బస్టాండ్ వద్ద ప్రైవేట్ బస్సుల బహిరంగ దోపిడీ సమీపంలో బస్సు నిలపకూడదన్న నిబంధనలకు నీళ్లు తూతూమంత్రంగా ఆర్టీఏ అధికారుల తనిఖీలు అడ్డగోలుగా టికెట్ ధరలు పెంచినా చర్యలు శూన్యం
నిబంధనలను తుంగలో తొక్కి తమను అడిగేది ఎవరన్నట్లు వ్యవహరిస్తున్నారు... వ్యాపారాలకు ఇబ్బంది అవుతోందని అంటే రవాణాశాఖ, ట్రాఫిక్ పోలీసులకు చెప్పుకోమని ఉచిత సలహా ఇస్తున్నారు. ఆర్టీసీ బస్టాండ్ వద్ద ప్రైవేట్ బస్సుల యాజమాన్యాలు వ్యవహరిస్తున్న దౌర్జన్య ధోరణి ఇది. సమస్య రోజురోజుకీ తీవ్రం అవుతోంది. కనీసం పట్టించుకునే నాథుడే లేకుండా పోయాడు. అటు ఆర్టీసీ ఆదాయానికి గండి పడుతున్నా.. ఇటు ట్రాఫిక్‌కు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నా.. అధికారులు మామూళ్ల మత్తులో మునిగి తనిఖీలు, చర్యలు మరిచారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
పట్నంబజారు: మోటార్ వెహికల్ రూల్స్‌ను బేఖాతరు చేస్తూ గుంటూరు ప్రైవేట్ బస్సుల యాజమాన్యాలు రోడ్డు రవాణా శాఖ అధికారులకు సవాలు విసురుతున్నాయి. నిత్యం నష్టాల బాటలో పయనిస్తున్న ఆర్టీసీ ఆదాయానికి మరింత గండి కొడుతున్నా.. ఆర్టీవో అధికారులు మాత్రం మొద్దు నిద్ర నటిస్తున్నారు. ఇప్పటికే మహిళలకు ఉచిత ప్రయాణంతో ఆర్టీసీపై పెనుభారం పడిన విషయం తెలిసిందే. నిత్యం లక్ష మంది ప్రయాణికులు గుంటూరు రీజియన్ పరిధిలో రాకపోకలు సాగిస్తున్నారు. అందులో 40 నుంచి 60 శాతం మంది మహిళలే ఉన్నారు. ఇక లాభాల మాట పక్కన పెడితే... నిత్యం రూ. కోటి ఆదాయం ఉండే ఆర్టీసీకి ప్రైవేట్ యాజమాన్యాల వలన జిల్లా వ్యాప్తంగా రూ.5 లక్షలకుపైగానే నష్టం వాటిల్లుతోంది.
గుంటూరు నగరంలో 150కుపైగా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు ఉండగా, జిల్లా వ్యాప్తంగా 250పైగా ఉన్నాయని తెలుస్తోంది. మోటార్ వెహికల్ చట్టం 1988 రాష్ట్ర రవాణా శాఖ మార్గదర్శకాల ప్రకారం, ప్రభుత్వ ఆర్టీసీ బస్టాండ్ రెండు కిలోమీటర్ల పరిధిలో బస్సులు నడపకూడదనే నిబంధనలు స్పష్టంగా ఉన్నాయి. ఇది నగరాల్లో వర్తిస్తే.. సాధారణంగా డిపోలకు కనీసం కిలోమీటరు దూరంలోపు బస్సులు నిలపకూడదు. ఆర్టీసీ బస్టాండ్ వద్ద ప్రైవేట్ బస్సులు నిలపడం, ప్రయాణికులను ఎక్కించడం పూర్తిగా నిషిద్ధం. ఈ నిబంధనలలో ముఖ్యంగా బస్టాండ్ చుట్టూ ‘‘నో–పార్కింగ్, నో–పికప్ జోన్’’గా ప్రకటించారు. ఈ నియమాల వెనుక ఉద్దేశం ప్రభుత్వ రవాణా సంస్థ అయిన ఆర్టీసీ ఆదాయాన్ని కాపాడటమే కాకుండా బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్‌ను నియంత్రించడం. ప్రయాణికులకు భద్రత పెంచడం.
అంతా అడ్డగోలు
గుంటూరులో పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. బస్టాండ్ ప్రధాన గేట్లకు ఎదురుగానే ప్రైవేట్ బస్సులు నిలిపి ప్రయాణికులను ఎక్కించుకోవడం సాధారణంగా మారింది. ముఖ్యంగా సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి పదకొండు గంటల వరకు ఈ అక్రమ కార్యకలాపాలు అత్యధికంగా కనిపిస్తున్నాయి. రోడ్లపై అడ్డంగా బస్సులు నిలిపి, ప్రయాణికులను ఎక్కించుకుని వెళ్తున్నా.. ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడుతున్నా.. అధికారులు కనీసం పట్టించుకోని పరిస్థితి. అత్యవసర సేవలకు చెందిన వాహనాలు కూడా కదలలేని దుస్థితి ఏర్పడటం ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. అంతేకాకుండా రద్దీని ఆసరా చేసుకుని అడ్డగోలుగా టికెట్ ధరలు పెంచి వసూలు చేస్తున్నా కనీస చర్యలు తీసుకోవడంలోనూ అధికారులు తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.
నిత్యం ట్రాఫిక్ ఇక్కట్లు
నిబంధనల సంగతి అటుంచితే.. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు నిత్యం ఆర్టీసీ బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో ఇరువైపులా నిలుపుతున్నారు. దీంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలుగుతోంది. సాయంత్రం 5 నుంచి రాత్రి 11 గంటల వరకు ఇదే పరిస్థితి నెలకొంది. గతంలో ట్రాఫిక్ పోలీసులు బస్సులు నిలవకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ప్రస్తుతం ఇలాంటి చర్యలు లేకపోవటంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగి.. వాహనచోదకులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఇకనైనా ప్రైవేట్ ట్రావెల్స్‌పై కఠిన చర్యలు తీసుకోవాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఇదే సమయంలో గుంటూరులో శంకర్ విలాస్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఇప్పటికే ట్రాఫిక్ మళ్లింపులు అమలులో ఉన్న నేపథ్యంలో రోడ్లపై ఒత్తిడి పెరిగింది. ఈ పరిస్థితుల్లో ప్రైవేట్ బస్సులు అదనంగా రోడ్లను ఆక్రమించడం వల్ల ట్రాఫిక్ సమస్యలు మరింత తీవ్రం అయ్యాయి. వాహనదారులు గంటల తరబడి ట్రాఫిక్‌లో ఇరుక్కుపోతూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో ఉన్న వ్యాపారులు కూడా ఈ సమస్య వల్ల తీవ్రంగా నష్టపోతున్నారు. వాహనాల రద్దీ కారణంగా కస్టమర్లు దుకాణాలకు చేరుకోలేకపోతున్నారు. పార్కింగ్ సౌకర్యం లేకపోవడం, నిరంతరం ఉండే ట్రాఫిక్ కారణంగా వ్యాపారం గణనీయంగా తగ్గిపోయింది. ఈ విషయంపై ప్రశ్నిస్తే, సంబంధిత వ్యక్తులు ‘‘అధికారులకు ఫిర్యాదు చేసుకోండి’’ అనే నిర్లక్ష్య సమాధానాలు ఇస్తున్నారని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నేరుగా రవాణాశాఖ అధికారులకు ఫిర్యాదు చేసినప్పటీకీ ఏ మాత్రం పట్టించుకోవటం లేదు. అక్రమంగా బస్సులు నిలిపితే జరిమానాలు విధించడం, పర్మిట్ సస్పెండ్ చేయడం లేదా రద్దు చేయడం వంటి చర్యలు తీసుకోవాలి. ఇవి పుస్తకాలకే పరిమితమయ్యాయని ప్రజలు విమర్శిస్తున్నారు.


