తుళ్లూరులో గ్రామసభ
తాడికొండ: మంగళవారం తుళ్లూరులో నిర్వహించిన గ్రామ సభలో రాష్ట్ర పట్టాణాభివృద్ధి, పురపాలక శాఖామంత్రి పి.నారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామాల్లో చేపడుతున్న మౌలిక వసతుల కల్పనపై ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్‌తో కలిసి వినతులు స్వీకరించిన అనంతరం ఆయన పెదపరిమి సమీపంలో నిర్మిస్తున్న అమరజీవి పొట్టి శ్రీ రాములు స్మృతివనంలో మొదటి శ్లాబ్ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ రాజధానికి భూములిచ్చిన రైతుల అభిప్రాయాలు తీసుకుని గ్రామాలను అభివృద్ధి చేస్తున్నామని, అమరావతి నిర్మాణంతో పాటు గ్రామాల్లో పెద్ద ఎత్తున మౌలిక వసతుల కల్పన పనులు చేపడుతున్నామన్నారు. సీడ్ యాక్సిస్ రోడ్డు నిర్మాణానికి అవసరమైన భూమి కోసం ఇప్పటికే ల్యాండ్ అక్విజేషన్ నోటిఫికేషన్ జారీ చేయడం జరిగిందని, రాజధానిలో రోడ్ల నిర్మాణానికి ఆటంకంగా ఉన్న మరో 400 ఎకరాలకు భూసేకరణ నోటిఫికేషన్ ఇచ్చేందుకు కసరత్తు చేస్తున్నామన్నారు. అమరావతిలో పొట్టి శ్రీరాములు విగ్రహం ఏర్పాటు పనులు వేగంగా జరుగుతున్నాయని, మార్చి 16 నాటికి విగ్రహం ఏర్పాటు చేసేలా పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ ఏర్పాట్లు చేస్తుందన్నారు. అమరావతిలో భూములు పొందిన ఇతర ప్రైవేట్ సంస్థలు కూడా తమ పనులు వేగవంతం చేశాయని, రైతులకు ఇచ్చిన మాట ప్రకారం అమరావతి అభివృద్ధి చేస్తామన్నారు.
పాల్గొన్న మంత్రి
నారాయణ, ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్


