విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలొద్దు
పకడ్బందీగా పరీక్షలు నిర్వహించాలి
జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా
చేబ్రోలు: విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలు వద్దని జిల్లా కలెక్టర్ ఎ. తమీమ్ అన్సారియా పేర్కొన్నారు. చేబ్రోలు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శుక్రవారం ఆమె ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. విద్యార్థుల హాజరు తక్కువగా ఉండటంపై కలెక్టర్ ప్రశ్నించగా వడ్లమూడి క్వారీలో గల బాలకోటేశ్వర స్వామి ఆలయంలో జాతీయ సేవా కార్యక్రమాలు నిర్వహించుటకు తీసుకువెళ్లినట్లు అద్యాపకులు తెలిపారు. అక్కడ నుంచే వస్తున్నామని అక్కడ విద్యార్థులు ఎవరు కనిపించలేదని కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిస్తితుల్లో తక్షణం మార్పు రావాలని ఎన్‌ఎస్‌ఎస్ కార్యక్రమం ఎక్కడో చేయటానికి ముందు మీ కళాశాల పరిసరాలలో చేపట్టాలన్నారు. పరిసరాలలో పరిశుభ్రత అధ్వానంగా ఉండటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధ్యాపకుల అనధికార గైర్హాజరును ప్రశ్నించారు. మూమెంట్ రిజిస్టర్ సైతం పరిశీలించి ఎటువంటి అనుమతులు నమోదు చేయకపోవడంతో ఆరుగురు అధ్యాపకులకు షోకాజ్ నోటీస్‌లు జారీ చేయాలని ఆదేశించారు. గ్రంథాలయ నిర్వహణ తీరుపైనా మండిపడ్డారు. విద్యార్థులతో కలిసి మధ్యాహ్నం భోజనం చేశారు. చేబ్రోలులోని సూర్య దేవర నరసయ్య ప్రభుత్వ ఉన్నత పాఠశాలను కూడా జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. జూనియర్ కళాశాలను తనిఖీ చేసి పరీక్షల సంసిద్ధత, ఏర్పాట్లు తెలుసుకున్నారు. చీలిపాలెం ప్రభుత్వ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను తనిఖీ చేశారు. పరిశుభ్రత మెరుగుపరచాలని సూచించారు. నారా కోడూరు గ్రామంలో మైక్రో ఇరిగేషన్ క్రింద నిర్వహిస్తున్న షెడ్‌ను, యూనిట్లను పరిశీలించారు. జిల్లా విద్యా శాఖాధికారి షేక్ సలీం బాషా, తహసీల్దారు కె. శ్రీనివాశర్మ, ఎంఈవో రాయల సుబ్బారావు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.
గుంటూరు వెస్ట్: జిల్లాలో పదవ తరగతి, ఇంటర్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా అధికారులను ఆదేశించారు. పది, ఇంటర్ పరీక్షలపై శుక్రవారం స్థానిక కలెక్టరేట్‌లోని మినీ శంకరన్ సమావేశ మందిరంలో జిల్లా సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఇందులో కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేందుకు తగిన ఏర్పాట్లు ఉండాలన్నారు. తాగునీరు, వైద్య శిబిరాలు, అత్యవసర మందులు ఉండాలని చెప్పారు. నిరంతరాయంగా విద్యుత్ సరఫరా ఉండాలన్నారు.
పరీక్షలకు పటిష్ట ఏర్పాట్లు
జిల్లా విద్యా శాఖ అధికారి డా.షేక్ సలీం బాషా మాట్లాడుతూ పదవ తరగతి పరీక్షలు మార్చి 16వ తేదీన ప్రారంభం అవుతాయన్నారు. జిల్లాలోని 149 కేంద్రాల్లో 27,699 మంది పరీక్షలు రాస్తారని తెలిపారు. 1,714 మంది ఇన్విజిలేటర్‌లను నియమించామని తెలిపారు. ఓపెన్ స్కూలింగ్ 10వ తరగతి పరీక్షలు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరుగుతాయన్నారు. 12 కేంద్రాల్లో 1,083 మంది అభ్యర్థులు హాజరు కానున్నారని చెప్పారు. ఓపెన్ స్కూలింగ్ ఇంటర్మీడియట్ పరీక్షలు మార్చి 2వ తేదీ నుండి ప్రారంభం అవుతాయని, ఉదయం 9 – 12 గంటల వరకు జరుగుతాయన్నారు. 9 కేంద్రాల్లో నిర్వహిస్తున్న ఈ పరీక్షలకు 2,003 మంది హాజరు అవుతున్నారని తెలిపారు. ప్రాంతీయ పర్యవేక్షక అధికారి జి.సునీత మాట్లాడుతూ రెగ్యులర్ ఇంటర్మీడియట్ పరీక్షలు ఫిబ్రవరి 23 నుంచి మార్చి 24వ తేదీ వరకు జరుగుతాయని తెలిపారు. ప్రతి రోజు ఉదయం 9 నుంచి 12 గంటల వరకు ఉంటాయని చెప్పారు. జిల్లాలో 87 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తున్నామని వివరించారు. మొత్తం 68,898 మంది విద్యార్థులు హాజరు అవుతున్నారని తెలిపారు. సమావేశంలో డీఆరో షేఖ్ ఖాజావలి, జిల్లా ఇంటర్మీడియట్ శాఖాధికారి జె.పద్మ, ప్రాంతీయ రవాణా అధికారి కె. శ్రీహరి, అధికారులు పాల్గొన్నారు.


