 
															మానుకోటలో నిలిచిన కృష్ణా ఎక్స్‌ప్రెస్ ..
మహబూబాబాద్ రూరల్ : మోంథా తుపాన్ ప్రభావంతో ఆదిలాబాద్ నుంచి తిరుపతికి వెళ్తున్న కృష్ణ ఎక్స్ ప్రెస్ రైలు బుధవారం మహబూబాబాద్ రైల్వే స్టేషన్‌లో దాదాపు మూడున్నర గంటలపాటు నిలిచింది. ఉదయం 11.05 గంటలకు మానుకోటకు చేరుకుని నిలవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీంతో పోలీసులు, రైల్వే అధికారుల సూచన మేరకు ఆర్యవైశ్యులు, కిరాణా వర్తక సంఘం, మార్వాడీ యువమంచ్, సత్యసాయి సేవా ట్రస్టు, రోటరీ క్లబ్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, సీఆర్‌ఐ పంప్స్, శ్రీవాసవి సేవా ట్రస్టు, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ సంస్థల ప్రతినిధులు, సెల్ షాపుల నిర్వాహకులు, తహసీల్దార్ రాజేశ్వరరావు.. ప్రయాణికులకు సేవలు అందించారు. వాటర్ బాటిళ్లు, అరటి పండ్లు, బిస్కెట్లు, తదితర అల్పాహారం పంపిణీ చేశారు. దీంతో ప్రయాణికులు వారికి కృతజ్ఞతలు తెలిపారు. కాగా, డోర్నకల్ వైపునకు వెళ్లేందుకు సరైన మార్గం లేకపోవడంతో మధ్యాహ్నం 3.32 గంటలకు రైలును అధికారులు తిరిగి కాజీపేటకు పంపించారు. కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ శ్రీనివాస్, టౌన్, రూరల్ సీఐలు మహేందర్ రెడ్డి, సర్వయ్య, ఎస్బీ సీఐ నరేందర్, ఆర్‌ఐలు భాస్కర్, సోములు, నాగేశ్వరరావు, ఎస్సైలు ప్రశాంత్ బాబు, అలీం హుస్సేన్, అశోక్, దీపిక, తదితరులు పాల్గొన్నారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
