
‘మీ మొక్కతో వరంగల్ నగర భవిష్యత్’
బల్దియా కమిషనర్ చాహత్‌బాజ్‌పాయ్
వరంగల్ అర్బన్: భవిష్యత్ తరాలకు చక్కని జీవితాన్ని ఇవ్వాల్సిన బాధ్యత నగరపౌరులపై ఉందని, ‘మీ మొక్కతోనే వరంగల్ నగర భవిష్యత్’ అనే నినాదంతో ముందకు సాగాలని బల్దియా కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ అన్నారు. ఉద్యాన విభాగ అధికారులతో మంగళవారం సమావేశం నిర్వహించారు. కేర్ అండ్ క్యూర్ ఆధ్వర్యంలో ‘నగరాన్ని పచ్చదనం చేద్దాం’ అనే బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టే అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో (సీఎస్‌ఆర్) భాగంగా బల్దియా పరిధిలో ఉన్న ఓపెన్ గ్రీన్ ల్యాండ్స్‌లో పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని కోరారు. తల్లి, తండ్రి ఎవరైనా మరణిస్తే వారి పేరుతో స్మృతివనం ఏర్పాటు చేసి మొక్కలు నాటించనున్నట్లు తెలిపారు. అనంతరం వాల్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. సమావేశంలో సీహెచ్‌ఓ రమేశ్, హెచ్‌ఓ లక్ష్మారెడ్డి, కేర్ అండ్ క్యూర్ వ్యవస్థాపక కార్యదర్శి ఆచార్య వెలుదండి రవి పాల్గొన్నారు.