విశ్వాసం.. ప్రేమ.. ఈద్‌ | - | Sakshi
Sakshi News home page

విశ్వాసం.. ప్రేమ.. ఈద్‌

Mar 21 2026 5:04 AM | Updated on Mar 21 2026 5:04 AM

ప్రత్యేక నమాజ్‌లు జరిగే ఈద్గాలు ఇవే.... ● నేడు ఈద్‌–ఉల్‌–ఫిత్ర్‌ ● ప్రత్యేక నమాజుకు ముస్తాబైన ఈద్గాలు, మసీదులు

ప్రత్యేక నమాజ్‌లు జరిగే ఈద్గాలు ఇవే....

లక్ష్మీపురం (గుంటూరు వెస్ట్‌):నెలవంక దర్శనంతో ఈద్‌ సంబరాలు ఆరంభమయ్యాయి, శనివారం ఈద్‌–ఉల్‌–ఫిత్ర్‌ జరుపుకొనేందుకు ముస్లింలు సమాయత్తమవుతున్నారు. ఈద్గాలు ముస్తాబవుతున్నాయి. నెల రోజులపాటు కఠోర ఉపవాస దీక్షలు ఆచరించిన ముస్లింలు శుక్రవారం మగ్‌రిబ్‌ నమాజ్‌ తర్వాత నెలవంకను దర్శించారు. ఒకరికొకరు ఆలింగనం చేసుకొని రంజాన్‌ ముబారక్‌ తెలుపుకొన్నారు. రంజాన్‌ మాసం చివరి రోజు కావడంతో జిల్లాలోని మసీదుల వద్ద సందడి నెలకొంది. జిల్లాలో గురువారం ఈద్‌ ఉల్‌ ఫిత్ర్‌ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు.

ఈద్గా వద్ద ప్రార్థన

ప్రతి ముస్లిం రంజాన్‌ పండుగ రోజున ఈద్గా వద్ద ప్రత్యేక సమాజ్‌ చేయాలన్నది మహ్మద్‌ ప్రవక్త ఆజ్ఞ. వృద్ధులు, దివ్యాంగులు, ఈద్గా (వసతులు) లేని వారు తప్ప మిగిలిన వారంతా ఈద్గా వద్ద రంజాన్‌ ప్రత్యేక నమాజ్‌ చేయాలని మత పెద్దలు పేర్కొంటున్నారు. ఈద్గాలో సామూహిక నమాజ్‌ చేస్తే ఎంతో పుణ్యం దక్కుతుందని నమ్మకం. అంతేగాక పేద, ధనిక అనే తారతమ్యం ఉండదని, తోటి వ్యక్తుల సాధకబాధలు తెలుసుకునే అవకాశం కలుగుతుందని ఇమామ్‌లు, మౌల్వీలు చెబుతున్నారు. ఈద్గా వద్దకు వెళ్లేటప్పుడు ఒక దారిలో తిరిగి వచ్చేటప్పుడు మరో దారిలో నుంచి రావాలని ప్రవక్త సందేశం.

తక్బీర్‌ తప్పనిసరి

ముస్లింలందరూ నూతన దుస్తులు ధరించి (వారి శక్తి కొలది) ఒకచోటకు చేరి అక్కడి నుంచి తక్బీర్‌ చదువుతూ ఈద్గా వద్దకు చేరుకోవాలి. ఈద్గాలో ఇమామ్‌ ఖురాన్‌ వాక్యాలు, దైవ సందేశాన్ని వినిపిస్తారు. అనంతరం రంజాన్‌ (ఈద్‌ ఉల్‌ ఫిత్ర్‌) ప్రత్యేక సమాజు చదివిస్తారు. ఆ తర్వాత దువాతో ప్రార్థనలు ముగుస్తాయి.

ఈద్‌–ఉల్‌–ఫిత్ర్‌ సందేశమిదే..

సర్వ మానవాళికి కారుణ్య వర్షిణి అయిన రంజాన్‌ మాసంలో చివరి రోజు ఈద్‌ ఉల్‌ ఫిత్ర్‌ను ముస్లింలు భక్తిశ్రద్ధలతో నిర్వహించుకుంటారు. కఠోర దీక్ష ఆచరించిన ముస్లింలు తగిన ప్రతిఫలాన్ని అల్లాహ్‌ నుంచి పొందే రోజే ఈద్‌ ఉల్‌ ఫిత్ర్‌. రంజాన్‌ పండుగ స్ఫూర్తిని గుండెల నిండా నింపుకొని ఈ ఆనందంలో అందరినీ భాగస్వాములను చేసేందుకు ముస్లింలు ప్రయత్నించాలి. జకాత్‌, ఫిత్రా పేరుతో సమాజంలోని అభాగ్యులకు బాధ్యతగా దానం చేయాలి. కుల మతాలు, వర్గ విభేదాలకు అతీతంగా మంచి మనుషులుగా స్పందిస్తూ సమాజంలోని దారిద్య్రం, పేదరికం, అసమానతలను దూరం చేయాలి. శాంతిసామరస్యాలను, సంతోషాన్ని పెంపొందింప చేయాలనేదే ’ఈద్‌ ఉల్‌ ఫిత్ర్‌ సమాజానికి అందిస్తున్న సందేశం.

నగరంపాలెంలోని పురానీ ఈద్గాలో ఉదయం 9.30 గంటలకు, పాత బస్టాండ్లోని ఉర్దూ పాఠశాల ఆవరణలోని ఈద్గాలో 9 గంటలకు, ఐపీడీ కాలనీ ఈద్గాలో 9.30 గంటలకు, ఆంధ్రా ముస్లిం కళాశాల ఆవరణలోని ఈద్గాలో 10 గంటలకు ఈద్‌ సమాజ్‌ నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రత్యేక ప్రార్థనలకు అసౌకర్యం కలుగకుండా తాగునీరు, షామియానాలు ఏర్పాటు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement