
‘సూపర్’ ఆస్పత్రి పనులు త్వరగా పూర్తిచేయాలి
ఎంజీఎం : ప్రజలకు అత్యాధునిక వైద్య సేవలు అందించేందుకు నిర్మిస్తున్న వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి పనులు త్వరగా పూర్తిచేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు అధికారులను ఆదేశించారు. సోమవారం ఆర్ అండ్‌బీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్‌రాజ్, హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు ప్రావీణ్య, సత్యశారద, ఉన్నతాధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో ఆయన ఆస్పత్రి నిర్మాణాన్ని పరిశీలించారు. అనంతరం సంబంధిత అధికారులు, నిర్మాణ సంస్థ ప్రతినిధులతో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో రామకృష్ణరావు మాట్లాడుతూ.. ఉత్తర తెలంగాణ ప్రజల వైద్య అవసరాల కోసం నిర్మిస్తున్న వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని త్వరగా అందుబాటులోకి తేవాలనే సంకల్పంతో సీఎం రేవంత్‌రెడ్డి ఉన్నారని పేర్కొన్నారు. ఈ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ఐకానిక్ అని.. దేశంలోనే అత్యధిక నిధులతో మెరుగైన వైద్య సేవలు, ఆధునిక సదుపాయాలతో నిర్మిస్తున్నదని చెప్పారు. నిర్దేశిత గడువులోగా పూర్తయ్యేలా పనుల్లో మరింత వేగం పెంచాలన్నారు. సమావేశంలో డైరెక్టర్ ఆఫ్ మెడికల్ హెల్త్ నరేంద్రకుమార్, ఆర్ అండ్ బీ చీఫ్ ఇంజనీర్ రాజేశ్వర్‌రెడ్డి, ఎస్‌ఈ నాగేంద్ర, ఎల్‌అండ్‌టీ ఏరియా మేనేజర్ వెంకట్‌రెడ్డి, కేఎంసీ ప్రిన్సిపాల్ రాంకుమార్ రెడ్డి, ఎంజీఎం సూపరింటెండెంట్ కిషోర్, సంబంధిత శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
సీఎస్‌ను కలిసిన ప్రజాప్రతినిధులు, కలెక్టర్లు
హైదరాబాద్ నుంచి వరంగల్ ఎన్‌ఐటీ అతిథి గృహానికి చేరుకున్న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుకు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, ‘కుడా’ చైర్మన్ ఇనగాల వెంకట్రాంరెడ్డి, వరంగల్, హనుమకొండ కలెక్టర్లు డాక్టర్ సత్యశారద, ప్రావీణ్య, జీడబ్ల్యూఎంసీ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే మర్యాదపూర్వకంగా క లిసి పూల మొక్కలు అందించి స్వాగతం పలికారు.
సీఎస్ కె.రామకృష్ణారావు
పనుల పరిశీలన..
ఉన్నతాధికారులతో సమీక్ష