
మత్తు పదార్థాలను నియంత్రించాలి
వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్‌సింగ్
వరంగల్/మామునూరు: మత్తు పదార్థాలను నియంత్రించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ (సీపీ) సన్‌ప్రీత్‌సింగ్ సూచించారు. మామునూరు, ఏనుమాముల, గీసుకొండ పోలీస్‌స్టేషన్లను ఈస్ట్‌జోన్ డీసీపీ అంకిత్‌కుమార్, మామునూరు ఏసీపీ తిరుపతితో కలిసి సీపీ మంగళవారం సందర్శించారు. ఆయా పోలీస్ స్టేషన్ల పరిసరాలు, హాజరు రిజిస్టర్లు, పలు కేసుల ఫైళ్లను సీపీ పరిశీలించారు. స్టేషన్‌న్ల పరిధిలో సెక్టార్ల వారీగా ఎస్సైలు నిర్వర్తిస్తున్న విధులు, బ్లూకోల్ట్స్ సిబ్బంది పనితీరును ఇన్‌స్పెక్టర్లు రమేశ్, రాఘవేందర్, మహేందర్‌ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సీపీ సన్‌ప్రీత్‌సింగ్ మాట్లాడుతూ స్టేషన్ల ఇన్‌స్పెక్టర్లు తప్పనిసరిగా రౌడీషీటర్లపై నిఘా పెట్టి వారి స్థితిగతులపై ఆరా తీయాలని అన్నారు. సైబర్ నేరాలకు సంబంధించి కేసు నమోదు చేయడమేకాకుండా నిందితులను అరెస్టు చేయాలని సూచించారు. నేరాల నియంత్రణకు విజిబుల్ పెట్రోలింగ్ నిర్వహించాలని సీపీ పేర్కొన్నారు. ఆయన వెంట ఎస్సైలు కృష్ణవేణి, శ్రీకాంత్, రాజు, సిబ్బంది ఉన్నారు.