అడ్డగోలుగా పునర్విభజన చేస్తే ఉద్యమిస్తాం | - | Sakshi
Sakshi News home page

అడ్డగోలుగా పునర్విభజన చేస్తే ఉద్యమిస్తాం

May 20 2026 2:10 AM | Updated on May 20 2026 2:10 AM

టీడీపీకి అనుకూలంగా విభజన

డివిజన్లను సక్రమంగా విభజించలేదని టీడీపీ ఎమ్మెల్యేలే చెబుతున్నారు మంత్రి పెమ్మసాని, ఎమ్మెల్యేల మధ్య విభేదాల ప్రభావం దీనిపై పడితే ఊరుకోం 23న వైఎస్సార్‌సీపీ జిల్లా విభాగం తరఫున అభ్యంతరాల అందజేత జీఎంసీ పునర్విభజన ముసాయిదాలో అసమగ్రంగా వివరాలు పార్టీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు, నగర అధ్యక్షురాలు నూరి ఫాతిమా

గుంటూరు ఎడ్యుకేషన్‌: గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో చేపట్టిన డివిజన్ల పునర్విభజన ప్రక్రియలో నిబంధనలు కచ్చితంగా పాటించాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు డిమాండ్‌ చేశారు. డివిజన్ల పునర్విభజనపై పార్టీ గుంటూరు తూర్పు, ప్రత్తిపాడు, తాడికొండ, నియోజకవర్గాల సమన్వయకర్తలు, డివిజన్‌ పార్టీ అధ్యక్షులు, ముఖ్య నాయకులతో మంగళవారం బృందావన్‌గార్డెన్స్‌లోని వైఎస్సార్‌ సీపీ జిల్లా కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియా సమావేశంలో అంబటి రాంబాబు మాట్లాడుతూ నగరపాలక సంస్థలో ప్రస్తుతం ఉన్న 57 డివిజన్లను 76 డివిజన్లుగా పెంచేందుకు చేపట్టిన పునర్విభజన ప్రక్రియ నిబంధనలకు విరుద్ధంగా అశాసీ్త్రయంగా జరుగుతోందని ఆరోపించారు. దీనికి సంబంధించి విడుదల చేసిన ముసాయిదాలో ఎక్కడా స్పష్టత లేదని విమర్శించారు. ఒక్కో డివిజన్‌లో ఎంత జనాభా ఉన్నారనే వివరాలు లేకుండా అసమగ్ర వివరాలు పొందుపర్చారని అన్నారు. కొత్తగా ఏర్పడనున్న డివిజన్లలో జనాభా సంఖ్య ప్రతి డివిజన్‌కు మధ్య తేడా 10 శాతంలోపే ఉండాలని నిబంధనలు స్పష్టం చేస్తున్నాయని అన్నారు. దీనిపై వైఎస్సార్‌ సీపీ పరంగా ఆయా నియోజకవర్గాల సమన్వయకర్తలు, డివిజన్‌స్థాయిలో పార్టీ అధ్యక్షుల నుంచి సమగ్రమైన వివరాలు సేకరించి, పార్టీ పరంగా నివేదిక రూపొందిస్తామని చెప్పారు. డివిజన్ల పునర్విభజనలో నెలకొన్న లోపాలు, వాటిపై అభ్యంతరాలను ఈ నెల 23న పార్టీ తరఫున జిల్లా కలెక్టర్‌, నగరపాలక సంస్థ కమిషనర్‌కు సమగ్రంగా అందజేస్తామని చెప్పారు. అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని ఫైనల్‌ జాబితాలో పొందుపర్చాలని, ఆ మేరకు చర్యలు తీసుకోని పక్షంలో ఉద్యమానికి దిగుతామని స్పష్టం చేశారు.

టీడీపీలో వర్గపోరు

కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ కనుసన్నల్లో పునర్విభజన జరుగుతోందని, ఈ ప్రక్రియలో శాసీ్త్రయత లోపించిందని టీడీపీ ఎమ్మెల్యేలే ఆరోపిస్తున్నారని అంబటి అన్నారు. టీడీపీలో వర్గపోరుతో పునర్విభజన అడ్డగోలుగా చేస్తే అడ్డుకుంటామని హెచ్చరించారు. టీడీపీలో వర్గపోరు, పెమ్మసాని విధానాలపై వ్యతిరేకత అర్థం అవుతోందన్నారు. అశాసీ్త్రయ విధానాలపై పౌరులు, ప్రజా సంఘాలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ఈ నెల 24వ తేదీలోపు జిల్లా కలెక్టర్‌, నగర కమిషనర్లకు లిఖిత పూర్వకంగా అభ్యంతరాలు సమర్పించాలన్నారు.

నెహ్రూనగర్‌: పునర్విభజన ప్రక్రియ టీడీపీకి అనుకూలంగా చేశారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు అనుమానం వ్యక్తం చేశారు. ముసాయిదాపై మంగళవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో నగర కమిషనర్‌ మయూర్‌ అశోక్‌ని నగర అధ్యక్షురాలు, తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త షేక్‌ నూరి ఫాతిమా, ప్రత్తిపాడు నియోజకవర్గ సమన్వయకర్త బలసాని కిరణ్‌కుమార్‌, తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్త వనమా బాలవజ్రబాబు (డైమండ్‌ బాబు), ఇతర పార్టీ నేతలతో వెళ్లి కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారంలో ఉన్న టీడీపీ వాళ్లకు అనుకూలంగా డివిజన్ల పునర్విభజన చేసుకునే ప్రయత్నం చేస్తున్నారనే అనుమానం ఉందన్నారు. పలు అనుమాలను కమిషనర్‌ తీర్చే ప్రయత్నం చేశారని చెప్పారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి నిమ్మకాయల రాజనారాయణ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement