
పోస్టుమార్టం అంతా గోప్యం!
ఎంజీఎం/మామునూరు: తెలంగాణ–ఛత్తీస్‌గఢ్ సరిహద్దులోని పేరూరు–లంకపల్లి అడవుల్లో గురువారం తెల్లవారుజామున జరిగిన పరస్పర కాల్పుల్లో ముగ్గురు గ్రేహౌండ్ కమాండర్లు మందుపాతర పేలి చనిపోయారని పోలీసులు ప్రకటించారు. వారి మృతదేహాలను ప్రత్యేక హెలికాప్టర్‌లో గురువారం మధ్యాహ్నం వరంగల్ మామునూరు ఎయిర్‌పోర్ట్‌కు తీసుకువచ్చారు. అక్కడినుంచి మామునూరు ఏసీపీ తిరుపతి పర్యవేక్షణలో పటిష్ట బందోబస్తు నడుమ ప్రత్యేక అంబులెన్స్‌లో ఎంజీఎం మార్చురీకి తరలించారు. ఇద్దరు ఇన్‌స్పెక్టర్లు, ఇద్దరు ఏసీపీ స్థాయి అధికారులు, ముగ్గురు తహసీల్దార్లు, గ్రేహౌండ్స్ అధికారులు నాలుగు గంటలపాటు రహస్యంగా పోస్టుమార్టం చేయించారు. కనీసం మార్చురీ వద్ద మృతి చెందిన పోలీసుల పేర్లు వెల్లడించలేదు. సాయంత్రం 6 గంటలకు పోస్టుమార్టం పూర్తయ్యింది. ఆ తర్వాత డీజీపీ జితేందర్, ఏడీజీ గ్రే హౌండ్స్ స్టీఫెన్ రవీంద్ర ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. నక్సలైట్ల దాడిలో గ్రే హౌండ్స్‌కు చెందిన కమాండర్లు వడ్ల శ్రీధర్, ఎన్.పవన్ కళ్యాణ్, టి.సందీప్ చనిపోయినట్లు సాయంత్రం మీడియాకు అధికారికంగా ఒక ప్రకటన విడుదల చేశారు. అనంతరం మృతదేహాలను చాపల్లో చుట్టి ప్రత్యేక బందోబస్తు నడుమ పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌కు తరలించారు. అక్కడ కమాండర్ల మృతదేహాలకు రాష్ట్రమంత్రి ధనసరి సీతక్క, డీజీపీ జితేందర్, ఏడీజీ గ్రే హౌండ్స్ స్టీఫెన్ రవీంద్ర, ఎమ్మెల్యేలు నాగరాజు, రాజేందర్ రెడ్డి, ప్రకాశ్‌రెడ్డి, మేయర్ గుండు సుధారాణి, సీపీ సన్ ప్రీత్ సింగ్, ములుగు ఎస్పీ డాక్టర్ శబరీష్ నివాళులర్పించారు. కాగా, ముగ్గురు జవాన్లలో ఇద్దరు హైదరాబాద్, మరొకరు కామారెడ్డికి ప్రాంతానికి చెందిన వారు.
బుల్లెట్ గాయాలతోనే మృతి..
బుల్లెట్ గాయాలతోనే జవాన్లు మృతిచెందినట్లు పోస్టుమార్టం ద్వారా స్పష్టంగా వెల్లడైంది. ల్యాండ్‌మైన్ పేలడంతోనే జవాన్లు చనిపోయి ఉంటే మృతదేహాలు చెల్లాచెదురయ్యేవి. కాగా, ముగ్గురు జవాన్లకు ఐదు బుల్లెట్లు దిగినట్లు తెలుస్తోంది. మెడ, పక్కటెముకలు, కడుపులోకి బుల్లెట్లు వెళ్లడంతో వారు మృతి చెందినట్లు సమాచారం. ఈ ఘటనలో మరో ఇద్దరు జవాన్లకు తీవ్ర గాయాలయ్యాయి. పైడిపల్లికి చెందిన ఆర్‌ఎస్సై రణధీర్‌ను అత్యవసర వైద్యసేవల కోసం హైదరాబాద్ ఏఐజీకి తరలించి చికిత్స అందిస్తున్నారు.
మార్చురీ వద్ద కనిపించని కుటుంబ సభ్యులు..
సాధారణంగా మార్చురీ వద్ద మృతదేహాలకు పోస్టుమార్టం చేస్తుండగా వారి కుటుంబ సభ్యులు ఉంటారు. కానీ, పోలీస్ సిబ్బంది, గ్రేహౌండ్స్ ఉన్నతాధికారులు ముగ్గురు జవాన్ల కుటుంబ సభ్యులు, బంధుమిత్రులను పోస్టుమార్టం వద్దకు రానివ్వకుండా పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌కు తరలించారు.
ఎంజీఎం మార్చురీ వద్ద కమాండర్ల పేర్లు వెల్లడించని అధికారులు
డీజీపీ వచ్చాక సాయంత్రం
అధికారిక ప్రకటన విడుదల
ప్రత్యేక బందోబస్తుతో హెడ్‌క్వార్టర్స్‌కు మృతదేహాల తరలింపు

పోస్టుమార్టం అంతా గోప్యం!

పోస్టుమార్టం అంతా గోప్యం!

పోస్టుమార్టం అంతా గోప్యం!