తెనాలిటౌన్: తల్లి జన్మనిస్తే తనకు రంగస్థలం జీవితాన్నిచ్చిందని మా–ఏపీ వ్యవస్తాపకులు, సినీదర్శకుడు దిలీప్ రాజా అన్నారు. స్థానిక చెంచుపేటలోని ఆలపాటినగర్‌లో గల మా–ఏపీ కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం ప్రపంచ రంగస్థల దినోత్సవం నిర్వహించారు. పెదరావూరు ఫిలిం స్టూడియోస్ మేనేజర్ పినపాటి సురేష్‌బాబు అధ్యక్షత వహించారు. మా–ఏపీ వ్యవస్థాపకులు, సినీదర్శకుడు దిలీప్‌రాజా మాట్లాడుతూ ప్రపంచ రంగస్థల దినోత్సవం నేపథ్యాన్ని వివరించారు. నాటి నటుడు శివాజి గణేశ్ నుంచి కోట శ్రీనివాసరావు వరకు రంగస్థలం నుంచి వెండితెరపై రాణించారని ఆయన వివరించారు. మేకప్ వేసుకునే ప్రతి నటీనటుడు మార్చి 27న ప్రపంచ రంగస్థల దినోత్సవం నిర్వహించాల్సిన నైతిక భాధ్యత ఉందన్నారు. రంగస్థల నటులు దేవిశెట్టి కృష్ణారావు, వసంత యామి ని, చందు సూర్యను ‘మా–ఎపీ’ సత్కరించింది. తమకు జరిగిన సత్కారానికి సన్మాన గ్రహీతలు ‘మా–ఏపీ’కి కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో దర్శకుడు అచ్చన శ్రీనివాస్ యాదవ్, కాస్ట్యూమ్ డిజైనర్ పార్వతి పట్నాల, సూర్యనారాయణ, మంచాల కిషోర్‌బాబు తదితరులు పాల్గొన్నారు.


