భారతీయ భాషల వినియోగాన్ని విస్తృతం చేయాలి
చేబ్రోలు: ప్రాథమిక స్థాయి నుంచి ఉన్నత విద్య వరకు భారతీయ భాషల వినియోగాన్ని మరింత విస్తృతంగా పెంచాల్సిన అవసరం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యామండలి కార్యదర్శి ప్రొఫెసర్ బి. తిరుపతిరావు తెలిపారు. చేబ్రోలు మండలం వడ్లమూడిలోని విజ్ఞాన్ యూనివర్సిటీలో ‘భారతీయ భాషా పరివార్–భారతీయ భాషల అధ్యయనంలో పారడైమ్ షిఫ్ట్’ అనే అంశంపై రెండు రోజుల పాటు నిర్వహించనున్న జాతీయ సదస్సు శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది. సదస్సులో ముందుగా ‘భారతీయ భాషా పరివార్–ఏ న్యూ ఫ్రేమ్ వర్క్ ఇన్ లింగ్విస్టిక్స్’, ‘భారతీయ భాషా పరివార్–పర్సప్షన్ అండ్ హారిజన్స్’ అనే రెండు పుస్తకాలను ఆవిష్కరించారు.
● రాష్ట్ర ఉన్నత విద్యామండలి కార్యదర్శి ప్రొఫెసర్ తిరుపతి రావు మాట్లాడుతూ భారతీయ భాషలు, సాహిత్యం, తత్వశాస్త్రం కేవలం గతానికి చెందినవిగా కాకుండా, నేటి సమాజానికి, భవిష్యత్ తరాలకు మార్గదర్శకంగా నిలిచే శక్తిని కలిగి ఉన్నాయని స్పష్టం చేశారు.
● జాతీయ విద్యా విధానం–2020లో మాతృభాషలు, ప్రాంతీయ భాషల్లో బోధనకు ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా భాషా అధ్యయన రంగంలో విప్లవాత్మక మార్పు సాధ్యమవుతుందన్నారు.
● నెల్లూరులోని సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ స్టడీస్ ఇన్ క్లాసికల్ తెలుగు డైరెక్టర్ ప్రొఫెసర్ ఎన్.సంపత్‌కుమార్ మాట్లాడుతూ స్థానిక భాషల్లో పరిశోధనలు జరగడం వల్ల జ్ఞానం సమాజానికి మరింత చేరువవుతుందని అన్నారు.
● కర్ణాటకలోని సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ బీమ్ రావ్ భోసాలే మాట్లాడుతూ డిజిటల్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆధునిక భాషా సాధనాల వినియోగం ద్వారా భారతీయ భాషలకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభిస్తుందని తెలిపారు. భాషా వైవిధ్యమే భారతదేశ సాంస్కృతిక ఐక్యతకు బలమన్నారు.
కార్యక్రమంలో వైస్ చాన్స్‌లర్ పి. నాగభూషణ్, డీన్లు తదితరులు పాల్గొన్నారు.
ఏపీ రాష్ట్ర ఉన్నత విద్యామండలి కార్యదర్శి ప్రొఫెసర్ తిరుపతిరావు


