
రైతు సేవలో టీజీ ఎన్పీడీసీఎల్
హన్మకొండ: రైతులకు నాణ్యమైన సేవలు అందించేందుకు టీజీ ఎన్పీడీసీఎల్ యాజమాన్యం కృషి చేస్తోంది. పొలంబాట ద్వారా నేరుగా సమస్యలు తెలుసుకుంటూ పరిష్కరిస్తోంది. విద్యుత్ ప్రమాదాలు, భద్రతపై విద్యుత్ అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. వ్యవసాయ సర్వీసులను యుద్ధప్రాతిపదికన మంజూరు చేస్తున్నారు. హనుమకొండ జిల్లాలో 2023 జూలై 15 నుంచి 2024 జూలై 14 వరకు 1,261 సర్వీస్‌లు, 2024 జూలై 15 నుంచి 2025 జూలై 15 వరకు 1,302 వ్యవసాయ సర్వీస్‌లు మంజూరు చేశారు. వరంగల్ జిల్లాలో 2023 జూలై 15 నుంచి 2024 జూలై 14 వరకు 7,571 సర్వీస్‌లు, 2024 జూలై 15 నుంచి 2025 జూలై 15 వరకు 824 వ్యవసాయ సర్వీస్‌లు మంజూరు చేశారు. పొలం బాట ద్వారా హనుమకొండ జిల్లాలో ఇప్పటివరకు 1,216 లూజ్ లైన్లు, 476 వంగిన స్తంభాలు, 3,609 మధ్య స్తంభాలు ఏర్పాటు చేశారు. వరంగల్ జిల్లాలో ఇప్పటి వరకు 1,141 లూజ్‌లైన్లు, 445 వంగిన స్తంభాలు, 2,965 మధ్య స్తంభాలు ఏర్పాటు చేశారు. వ్యవసాయ పంపుసెట్లకు కెపాసిటర్ల ఏర్పాటుతో ప్రయోజనం ఉంటుందని అవగాహన కల్పిస్తున్నారు.
డిపార్ట్‌మెంట్ వాహనాల్లోనే
ట్రాన్స్‌ఫార్మర్ల తరలింపు..
రైతులకు వ్యవసాయ సర్వీస్ మంజూరుకు చెందిన ఎస్టిమేట్ కాపీలు తెలుగులో అందిస్తున్నారు. రైతుల ఫోన్ నంబర్‌కు వచ్చే ఎస్‌ఎంఎస్ లింక్ క్లిక్ చేయడం ద్వారా తెలుసుకోవచ్చు. తద్వారా రైతులకు అందించే మెటీరియల్ జాబితాపై వారికి పూర్తి స్పష్టత వస్తుంది. ఎస్‌ఎంఎస్‌లు కూడా తెలుగులోనే పంపుతున్నారు. ట్రాన్స్‌ఫార్మర్లను డిపార్ట్‌మెంట్ వాహనాల్లోనే తరలించాలని టీజీ ఎన్పీడీసీఎల్ యాజమాన్యం ఆదేశాలు జారీ చేసింది. కాలిపోయిన ట్రాన్స్‌ఫార్మర్ల మరమ్మతుకు ఎస్‌పీఎం హెడ్‌లు ఏర్పాటు చేశారు. తద్వారా ట్రాన్స్‌ఫార్మర్ల మరమ్మతులు వేగంగా జరిగి వెంటనే బిగించే ఆస్కారం ఉంటుంది. వ్యవసాయ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్లు ఫెయిల్యూర్ కాకుండా పిడుగుల నిరోధకాలు అమర్చుతున్నారు. వేసవి కార్యాచరణలో భాగంగా అధిక భారం ఉన్న డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్లపై భారం తగ్గించేందుకు హనుమకొండ జిల్లాలో అదనంగా 181 ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేయగా.. 145 ట్రాన్స్‌ఫార్మర్ల సామర్థ్యాన్ని పెంచారు. వరంగల్ జిల్లాలో అదనంగా 214 విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేయగా, 213 ట్రాన్స్‌ఫార్మర్ల సామర్థ్యాన్ని పెంచారు. సాగు కోసం మెరుగైన విద్యుత్ సరఫరా చేస్తున్నామని, రైతులకు సులభంగా అర్థమయ్యేందుకు తెలుగులోనే సర్వీసుల మంజూరు, ఎస్టిమేట్ పత్రాలను పంపుతున్నట్లు ఎన్‌పీడీసీఎల్ వరంగల్, హనుమకొండ ఎస్‌ఈలు గౌతంరెడ్డి, మధుసూదన్‌రావు తెలిపారు. రైతులు సహకరించాలని కోరారు.
పొలంబాటతో సమస్యల పరిష్కారం
యుద్ధప్రాతిపదికన వ్యవసాయ సర్వీసుల మంజూరు
రైతులకు తెలుగులో అంచనా ప్రతులు