపేట రూరల్ : మోంథా తుపాన్ ఎఫెక్ట్ బుధవారం కాజీపేట, వరంగల్ మీదుగా న్యూఢిల్లీ, విజయవాడ, సికింద్రాబాద్ రూట్‌లో ప్రయాణించే పలు రైళ్లపై తీవ్ర ప్రభావం పడింది. డోర్నకల్ వద్ద రైల్వే ట్రాక్‌పైకి వర్షం నీరు చేరడంతో రైళ్ల రాకపోకలకు ఆటంకాలు తలెత్తాయని అధికారులు తెలిపారు. దీంతో తప్పనిసరి పరిస్థితిలో పలు రైళ్లను రద్దు, దారి మళ్లింపు, పాక్షికంగా రద్దుతో క్రమబద్ధీకరిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. న్యూఢిల్లీ–విజయవాడ మధ్య వయా వరంగల్ మీదుగా వెళ్లే టాటానగర్, షాలిమార్, కోణార్క్, షిర్టీ, కృష్ణా, గోల్కొండతోపాటు పలు రైళ్లను వయా కాజీపేట జంక్షన్ మీదుగా పగిడిపల్లి, నడికుడ మీదుగా దారి మళ్లించారు. షిర్డీ–కాకినాడ ఎక్స్‌ప్రెస్‌ను మహబూబాబాద్ నుంచి వెనక్కి తీసుకొచ్చి వయా కాజీపేట మీదుగా దారి మళ్లించారు. అదేవిధంగా షిర్డీ–కాకినాడ ఎక్స్‌ప్రెస్‌ను వరంగల్‌కు రాకుండా విజయవాడ మీదుగా దారి మళ్లించారు. ఆదిలాబాద్–తిరుపతి కృష్ణా ఎక్స్‌ప్రెస్‌ను వయా నడికుడ మీదుగా తిరుపతి దారి మళ్లించారు. రైళ్ల రద్దు, దారి మళ్లింపుతో వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కాగా, రైల్వే ట్రాక్, యార్డులోకి వర్షం నీరు చేరి రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడిందనే సమాచారం మేరకు సికింద్రాబాద్ డివిజన్ రైల్వే మేనేజర్ ఆర్.గోపాలకృష్ణన్ ప్రత్యేక రైలులో డోర్నకల్ వెళ్లారు.
రద్దయిన రైళ్లు..
సికింద్రాబాద్– విజయవాడ శాతవాహన ఎక్స్‌ప్రెస్‌ను, సికింద్రాబాద్ –కాగజ్‌నగర్ భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్‌ను బుధవారం రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు.
నేటి రైళ్ల రద్దు..
విజయవాడ–సికింద్రాబాద్ (12713) శాతవాహన ఎక్స్‌ప్రెస్‌ను గురువారం రద్దు చేసినట్లు రైల్వే అ ధి కారులు తెలిపారు. కాజీపేట–విజయవాడ పుష్ పు ల్, శాతవాహన, భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్‌లను కూడా రద్దు చేసే అవకాశం ఉందని వారు పేర్కొన్నారు.
కాజీపేటలో హెల్ప్‌డెస్క్..
కాజీపేట జంక్షన్‌లో హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేశారు. ఈ డెస్క్ ద్వారా టీటీఈలు, కమర్షియల్ స్టాఫ్ ఎప్పటికప్పుడు ప్రయాణికులకు రైళ్ల సమాచారం అందించారు. 0870–2576430 నంబర్‌లో రైళ్ల సమాచారం అందుబాటులో ఉంటుందని రైల్వే అధికారులు తెలిపారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
