గుంటూరు రూరల్: ఇళ్ల గణనలో ప్రజలు భాగస్వామ్యం కావాలని జిల్లా కలెక్టర్ సి.యం.సాయికాంత్ వర్మ పిలుపునిచ్చారు. మండలంలోని బుడంపాడు గ్రామంలో జన గణన జరుగుతున్న తీరును జిల్లా కలెక్టర్ మంగళవారం పరిశీలించారు. ఇళ్ల యజమానులతో స్వయంగా మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఎన్యూమరేషన్‌కి సంబంధించి హద్దులు సరిచూసుకుని మే 30వ తేదీ వరకు ప్రతి ఇంటిని సందర్శించి, మ్యాప్ ఆధారంగా యాప్‌లో వివరాలు నమోదు చేస్తారని కలెక్టర్ చెప్పారు. ప్రజలు ఇచ్చే వ్యక్తిగత సమాచారం చాలా సురక్షితంగా ఉంటుందన్నారు. సరైన సమాచారం ఇవ్వడం వల్ల భవిష్యత్తులో ప్రభుత్వ పథకాలు, అంగన్‌వాడీ కేంద్రాలు, నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పన తదితర ప్రణాళికలు రూపొందించడానికి వీలవుతుందన్నారు. కచ్చితమైన సమాచారాన్ని ఎన్యూమరేటర్లకు అందించాలని కోరారు. నగరపాలక సంస్థ కమిషనర్ కె.మయూర్‌అశోక్, తహసీల్దార్ సుభాని తదితరులు పాల్గొన్నారు.
గుంటూరు రూరల్: ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని గుర్తింపు పొందిన ప్రైవేటు వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలల్లో నిర్వహిస్తున్న రెండు, మూడు సంవత్సరాల వ్యవసాయ, సేంద్రియ వ్యవసాయ, విత్తన సాంకేతిక పరిజ్ఞానం, వ్యవసాయ ఇంజినీరింగ్ డిప్లమో కోర్సులలో ప్రవేశాలకు 2026–27 విద్యా సంవత్సరానికి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియకు గడువును ఈ నెల 31వ తేదీ వరకు పొడిగించినట్లు విశ్వవిద్యాలయం రిజిస్ట్ట్రార్ డాక్టర్ ఎ.మణి మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పూర్తి వివరాలకు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఏఎన్‌జీఆర్‌ఏయూ.ఏసీ.ఇన్ అనే వెబ్‌సైట్‌ను సందర్శించాలన్నారు.


