నివారణకు ఓఆర్‘ఎస్’
ఉచితంగా వైద్యసేవలు
అతిసార ప్రాణాంతకం
గుంటూరు మెడికల్: డయేరియా సోకినప్పుడు పెద్దవారు చేసే కొద్దిపాటి నిర్లక్ష్యంతో పిల్లల ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది. అతిసార వ్యాధిని సకాలంలో గుర్తించి చికిత్స అందించని పక్షంలో ప్రాణాలు పోతాయి. దేశంలో చంటి బిడ్డల్లో అతిసారం ప్రధాన సమస్యగా మారింది. ప్రతి ఏడాది 4.3శాతం చిన్నారులు అతిసార వ్యాధితో చనిపోతున్నారు. జిల్లాలో 2024లో 93 మంది ఐదేళ్లలోపు చిన్నారులు , 2025లో 105 మంది, 2026 జనవరి నుండి మే నెల వరకు 66 మంది అతిసార వ్యాధి బారిన పడ్డారు. పిల్లల్లో డయేరియా మరణాలను నివారించడమే లక్ష్యంగా ఈనెల 16 నుంచి 31 వరకు జిల్లా వ్యాప్తంగా డయేరియా (అతిసారవ్యాధి) నియంత్రణ కార్యక్రమాలు, అవగాహన ర్యాలీలు నిర్వహిస్తున్నారు.
సాధారణ విరేచనం కంటే ఎక్కువ నీరు లేదా, పూర్తిగా నీళ్ల విరోచనం అవుతూ ఉంటే పిల్లలకు అతిసార వ్యాధి సోకినట్లు గుర్తించాలి. ఐదేళ్లలోపు పిల్లలకు రోజులో మూడు సార్లుకంటే ఎక్కువ సార్లు మోషన్స్ అవడం, విరేచనంలో నీటి శాతం ఎక్కువగా ఉంటే దానిని అతిసారగా గుర్తించి తక్షణమే వైద్యులను సంప్రదించాలి. అతిసార వైరస్‌ద్వారా సోకుతోంది. ఈ వ్యాధి సోకిన వారిలో నీటి శాతం బాగా తగ్గిపోతుంది. బిడ్డకు చంచలత్వం, చిరాకు, మైకం, అపస్మారక స్థితి, కళ్లు లోపలికి వెళ్లినట్లు ఉండటం, చర్మం స్థితిస్థాపకత లేకపోవడం, సున్నితంగా నొక్కడం వల్ల చర్మం చాలా నెమ్మదిగా సాధారణ స్థితికి చేరుకోవడం, బిడ్డ చాలా దాహంతో ఉండటం, నీరు తాగులేకపోవడం, లక్షణాలు కనిపిస్తే తక్షణమే డయేరియాగా నిర్ధారించుకుని వైద్యులను సంప్రదించాలి.
జిల్లాలో డయేరియా వ్యాధి నియంత్రణ, డయేరియా మరణాల నివారణే లక్ష్యంగా 15 రోజులపాటు స్టాప్– డయేరియా పేరుతో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఏఎన్‌ఎం, ఆశా, అంగన్‌వాడీ కార్యకర్తలు ప్రతి ఇంటికి తిరిగి ఐదేళ్లలోపు వయస్సు ఉన్న చిన్నారులను గుర్తించి వారికి ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు, జింక్ మాత్రలు అందిస్తున్నారు. హ్యాండ్ వాష్‌పై ఆసుపత్రుల్లో, ఇళ్ల వద్ద అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా పిల్లలు వ్యాధి బారిన పడకుండా ముందస్తుగా చర్యలు తీసుకుంటున్నాం. పాఠశాలల్లో అవగాహన కార్యక్రమాలు, అంగన్‌వాడీ కేంద్రాల్లో ఓఆర్‌ఎస్ – జింక్ కార్నర్స్ ఏర్పాటు చేస్తున్నాం.
– డాక్టర్ అమర్తలూరి శ్రావణ్‌బాబు, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి, గుంటూరు
డయేరియాను ఓఆర్‌ఎస్‌తో పూర్తిగా కట్టడి చేయవచ్చు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు అందిస్తున్నారు. శుభ్రమైన పాత్రలో ఒక లీటరు తాగునీటిని పోసి నీటిని కాచి చల్లార్చి అందులో ఒక ఓఆర్‌ఎస్ ప్యాకెట్‌ను పోయాలి. పరిశుభ్రమైన స్పూన్‌తో ఓఆర్‌ఎస్ పొడిని కాచిచల్లార్చిన నీటినిలో కలిసిపోయేలా తిప్పాలి. పిల్లవాడి వయస్సు, శరీర బరువును బట్టి ఓఆర్‌ఎస్ ద్రావణం ఇవ్వాలి. రెండు నెలలకంటే తక్కువ వయస్సు ఉన్న శిశువుకు ప్రతి విరేచనం తరువాత ఐదు స్పూన్‌ల ద్రావణం పట్టించాలి. రెండు నెలల నుంచి రెండు సంవత్సరాల పిల్లలకు ప్రతి విరేచనం తరువాత అరకప్పు, రెండు నుంచి ఐదు సంవత్సరాల పిల్లలకు ప్రతి విరేచనం తరువాత ఒక కప్పు ఓఆర్‌ఎస్ ద్రావణం తాగించాలి. అతిసార వ్యాధి మొదలైన నాటి నుంచి విరేచనాలు తగ్గే వరకు పిల్లలకు ఓఆర్‌ఎస్ ఇవ్వాలి. తల్లులు పాలు తాగుతున్న పిల్లలకు తప్పనిసరిగా మోషన్స్ అవుతున్నా కూడా బ్రెస్ట్‌మిల్క్ ఆపకూడదు. దాంతోపాటుగా, గంజి, కొబ్బరి నీరు, పలుచని పప్పుచారు ఇవ్వడం మంచిది. ఓఆర్‌ఎస్‌తోపాటుగా జింక్ మాత్రలను కూడా పిల్లలకు ఇవ్వాలి. అతిసార వ్యాధి తీవ్రతను జింక్ మాత్ర తగ్గిస్తోంది.
డయేరియా సోకిన చిన్నారులకు అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా వైద్య సేవలందిస్తున్నాం. డయేరియా వ్యాధిపై అవగాహన, చికిత్స ఏవిధంగా అందించాలనే విషయాలపై అన్ని ఆరోగ్య కేంద్రాల్లో ఓఆర్‌ఎస్ – జింక్ కార్నర్లు ఏర్పాటు చేశాం. డయేరియా సోకిన చిన్నారులకు ఏవిధంగా వైద్యం అందించాలనే విషయాలపై వైద్యులు, వైద్య సిబ్బందికి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాం. జిల్లా వ్యాప్తంగా ఐదేళ్లలోపు చిన్నారులు 1,45,000 మంది ఉన్నారు. వీరికి 2,14,630 ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు, 1,07,450 జింక్ మాత్రలు గ్రామస్థాయిలో వైద్య సిబ్బంది వద్ద అందుబాటులో ఉంచాం. అదనంగా రిజర్లు స్టాక్‌ను ఆయా ఆరోగ్య కేంద్రాల్లో, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ మెడికల్ స్టోర్స్ విభాగంలో సిద్ధంగా ఉంచాం.
– డాక్టర్ కొర్రా విజయలక్ష్మి,
డీఎంహెచ్‌ఓ, గుంటూరు


