టెన్త్ హాల్ టిక్కెట్లపై చిరునామాలో అస్పష్టత ఆందోళన చెందుతున్న విద్యార్థులు, తల్లిదండ్రులు 16 నుంచి ప్రారంభం కానున్న పబ్లిక్ పరీక్షలు గుంటూరు జిల్లా వ్యాప్తంగా 149 కేంద్రాలు ఏర్పాటు
అంతా గందరగోళం
గుంటూరు ఎడ్యుకేషన్ : పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు వారం రోజులే వ్యవధి ఉంది. పరీక్షలకు సిద్ధమైన విద్యార్థులు కేంద్రాలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హాల్ టిక్కెట్లు పొందిన విద్యార్థులు దానిపై ఉన్న చిరునామా ఆధారంగా వివరాలు తెలుసుకునేందుకు తిప్పలు పడుతున్నారు. ఈ నెల 16వ తేదీ నుంచి ప్రారంభం కానున్న టెన్త్ పబ్లిక్ పరీక్షలకు గుంటూరు జిల్లా వ్యాప్తంగా హాజరు కానున్న 27,699 మంది విద్యార్థులకు 149 కేంద్రాలను ఏర్పాటు చేశారు.
చిరునామాలు లేకుండా జారీ
హాల్ టిక్కెట్లను ప్రభుత్వ పరీక్షల విభాగం ఇటీవల విడుదల చేసింది. వాటిపై పరీక్ష కేంద్రం కోడ్ నంబరు, పేరు ముద్రించి వదిలేశారు. ఆ కేంద్రం ఏ ప్రాంతంలో ఉందో స్పష్టత ఇవ్వలేదు. కేంద్రాలను కనుక్కోవడమే విద్యార్థులకు పెద్ద పరీక్షగా మారింది. ఒకే పేరుతో ఉన్న పాఠశాలల క్యాంపస్‌లలో ఏర్పాటు చేసిన కేంద్రాలను కనిపెట్టడం మరింత ఇబ్బందిగా మారింది. కేంద్రం కోడ్‌తోపాటు పేరు, చిరునామా స్పష్టంగా ముద్రించకపోవడంపై విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. గుంటూరు నగరంలో కొన్ని చోట్ల ప్రాంతాల పేర్లు లేకుండా కేవలం పాఠశాల పేరుతో హాల్ టిక్కెట్లు జారీ అయ్యాయి.
ఆ పాఠశాలే లేదు
గుంటూరు నగరంలో సెంటర్ కోడ్ 54036తో నారాయణ ఇంగ్లిషు మీడియం స్కూల్ పేరుతో హాల్ టిక్కెట్లు జారీ చేశారు. సంబంధిత కేంద్రంలో పరీక్ష రాసేందుకు వివిధ పాఠశాలలకు చెందిన 170 మంది విద్యార్థులను కేటాయించారు. బృందావన్ గార్డెన్స్ 4వ లైను చిరునామాతో జారీ చేసిన హాల్ టిక్కెట్లు ఆధారంగా అక్కడకు వెళ్లిన విద్యార్థులు అవాక్కయ్యారు. నారాయణ స్కూల్ బదులుగా ఎన్నారై ఇండియన్ స్ప్రింగ్స్ పాఠశాల ఉంది. నారాయణ స్కూల్ ఇక్కడి నుంచి పాఠశాలను తరలించి ఏళ్లు గడుస్తున్నా ఏటా ఇదే పేరుతో హాల్ టిక్కెట్లు జారీ చేస్తుండటం గమనార్హం. క్షేత్రస్థాయిలో పరిశీలించాల్సిన విద్యాశాఖాధికారుల నిర్లక్ష్యమే దీనికి కారణంగా నిలుస్తోంది.
గుంటూరులో సెంటర్ కోడ్: 54002, 54003తో భాష్యం హైస్కూల్ చంద్రమౌళీనగర్ పేరుతో హాల్ టికెట్లు జారీ చేశారు. ఒకే పేరుతో రెండు కేంద్రాలు ఉండటంతో వాటిని తె లుసుకోవడం ఇబ్బందిగా మారింది. జీకేఆర్ హై స్కూల్ పరీక్ష కేంద్రం చిరునామా హాల్‌టిక్కెట్లపై ముద్రించలేదు. ఆ పేరుతో ఏటీ అగ్రహారం, పట్టాభిపురంలో వేర్వేరుగా క్యాంపస్‌లు ఉన్నాయి. ‘సెంటర్ కోడ్ 54019, ఎస్‌ఎస్‌ఎన్‌వో హైస్కూల్, బ్రాడీపేట’ పేరుతో జారీ చేసిన హాల్ టకెట్లపై చిరునామా అస్పష్టంగా ఉంది. సెంటర్ కోడ్ 54046తో జారీచేసిన హాల్ టికెట్‌పై హెచ్‌సీహెచ్‌ఎస్, గుంటూరు పేరుతో ముద్రించిన కేంద్రం ఎక్కడ ఉందో తెలియదు. దీనిని మార్కెట్ సెంటర్లోని హిందూ కాలేజీ హైస్కూల్‌గా అర్థం చేసుకోవాలి. సెంటర్ కోడ్: 54047, కేఎస్సార్ మున్సిపల్ హైస్కూల్’ పేరుతో జారీ చేసిన హాల్ టిక్కెట్ చిరునామా కేవీపీ కాలనీగా మార్చుకోవాలి.


