వంట చేయడానికి దొరకని గ్యాస్ సిలిండర్లు
గ్యాస్ కొరతతో ప్రజలకు తీవ్ర ఇబ్బందులు
ఏజెన్సీల ఎదుట గంటల తరబడి తప్పని పడిగాపులు
బ్లాక్ మార్కెట్‌కు తరలిపోతున్నా చర్యలు శూన్యం
సమస్య పరిష్కారంలో అడుగడుగునా చంద్రబాబు సర్కార్ నిర్లక్ష్యం
పవిత్ర రంజాన్ మాసంలోనూ ముస్లింలకు అవస్థలు
బుక్ చేసి 19 రోజులైంది
ముందస్తు జాగ్రత్తలు తీసుకోలేదు
అక్రమ మార్గంలో సరఫరా
పండుగ పూట కూడా పస్తులుండాల్సిన పరిస్థితిని చంద్రబాబు ప్రభుత్వం కల్పించింది. ముస్లింలకు గ్యాస్ సిలిండర్ల కొరత తీవ్ర సమస్యగా మారింది. ఏకంగా పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సొంత జిల్లాలోనే గ్యాస్ సరఫరా అస్తవ్యస్తంగా తయారైంది. ఏజెన్సీలు, అధికారులు కుమ్మకై ్క సిలిండర్లను బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్నారు. బుక్ చేసుకున్న వారికి ఫోన్లు చేసి ఓటీపీ కనుక్కుని మరీ ఈ దందా సాగిస్తున్నారు. అధికారులు సమీక్షలకే పరిమితం కావడం విమర్శలకు తావిస్తోంది.
సాక్షి ప్రతినిధి, గుంటూరు: గ్యాస్ సిలిండర్ సమస్య జిల్లా వ్యాప్తంగా ప్రజలకు తప్పడం లేదు. చంద్రబాబు సర్కార్ ఇదేమీ పట్టినట్లు లేదు. శనివారం పవిత్ర రంజాన్ పండుగ. తూర్పు నియోజకవర్గ పరిధిలోని ముస్లిం సోదరులతోపాటు ఇతర వర్గాల ప్రజలకు గ్యాస్ బండలు గుదిబండలుగా మారుతున్నాయి. కొందరు ఇబ్బందులను తాళలేక గ్యాస్ గోడౌన్లకు సిలిండర్లతో వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నారు. సిబ్బంది, గ్యాస్ ఏజన్సీలు కొంత నిర్లక్ష్యంతో వ్యవహరించడంతో ప్రజలు ఆగ్రహిస్తున్నారు. పవిత్ర పండుగ రోజున గ్యాస్ కొరతతో ఇబ్బందికి గురి చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వం తీరును నిరసిస్తున్నారు. అధికారులు కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నామమాత్రంగానే మిగిలిపోయింది. జిల్లాలో మొత్తం 7.80 లక్షల మంది గృహ వినియోగదారులు ఉన్నారు. సుమారు 15 వేల మంది కమర్షియల్ సిలిండర్లు వినియోగిస్తున్నారు. మొత్తం 55 ఏజన్సీల ద్వారా బుక్ చేసుకుంటే రెండు రోజుల్లోనే సిలిండర్ ఇంటికి చేరేది. సాధారణ రోజుల్లో రోజూ జిల్లాలో సుమారు 10 వేల సిలిండర్లు బుక్ అయ్యేవి. ఇప్పుడు ఆ సంఖ్య అమాంతం రెట్టింపయ్యింది. కానీ 10 వేలు నుంచి 14 వేలు మాత్రమే అందుబాటులో ఉంటున్నాయి.
స్పందించని ప్రజాప్రతినిధులు
ఔట్ సోర్సింగ్ ఉద్యోగి బదిలీ చేయాలన్నా తమ అనుమతి ఉండాల్సిందే అని నిత్యం అధికారులకు హుకుం జారీ చేసే ప్రజాప్రతినిధులు గ్యాస్ ఇబ్బందులపై ఇప్పటి వరకు ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం గమనార్హం. మంత్రి సమీక్షలకే పరిమితం అయ్యారు. అఽధికారులు కూడా హెచ్చరికలతో సరిపెడుతున్నారు. విజిలెన్స్ అధికారులు నామమాత్రంగా దాడులు చేస్తున్నారు.
గతంలో బుక్ చేసుకున్న వారికి రెండు రోజుల్లోనే సిలిండర్ ఓటీపీ ద్వారా ఇంటికి వచ్చేది. ఇప్పుడు వారం పడుతోంది. ముందస్తు జాగ్రత్తగా ప్రజలు ఖాళీ ఉంటే సిలిండర్లు నింపుకొనేందుకు అధిక సంఖ్యలో బుక్ చేసుకుంటున్నారు. ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. బ్లాక్ మార్కెట్‌లో ఎవరైనా గ్యాస్ విక్రయిస్తే కఠిన చర్యలకు వెనుకాడబోం. కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశాం. అవసరమైన వారు 83091 60972, 63095 20569 ఫోను నంబర్లకు కాల్ చేయొచ్చు.
– కోమలి పద్మ, డీఎస్‌ఓ
కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్
హెచ్‌పీ గ్యాస్ మార్చి 2వ తేదీన బుక్ చేశాం. ఆ తర్వాత కొన్ని రోజులకు గ్యాస్ డెలివరీ బాయ్ వచ్చి సిలిండర్ ఇవ్వకుండా అమ్మగారి నుంచి ఓటీపీ కనుక్కొని వెళ్లిపోయాడు. విషయం తెలుసుకున్నాక ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోవడం లేదు. ఈ సమస్య ఎప్పడటికి తీరుతుందో అర్ధం కావడం లేదు.
– షేక్ మస్తాన్, పాత గుంటూరు
యుద్ధం జరుగుతున్నందున గ్యాస్ కొరతగా ఉందంటున్నారు. మరి ముందస్తు జాగ్రత్తలు ఎందుకు తీసుకోలేదు. చాలా రోజుల నుంచి గ్యాస్ కోసం ఎదురుచూస్తున్నాం. అయినా సిలెండర్ దొరకడం లేదు. పండుగను ఎలా జరుపుకోవాలి. కొందామంటే కరెంటు పొయ్యలు కూడా దొరకడంలేదు.
– షేక్ మెహరున్నీసా, గుంటూరు
గ్యాస్ బుక్ చేసిన తర్వాత ప్రతి వినియోగదారుడికి ఒక ఓటీపీ వస్తుంది. అది చెబితేనే గ్యాస్ డెలివరీ చేస్తారు. కొన్ని ఏజన్సీలతోపాటు కొందరు సిబ్బంది మాయాజాలంతో ఓటీపీ వచ్చినా సిలిండర్ మాత్రం రావడం లేదని ప్రజలు వాపోతున్నారు. మరికొందరు బ్లాక్ మార్కెట్‌లో రూ.1,300–1,600 వరకు సిలిండర్ కొంటున్నట్లు చెబుతున్నారు. గ్యాస్ డెలివరీ చేసే బాయ్స్ చేతివాటం గురించి మొదటి నుంచి అనేక ఫిర్యాదులున్నా ఏజెన్సీలు పెద్దగా స్పందించకపోవడం కూడా సమస్యలకు కారణం అవుతోంది. పౌర సరఫరాల శాఖ అధికారుల పర్యవేక్షణ కూడా లేదని, ఫిర్యాదులు చేసినా స్పందించడం లేదని బాధితులు ఆరోపిస్తున్నారు.


