
పన్ను వసూళ్లకే పరిమితం
వరంగల్ అర్బన్: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో వార్డు (డివిజన్) ఆఫీసర్ల పాలన గాడి తప్పింది. అన్ని విభాగాల అధికారులు, సిబ్బందికి సమన్వయకర్తలుగా వ్యవహరించాల్సిన వార్డు ఆఫీసర్లు తమ బాధ్యతలను విస్మరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. దిశానిర్దేశం చేయాల్సిన అధికారులు ఏం పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. దీంతో వార్డు ఆఫీసర్లు కేవలం పన్నుల వసూళ్లు, సంక్షేమ పథకాలకే పరిమితమయ్యారు. వార్డు ఆఫీసర్ పాలన లక్ష్యం గ్రేటర్ వరంగల్‌లో నెరవేరడం లేదు.
66 డివిజన్లకు 66 మంది..
వార్డు పరిపాలనను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం రెండేళ్ల క్రితం సిబ్బందిని నియమించింది. రెవెన్యూ శాఖకు చెందిన 38 మంది వీఆర్‌ఏలను పురపాలక శాఖలో విలీనం చేసింది. వీరితోపాటు బల్దియాలోని 36 మంది పర్మనెంట్ ఉద్యోగులు బిల్ కలెక్టర్లు, వివిధ విభాగాలకు చెందిన వారిని గుర్తించారు. 66 డివిజన్లకు 66 మంది వార్డు ఆఫీసర్లను, 8 మందిని మీ సేవ కేంద్రాల్లో క్యాషియర్లుగా నియమించారు. అంతేకాకుండా 9నెలల క్రితం మరో 25 మందిని వార్డు ఆఫీసర్లను ప్రభుత్వం బల్దియాకు కేటాయించింది. వీరిలో 23 మందికి టౌన్‌ప్లానింగ్ విభాగంలో ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుల పరిశీలన, అప్‌లోడ్ బాధ్యతలు అప్పగించారు.
ఏం చేయాలి?
మేయర్, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్ల దృష్టికి రాని అనేక సమస్యలు క్షేత్రస్థాయిలో ఉత్పన్నమవుతుంటాయి. సమస్యలను ఎప్పుటికప్పుడు పరిష్కరించేందుకు కృషిచేయాలి. పౌర సేవల పట్టిక అమలు కోసం పనిచేయాల్సి ఉంటుంది. అధికారుల దృష్టికి వచ్చే ఫిర్యాదులే కాకుండా సామాజిక మధ్యమాలు, కంట్రోల్ రూం, టోల్‌ఫ్రీ నంబర్ ఫిర్యాదులపై స్పందించాలి. ఆస్తి, నీటి, గార్బేజ్ చార్జీలు, ట్రేడ్ లైసెన్స్ పన్నులు వసూలు చేయాలి. జనన, మరణ ధ్రువ పత్రాల జారీకి విచారణ చేయాలి. రోడ్లపై గుంతలు, నీటినిల్వలు, మట్టి కప్పులు, మూతల్లేని మ్యాన్‌హోళ్లు, ఫుట్‌పాత్ కబ్జాలు, వెలగని వీధి లైట్లు, ఇంటింట చెత్త సేకరణ తీరు, ప్రజా మరుగుదొడ్ల నిర్వహణ, నాలాలు, డ్రెయినేజీల్లో వ్యర్థాలు పేరుకుపోవడం, దోమల సమస్య, జంతు, పక్షుల కళేబరాలు, దివ్యాంగులు, వృద్ధులకు గుర్తింపు కార్డులు తదితర సమస్యలను క్షేత్రస్థాయిలో తెలు సుకోవాలి. అనధికారి భవన నిర్మాణాలు, ప్రభుత్వ స్థలాల కబ్జాలు, అక్రమంగా వెలిసిన ఫ్లెక్సీలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలపై విచారణ, పురోగతిపై దృష్టిసారించాలి. ఆయా విభాగాలకు చెందిన ఏఈలు, ఆర్‌ఐలు, బిల్డింగ్ ఇన్‌స్పెక్టర్లు, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు, హెల్త్ ఇన్‌స్పెక్టర్లు, డివిజన్ల సిబ్బంది, అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేయాలి.
ఏం చేస్తున్నారు?
వార్డు ఆఫీసర్లు ఆస్తి, నీటి, గార్బేజ్ చార్జీలను అరకొరగా వసూలు చేస్తున్నారు. దీనికి కూడా బిల్ కలెక్టర్ల సహకారం తీసుకుంటున్నారు. ఇందిరమ్మ ఇళ్ల సర్వే, పురోగతి, గృహలక్ష్మి, పెన్షన్ల కోసం లబ్ధిదారుల విచారణ చేసి చేతులు దులుపుకుంటున్నారు. వార్డు ఆఫీసర్ పాలనకు సంబంధించిన ఇతర పనులపై ఏ మాత్రం చొరవ తీసుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో ఆయా వార్డుల్లో సమస్యలు ఎక్కడికక్కడే పేరుకుపోతున్నాయి. ప్రభుత్వం నుంచి వేతనాలు పొందుతూ నామామత్రంగా విధులు నిర్వర్తిస్తూ కాలక్షేపం చేస్తున్నారనే ఆరోపణలున్నాయి.
సమస్యల పరిష్కారానికి
చొరవచూపని వార్డు ఆఫీసర్లు
పట్టించుకోని జీడబ్ల్యూఎంసీ
పాలకవర్గం, అధికారులు
ఇబ్బందులు పడుతున్న
గ్రేటర్‌లోని 66 డివిజన్ల ప్రజలు
కొరవడిన పర్యవేక్షణ..
వార్డు ఆఫీసర్లపై బల్దియా ఉన్నతాధికారుల పర్యవేక్షణ పూర్తిగా కొరవడిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 15 రోజులు, నెలవారీ వారీగా డిప్యూటీ కమిషనర్లు, అడిషనల్ కమిషనర్ సమీక్షించి సమస్యలపై పరిష్కార మార్గాలు సూచించాలి. కానీ, అవేమి అమలు కాకపోవడంతో వార్డు ఆఫీసర్లు ఇష్టారాజ్యంగా విధులు నిర్వర్తిస్తున్నారని నగర ప్రజలు పేర్కొంటున్నారు. ఇప్పటికై నా జీడబ్ల్యూఎంసీ పాలకవర్గం, ఉన్నతాధికారులు స్పందించి వార్డు ఆఫీసర్ల పాలనను గాడిలో పెట్టాలని ప్రజలు కోరుతున్నారు.