పట్టపగలు రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి బైక్ చోరీ హోటల్ ఎదుట పార్క్ చేసిన వాహనం నిమిషాల్లో మాయం
నరసరావుపేట టౌన్: పట్టపగలు జనసంచారం.. ఎవరికీ ఏమాత్రం అనుమానం రాకుండా.. ఇద్దరు అగంతకులు సినిమా స్టయిల్‌లో బైక్ చోరీకి పాల్పడ్డ ఘటన పట్టణంలో కలకలంరేపింది. నిమిషాల వ్యవధిలో హ్యాండిల్ లాక్‌ను విరగదీసి.. ఇంజిన్‌వైర్లు కలిపి బైక్ స్టార్ట్ చేసుకొని దర్జాగా అక్కడ నుంచి జారుకున్నారు. వివరాల్లోకెళ్లితే... వెంగళరెడ్డి కాలనీకు చెందిన విశ్రాంత ఆర్మీ ఉద్యోగి సయ్యద్ ఉస్మాన్ ప్రకాష్‌నగర్ ఓవర్ బ్రిడ్జి ఎంట్రన్స్ వద్దగల హోటల్ ఎదుట శుక్రవారం ద్విచక్రవాహనాన్ని నిలిపాడు. కొద్దిసేపటి తర్వాత వచ్చి చూడగా వాహనం కనిపించలేదు. ఈ మేరకు వన్‌టౌన్ పోలీసులకు బాధితుడు ఫిర్యాదు చేశాడు. పోలీస్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని హోటల్ వద్ద ఉన్న సీసీ పుటేజ్‌ను పరిశీలించారు. అందులో ఇద్దరు ఆగంతకులు ద్విచక్రవాహనాన్ని చాకచక్యంగా దొంగలించుకొని వెళ్లినట్లు గుర్తించారు. మొదట ఓ యువకుడు బైక్ దగ్గర చుట్టూ చూసుకుంటూ నిలబడ్డాడు. అనుమానం రాకుండా ఫోన్‌లో మాట్లాడుతున్నట్లు నటించాడు. కొద్దిసేపటికి మరో యువకుడు అక్కడికి చేరుకున్నాడు. ఆ తర్వాత వాహన హ్యాండిల్ లాక్‌ను విరగతీశాడు. అనంతరం ఇంజన్‌కు సంబంధించిన వైర్లు కలిపి స్టార్ట్‌చేసి అపహరించుకొని దర్జాగా వెళ్లారు. ఈ దృశ్యం అంతా సీసీ పుటేజ్‌లో నిక్షిప్తమై ఉంది. వాటిని స్వాధీనం చేసుకొని నిందితుల ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. పట్టపగలు జనసంచారం ఉన్న ప్రాంతంలో యదేచ్ఛగా ద్విచక్రవాహనాలు చోరీకి పాల్పడటంతో వాహన యజమానులు ఆందోళన చెందుతున్నారు.


