లారీ ఢీకొని బాలుడు మృతి
దాచేపల్లి: లారీ ఢీకొని బాలుడు మృతిచెందిన సంఘటన బుధవారం జరిగింది. దాచేపల్లి బస్టాండ్ సెంటర్‌లో అతివేగంతో వస్తున్న లారీ ఢీకొట్టటంతో గురజాల మండలం దైద గ్రామానికి చెందిన రూవ్వ మహేష్(7) దుర్మరణం చెందాడు. సేకరించిన వివరాల ప్రకారం.. గోపి, నందిని దంపతులకు కుమార్తె అంజలి, కుమారుడు మహేష్ సంతానం. తెలంగాణలోని అడవిదేవులపల్లిలో నివాసం ఉంటున్న గోపి అనారోగ్యంతో నాలుగేళ్ల క్రితం మృతిచెందాడు. దీంతో కుమార్తె, కుమారుడిని తల్లిదండ్రుల స్వగ్రామమైన దైదలో ఉంచి చదివిస్తోంది. ఈ క్రమంలో నారాయణపురంలోని ఓ లాడ్జిలో పనిచేస్తూ నందిని దాచేపల్లిలో ఉంటోంది. మహేష్‌కి జ్వరం వస్తుండటంతో అమ్మమ్మ పురం భూలక్ష్మి దాచేపల్లిలో ఉంటున్న కుమార్తె వద్దకు తీసుకువచ్చింది. హస్పిటల్‌లో చికిత్స అనంతరం తల్లి, అమ్మమ్మలతో కలిసి లాడ్జి వద్దకు మహేష్ వచ్చాడు. ఈక్రమంలో తెలిసిన వ్యక్తి మహేష్‌ను ద్విచక్రవాహనంపై ఎక్కించుకుని బస్టాండ్ సెంటర్ వద్దకు వచ్చాడు. మహేష్ నడుచుకుంటూ రోడ్డు దాటుతున్న క్రమంలో వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది. దీంతో మహేష్ అక్కడికక్కడే మృతిచెందాడు. స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకుని లారీని ఆపేసి పోలీసులకు సమాచారం అందించారు. కుమారుడి మరణవార్త తెలుసుకున్న నందిని హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుంది. అప్పటివరకు తనతో ఉన్న కుమారుడు మృత్యువాతపడటంతో బోరున విలపించింది. మృతిచెందిన కుమారుడిని ఒడిలోకి తీసుకుని నందిని ఏడుస్తున్న తీరు చూపరులచే కంటతడి పెట్టించింది. మహేష్ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం గురజాల వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.


