హన్మకొండ: ప్రజలకోసం రాష్ట్ర ప్రభుత్వం ఏంచేసిందో చెప్పుకోవాలని నిర్ణయించింది. ప్రతీ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమం, పథకాలను ప్రజల ముందుంచనుంది. ఈ మేరకు ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన రూ.2లక్షల రుణమాఫీ, రైతుభరోసా లబ్ధిదారుల జాబితాను గ్రామాల్లో ప్రదర్శించాలని నిర్ణయించింది. గత ప్రభుత్వం రూ.లక్షలోపు రుణం మాఫీ చేయగా అసెంబ్లీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం రూ.2 లక్షల్లోపు రుణాలు మాఫీ చేసింది. ఈ ఘనతను ప్రజల ముందుకు తీసుకెళ్లాలన్న ఆలోచనలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో వ్యవసాయ శాఖ రుణమాఫీ లబ్ధిదారుల జాబితాతో ఫ్లెక్సీలు రూపొందించనుంది. ఈ మేరకు జిల్లాల వారీగా జిల్లా వ్యవసాయాధికారులు ఫ్లెక్సీల ప్రింటింగ్, ప్రదర్శనకు టెండర్లు పిలిచారు. ప్రతీ గ్రామంలో మూడు ముఖ్య కూడళ్లలో లబ్ధిదారుల జాబితాతో ముద్రించిన ఫ్లెక్సీలను ప్రదర్శిస్తారు. దీంతోపాటు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు భరోసా లబ్ధిదారుల వివరాలు కూడా ప్రదర్శించాలని నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు నాలుగు ఎకరాల వరకు రైతు భరోసా ప్రభుత్వం విడుదల చేసింది. ఉగాది పండుగ నాటికి గ్రామాల్లో రుణమాఫీ, రైతు భరోసా లబ్ధిదారుల వివరాలతో కూడిన ఫ్లెక్సీలు కళకళలాడనున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో రూ.2 లక్షలలోపు రుణాలు రూ.96,89,400లు మాఫీ అయింది. రైతు భరోసా రైతుల ఖాతాలో జమ చేస్తున్న క్రమంలో ఫ్లెక్సీ ప్రింటిగ్ నాటికి ఎంత మందికి ఎంత మొత్తంలో జమ చేసిన మేరకు జాబితాను ప్రదర్శించనున్నారు. హనుమకొండ జిల్లాలో మొత్తం 1,47,970మంది రైతులకు రూ.154,23,04,019 జమ చేయాల్సి ఉంది. ఈనెల 23 వరకు నాలుగు ఎకరాల వరకు భూమి కలిగిన 1 18,348 రైతుల ఖాతాల్లో రూ.90,29,09,744 జమ చేశారు.
విమర్శలను తిప్పికొట్టేందుకేనా..
సర్కారు రుణమాఫీ సరిగా చేయలేదని విపక్షాలు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నాయి. యాసంగి సాగు పూర్తయి, పంటలు చేతికి వచ్చే సమయం వచ్చినా పూర్తిస్థాయిలో రైతు భరోసా ఇవ్వలేదని ఎండగడుతున్నాయి. ఈ క్రమంలో వారి విమర్శలు తిప్పికొట్టేలా నేరుగా రుణమాఫీ, రైతు భరోసా లబ్ధిదారుల జాబితాను బహిరంగంగా గ్రామాల్లోని ముఖ్య కూడళ్లలో ప్రదర్శించి వారి నోళ్లు మూయించాలనే ఆలోచనతో ముందుకు సాగుతున్నట్లు కనిపిస్తోంది. ఏ రైతుకు ఎంత రుణమాఫీ జరిగింది, ఎంత రైతు భరోసా వచ్చిందన్న వివరాలతో కూడిన జాబితాను గ్రామాల్లో ప్రదర్శించడం ద్వారా తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వ ప్రయత్నంగా తెలుస్తోంది. తద్వారా గ్రామ పంచాయతీ, మండల, జిల్లా ప్రాదేశిక ఎన్నికల్లో లబ్ధిపొందాలనే ఆలోచన ఇందులో దాగి ఉందనే చర్చ కూడా సాగుతోంది.
ప్రతీ గ్రామంలోని మూడు కూడళ్లలో రుణమాఫీ లబ్ధిదారుల
వివరాల ప్రదర్శన
ఫ్లెక్సీల తయారీ ప్రదర్శనకు టెండర్లు పిలిచిన వ్యవసాయ శాఖ
ఉగాది నాటికి ప్రదర్శించాలని నిర్ణయం
ఉమ్మడి వరంగల్ జిల్లాలో రూ.96,89,400 రుణమాఫీ