
శరన్నవరాత్రి మహోత్సవాల ఏర్పాట్ల పరిశీలన
హన్మకొండ కల్చరల్: ఈనెల 22 నుంచి అక్టోబర్ రెండో తేదీ వరకు వేయిస్తంభాల ఆలయంలో జరిగే రుద్రేశ్వరీదేవి శరన్నవరాత్రి మహోత్సవాల ఏర్పాట్లను వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి పరిశీలించారు. ఆదివారం రాత్రి వేయిస్తంభాల ఆలయాన్ని ఆయన సందర్శించారు. ఆలయ ఈఓ అనిల్‌కుమార్, ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ ఘనంగా స్వాగతించారు. పూజల అనంతరం కేంద్ర పురావస్తుశాఖ సీఏ అజిత్‌తో కలిసి దేవాలయాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని మాట్లాడుతూ.. ఆలయంలో జరిగే నవరాత్రి మహోత్సవాలకు లక్షలాది మంది భక్తులు తరలివస్తారని భక్తులకు అసౌకర్యం కలుగకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు. పెద్ద ఎత్తున విద్యుత్ అలంకరణ చేయాలని కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు బత్తిని శ్రీనివాస్, జీవీఎస్ శ్రీనివాస్‌చారి, తోట పవన్, ట్రాఫిక్ సీఐ సీతారెడ్డి, హనుమకొండ సీఐ మచ్చ శివకుమార్, ఆలయ సిబ్బంది మధుకర్, ఎల్ రామకృష్ణ పాల్గొన్నారు.
ప్రజల దీవెనలతోనే గెలిచా..
వరంగల్ అర్బన్: ఎన్‌ఎస్‌యూఐ ప్రెసిడెంట్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచానని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి తెలిపారు. ఆదివారం బల్దియా ప్రధాన కార్యాలయంలో పాలకవర్గం, అధికారుల స్టడీ టూర్ బృందాలకు ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈసందర్భంగా తాజాగా మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై విలేకరులు ఆయనను వివరణ కోరగా.. 40 ఏళ్లుగా తాను కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నానని స్పష్టం చే శారు. అదృష్టంతోపాటు కష్టార్జితం, పార్టీకి చేసిన సేవలు, ప్రజల దీవెనలతోనే గెలిచానన్నారు. మంత్రి కొండా సురేఖకు తల్లి, అక్క హోదాను ఇచ్చానని పేర్కొన్నారు. తనపై చేసిన వ్యాఖ్యలను ఆమె విజ్ఞతకే వదిలేస్తున్నా అన్నారు. ఎవరి హద్దుల్లో వారు ఉండి పని చేస్తే ఇలాంటి పరిస్థితులు రావని, జిల్లాలోని అందరు నేతలతో విభేదాలకు పోతే అభివృద్ధి కుంటు పడుతుందని అభిప్రాయపడ్డారు.