ఎడ్ల పోటీలు ప్రారంభం
చినగంజాం: శివరాత్రి పండగను పురస్కరించుకొని మండల కేంద్రం చినగంజాంలో నాటు బండి పోలురాధా ఎడ్ల పోటీలను శుక్రవారం సాయంత్రం ప్రారంభించారు. స్థానిక శ్రీ లలితా రామకోటేశ్వర ఆలయ ప్రాంగణంలో టైరుబండ్ల యూనియన్ ఆధ్వర్యంలో రెండు తెలుగు రాష్ట్రాల స్థాయిలో పోటీలను ఏర్పాటు చేశారు. రాష్ట్రంలోని బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల నుంచి ఇప్పటి వరకు 12 ఎడ్ల జతలు పోటీలో పాల్గొనేందుకు వచ్చాయి. శుక్రవారం సాయంత్రం ఆలయ ప్రాంగణంలో ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్, రిటైర్డ్ మున్సిపల్ కమిషనర్ టీఎస్సార్ ఆంజనేయులు రిబ్బన్ కట్ చేసి పోటీలను ప్రారంభించారు. హాజరైన ఎడ్ల జతలను లాటరీ విధానంలో పోటీలో పాల్గొనే విధంగా చర్యలు తీసుకున్నారు. నిర్ణీత సమయం 10 నిమిషాల లోపు తక్కువ సమయంలో దూరం ఎక్కువ దూరం లాగిన ఎడ్ల జతల ఆధారంగా బహుమతులు అందజేయడం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. పోటీలను తిలకించేందుకు వందల సంఖ్యలో అభిమానులు, ఉత్సాహవంతులు దూర ప్రాంతాల నుంచి విచ్చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, టైరుబండ్ల యూనియన్ సభ్యులు, గ్రామ ప్రజలతో పాటు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు, అభిమానులు పాల్గొన్నారు.
నకరికల్లు: సాగు చేస్తున్న పంటలకు ఈ క్రాప్ నమోదు చేసుకోవడం ద్వారా వ్యవసాయ సంక్షేమపథకాలు పొందవచ్చని జిల్లా వ్యవసాయాధికారి ఎం.జగ్గారావు అన్నారు. మండలంలోని నకరికల్లు, చల్లగుండ్ల గ్రామాల్లో ఈ పంట నమోదు చేసుకున్న పంటపొలాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి రికార్డులు తనిఖీచేశారు. సూపర్‌చెక్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2025–26లో గ్రామాల్లోని రైతుసేవకేంద్రాల సిబ్బంది నమోదు చేసిన పంటలను జియోఫెన్సింగ్‌తో తనిఖీ చేశామన్నారు. మండలంలో రబీ సీజన్‌లో 7,752 హెక్టార్లలో వరి, 1,598 హెక్టార్లలో మొక్కజొన్న, 71 హెక్టార్లలో ఇతపంటలు సాగుచేస్తున్నట్లు నమోదైందన్నారు.


