వరంగల్ కలెక్టర్ సత్య శారద
వరంగల్: వరంగల్ జిల్లా సమీకృత కలెక్టరేట్ నిర్మాణ పనుల్లో వేగం పెంచి గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. వరంగల్‌లోని పాత ఆజంజాహి మిల్స్ గ్రౌండ్స్‌లో 16.7 ఎకరాల విస్తీర్ణంలో రూ.80 కోట్ల వ్యయంతో చేపట్టిన కలెక్టరేట్ నిర్మాణ పనుల పురోగతిని బ్లూ ప్రింట్ మ్యాప్ ప్రకారం మంగళవారం అదనపు కలెక్టర్ సంధ్యారాణితో కలిసి కలెక్టర్ పరిశీలించారు. సంబంధిత కాంట్రాక్టర్, ఇంజనీరింగ్ అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. 60 శాతం పనులు పూర్తయ్యాయని, ఫినిషింగ్ పనులు పూర్తి చేయాల్సి ఉందని అధికారులు కలెక్టర్‌కు వివరించారు. నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ 2025 సెప్టెంబర్ చివరి నాటికి పూర్తిచేయాలని కలెక్టర్ ఆదేశించారు. డీఆర్‌ఓ విజయలక్ష్మి, ఆర్డీఓ సత్యపాల్‌రెడ్డి, ఆర్‌అండ్‌బీ జిల్లా అధికారి రమేశ్, డీఈ శ్రీధర్, కలెక్టరేట్ ఏఓ విశ్వప్రసాద్, ఏఈ శ్రీకాంత్, తహసీల్దార్ ఇక్బాల్ పాల్గొన్నారు.
అభివృద్ధి పనులపై సమీక్ష..
మామునూరు ఎయిర్‌పోర్టు, కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్కు, గ్రీన్ ఫీల్డ్ ఇన్నర్ రింగ్ రోడ్డుకు సంబంధించిన పనులపై కలెక్టర్ సత్యశారద సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వరంగల్ ఏనుమాముల, గీసుకొండ, ఖిలావరంగల్ ఇన్నర్‌రింగ్ రోడ్డు పనుల్లో భూములు కోల్పోయిన రైతులకు డబ్బులు చెల్లించుటకు సిద్ధంగా ఉన్నాయని, ఆ పనులు పూర్తి చేసే ప్రక్రియలో వేగం పెంచాలని ఆర్డీఓను ఆదేశించారు. ఎయిర్‌పోర్టు పనుల్లో భాగంగా ఖిలావరంగల్‌లోని నక్కలపల్లి, గాడిపల్లిలో సర్వే పూర్తయిందని పనులు పురోగతికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వరంగల్, నర్సంపేట ఆర్డీఓలు సత్యపాల్‌రెడ్డి, ఉమారాణి, తహసీల్దార్లు నాగేశ్వరరావు, ఇక్బాల్, రాజ్‌కుమార్, రియాజుద్దీన్, వెంకట్‌స్వామి పాల్గొన్నారు.
ఔషధ గిడ్డంగిని తనిఖీ చేసిన కలెక్టర్..
ఖిలా వరంగల్: రంగశాయిపేటలోని కేంద్ర ఔషధ గోదాంను కలెక్టర్ సత్యశారద తనిఖీ చేశారు. అనధికారికంగా విధులకు గైర్హాజరైన సూపర్‌వైజర్ నాగమణి, ప్యాకర్ చక్రపాణికి వెంటనే షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ను కలెక్టర్ ఆదేశించారు. సెలవు పెట్టకుండా విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో తహసీల్దార్లు బండి నాగేశ్వర్‌రావు, ఇక్బాల్ పాల్గొన్నారు.