ఇసుకాసురుల ఇష్టారాజ్యం | - | Sakshi
Sakshi News home page

ఇసుకాసురుల ఇష్టారాజ్యం

Jun 14 2026 7:04 AM | Updated on Jun 14 2026 7:04 AM

ఇసుకాసురుల ఇష్టారాజ్యం

పెదకూరపాడులో నియోజకవర్గంలో రెచ్చిపోతున్న ఇసుకు మాఫియా నదుల్లో ఇసుక తవ్వకాలపై జూన్‌ 1 నుంచి నిషేధం ఉన్నా ఆగని వైనం ఈ నెల మొదటి వారంలో ‘సాక్షి’ కథనంతో దారిని తవ్వేసిన అధికారులు రెండు రోజులుగా మళ్లీ మొదలైన అక్రమ తవ్వకాలు అధికారులు తవ్విన దారిని పూడ్చి రేయింబవళ్లు ఇసుక తరలింపు పట్టించుకోని మైనింగ్‌, విజిలెన్స్‌, పోలీసు అధికారులు

కనిపించని టాస్క్‌ఫోర్స్‌ టీం

సహజ సంపదలను కొల్లగొడుతూ అక్రమార్జనకు అలవాటు పడ్డ పెదకూరపాడు ఇసుక మాఫియా ఆగడాలకు అడ్డూఅదుపులేకుండా పోతోంది. నదిలో ఇసుక తవ్వకాలపై నిషేధం ఉన్నా స్థానిక ప్రజాప్రతినిధి అండదండలతో ఏమాత్రం పట్టించుకోకుండా నదీగర్భాన్ని చీల్చి సొమ్ము చేసుకుంటున్నారు. ఇసుకాసురులు బరితెగించి దోచుకుంటున్నా అధికారులు స్పందించకపోవడంతో మరింత విర్రవీగిపోతున్నారు.

సాక్షి కథనానికి స్పందించి ఇసుక రీచ్‌లోకి వాహనాలు వెళ్లకుండా దారికి గాడి కొట్టిన అఽధికారులు

సాక్షి, నరసరావుపేట: కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ నిబంధనల ప్రకారం కృష్ణా తీరంలో ‘మాన్‌సూన్‌ హాలీడే’ జూన్‌ 1 నుంచి అక్టోబర్‌ 15వ తేదీ వరకు ఉండటంతో ఇసుక తవ్వకాలపై నిషేధం అమలులోకి వచ్చింది. వర్షాకాలంలో నదుల్లో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటం, వరదలు వచ్చే అవకాశం ఉండటంతో ఇసుక తవ్వకాలు జరపడం ప్రమాదకరం. నది జీవజాలం, పర్యావరణ పునరుజ్జీవనానికి ఈ విరామం ఎంతో అవసరం. అచ్చంపేట, అమరావతి మండలాల్లో జూన్‌ 1, 2వ తేదీలలో సైతం రాత్రీపగలు తేడా లేకుండా భారీ వాహనాలతో ఇసుకను తరలిస్తున్న ఫొటోలతో ‘సాక్షి’ పత్రికలో జూన్‌ 3వ తేదీన ‘చెలరేగిపోతున్న ఇసుకాసురులు’ పేరిట కథనం ప్రచురితమైంది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో అధికారులు స్పందించి చర్యలకు ప్రారంభించారు. అచ్చంపేట మండలం చింతపల్లి, అమరావతి మండలం పొందుగల ఇసుక రీచ్‌లలోకి వాహనాలు వెళ్లకుండా దారికి అడ్డంగా గాడి కొట్టించారు. రీచ్‌లలో ఇసుక రవాణా జరిపేందుకు ఎలాంటి అనుమతులు లేవంటూ ప్రకటనలు జారీ చేసి చేతులు దులుపుకొన్నారు.

గాడి పూడ్చి అక్రమ రవాణా...

ఇసుక రీచ్‌లలోకి వాహనాలు వెళ్లకుండా అధికారులు కొట్టిన గాడిని మాఫియా పూడ్చివేసింది. గత రెండు రోజులుగా చింతపల్లి, పొందుగల–2 రీచ్‌లలోకి నిబంధనలకు విరుద్ధంగా జేసీబీలను పంపి తవ్వి లారీలు, ట్రాక్టర్ల ద్వారా ఇసుకను యథేచ్ఛగా తరలిస్తున్నారు. అధికారులు దారికి గాడి కొట్టిన తరువాత నది సమీపంలో భారీ యంత్రాలను అక్కడ నుంచి పంపేయాలి. వాటిని అక్కడే ఉంచడంతో రాత్రిపూట, సెలవు రోజుల్లో గాడిని పూడ్చి అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారు. ఎన్జీటీ ఆదేశాలు బేఖాతరు చేస్తున్నా మైనింగ్‌, ఇరిగేషన్‌, పోలీసు, విజిలెన్స్‌, రవాణా శాఖల అధికారులు పట్టించుకుంటున్న పాపానపోలేదు. ఇసుక రీచ్‌లలో భారీ యంత్రాలతో గాడిని పూడ్చి ఇసుక తరలిస్తున్నా అధికారులకు తెలియకుండా ఎలా ఉంటుందని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.

అడ్డుకుంటాం...

పెదకూరపాడు నియోజకవర్గ పరిధిలో ఇసుక రీచ్‌లలోకి వాహనాలు వెళ్లకుండా కొట్టిన గాడిని పూడ్చి ఇసుక రవాణా చేయడంపై పల్నాడు జిల్లా మైనింగ్‌ శాఖ ఏడీ నాగయ్యను వివరణ కోరగా... గాడిని పూడ్చి ఇసుక తరలిస్తున్న విషయం తనకు తెలియదని చెప్పారు. అచ్చంపేట, అమరావతి మండలాల తహసీల్దార్‌లను ఇసుక తరలింపును అడ్డుకోమని ఆదేశిస్తానని తెలిపారు. ఈ సమయంలో ఇసుక తవ్వకాలకు అనుమతి లేదన్నారు. టాస్క్‌ఫోర్స్‌ టీం ఏర్పాటు చేశామని, వారు అక్రమ రవాణాను అడ్డుకుంటారని తెలిపారు.

ఇసుక అక్రమ రవాణా, తవ్వకాలను అడ్డుకోవడానికి ప్రభుత్వం ప్రత్యేక నిఘా బృందాలను రంగంలోకి దించాలి. ఈ టాస్క్‌ఫోర్స్‌ టీంలో మైనింగ్‌, రెవెన్యూ, జలవనరుల శాఖ, పోలీస్‌, రవాణా శాఖల అధికారులు ఉంటూ కృష్ణానది తీరప్రాంతాల్లో నిఘా ఉంచాల్సి ఉంది. నిబంధనలు ఉల్లంఘించి ఇసుకను అక్రమంగా తరలిస్తే వాహనాలను సీజ్‌ చేయడంతోపాటు భారీ జరిమానాలు, క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలి. ఇవేవీ పెదకూరపాడు నియోజకవర్గంలో జరగడం లేదు. అచ్చంపేట, అమరాతి మండలాల్లో నిషేధ సమయంలో ఇసుకను అక్రమంగా తరలిస్తున్నా టాస్క్‌ఫోర్స్‌ టీం స్పందించి అక్రమ రవాణాను అడ్డుకొని చర్యలు తీసుకోవడం లేదు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement