
అధికారులు అప్రమత్తంగా ఉండాలి
హన్మకొండ అర్బన్: వర్షాకాలం నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని సంబంధిత శాఖల అధికారు లను హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధికారులతో వరద ముంపు నివారణకు తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై కలెక్టర్ సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ.. ముంపు ప్రాంతాలను అధికారులు ముందస్తుగా గుర్తించి, తీసుకోవాల్సిన చర్యలకు సిద్ధంగా ఉండాలని చెప్పారు. ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది సిద్ధంగా ఉండాలని సూచించారు. శిథిలావస్థకు చేరిన పాత భవనాల్ని అధికారులు గుర్తించాలని తెలిపారు. వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో సరిపో ను మందులు నిల్వ ఉంచాలని పేర్కొన్నారు. సమావేశంలో జీడబ్ల్యూఎంసీ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే, డీసీపీ సలీమా, ఇన్‌చార్జ్ అదనపు కలెక్టర్లు వైవీ.గణేశ్, మేన శ్రీను, సీపీఓ సత్యనారాయణరెడ్డి, డీఏఓ రవీందర్‌సింగ్, డీపీఓ లక్ష్మీరమాకాంత్, డీఎంహెచ్‌ఓ అప్పయ్య, ఆర్డీఓ నారాయణ, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.
పీసీపీఎన్డీటీ చట్టాన్ని ఉల్లంఘిస్తే చర్యలు
పీసీపీఎన్డీటీ చట్టాన్ని ఉల్లంఘించి జిల్లాలో ఎవరైనా లింగ నిర్థారణ పరీక్షలు నిర్వహించినా, పుట్టబోయే బిడ్డ ఆడపిల్ల అని తెలుసుకుని అబార్షన్లకు పాల్పడినా కఠిన చర్యలు తీసుకుంటామని హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య హెచ్చరించారు. ఈమేరకు సోమవారం కలెక్టరేట్‌లో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో లింగ నిర్ధారణ పరీక్షలపై ఫిర్యాదులు చేసేందుకు ఏర్పాటు చేసిన 63000 30940 వాట్సాప్ నంబర్‌ను ఆవిష్కరించారు. ఈసందర్భంగా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ.. లింగ నిర్ధారణ పరీక్షలపై వాట్సాప్ నంబర్, అలాగే 104, 181, 1098, డయల్ 100 టోల్‌ఫ్రీ నంబర్లతో పాటు pndtmtpcomplaintsd mhohnk@gm-ail. comకి ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌ఓ అప్పయ్య, డీడబ్ల్యూఓ జయంతి, మాతా శిశు సంక్షేమ ప్రోగ్రాం అధికారి మంజుల, మాస్ మీడియా అధికారి అశోక్‌రెడ్డి పాల్గొన్నారు.
వరద ముంపు రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి..
హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య
కలెక్టరేట్‌లో సమన్వయ సమావేశం