మహిళల్లో మౌనం బలహీనత కాకూడదు
●కేంద్ర గ్రామీణాభివృద్ది,
కమ్యూనికేషన్స్ శాఖ సహాయ మంత్రి
డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్
●తుళ్లూరులో ఘనంగా నయీ చేత న
4.0 కార్యక్రమం
●పాల్గొన్న రాష్ట్ర హోం మంత్రి అనిత, ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్
తాడికొండ: మహిళల్లో మౌనం బలహీనత కాకూడదని కేంద్ర గ్రామీణ అభివృద్ధి, కమ్యూనికేషన్స్ శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. లింగ సమానత్వ జాతీయ ప్రచార కార్యక్రమం నయీ చేతన 4.0 కార్యక్రమాన్ని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో డీఆర్‌డీఏ సౌజన్యంతో తుళ్లూరు మేరీమాత హైస్కూలులో శనివారం నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా సీఆర్‌డీఏ స్కిల్ హబ్ భవనంలో జెండర్ రిసోర్స్ సెంటర్‌ను హోం మంత్రి వంగలపూడి అనిత, ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్‌తో కలిసి ప్రారంభించారు. ప్రదర్శన శాలలను మంత్రులు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. మంత్రి డాక్టర్ పెమ్మసాని మాట్లాడుతూ వివక్ష తగ్గించడమే నయీ చేతన 4.0 కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. సమాజంలో బాల్య వివాహాలు, గృహ హింస, లింగ వివక్ష వంటి రుగ్మతలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. దేశంలో 4.50 లక్షల గృహ హింస కేసులు నమోదు అయ్యాయని గణాంకాలు తెలియజేస్తున్నాయన్నారు. ప్రతి ముగ్గురిలో ఒక మహిళ వివక్షకు గురౌతున్నట్లు అంచనా ఉన్నప్పటికీ అన్ని కేసులు నమోదు కావడం లేదని, ఇందుకు పరువు ప్రతిష్ట కోసం ఆలోచించడం కారణమన్నారు. అందుకే నయీ చేతన కార్యక్రమాన్ని 2021 సంవత్సరంలో శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. ప్రజల్లో చైతన్యం తీసుకురావడమే ఈ కార్యక్రమం ఉద్దేశం అన్నారు. రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ ప్రతి రంగంలోనూ మహిళలు రాణిస్తున్నారన్నారు. లింగ సమానత్వం వంట గది నుంచి ప్రారంభం కావాలని, అప్పుడే మహిళలు శారీరకంగా, మానసికంగా ధైర్యంగా, స్థైర్యంగా ఉండగలరన్నారు. రాష్ట్ర ఎంఎస్‌ఎంఇ, సెర్ప్, ఎన్.ఆర్.ఐ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్, తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్, రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి ఏ సూర్యకుమారి మాట్లాడారు. జెండర్ చాంపియన్‌లు చలివేంద్రి సుగంధి, తురకా శ్యామల మాట్లాడారు. జెండర్ చాంపియన్‌లను మంత్రులు సత్కరించారు. అనంతరం లింగ సమానత్వం కోసం అవగాహన కల్పిస్తూ లఘు నాటికను ప్రదర్శించారు. లింగ సమానత్వంపై అవగాహన కరదీపికను విడుదల చేసి సెల్ఫీ తీసుకున్నారు. సీజనల్ వ్యాధులపై అవగాహన కోసం వైద్య ఆరోగ్యశాఖ ఉచిత వైద్య శిబిరం, మిషన్ శక్తి కార్యక్రమాలపై ఐసీడీఎస్, శక్తి టీంపై జిల్లా పోలీస్ శాఖ, మహిళా కార్మికులు పని ప్రదేశాల్లో సౌకర్యాలపై జిల్లా కార్మిక శాఖ, విద్యాశాఖ ఆధ్వర్యంలో విద్యార్థుల సెన్స్ ఎగ్జిబిషన్, గ్రామీణ యువతకు డీడీయు జీకేవై 2.0 ద్వారా శిక్షణ కార్యక్రమాలపై సీడాప్–డీఆర్డిఏ, స్వయం సహాయక సంఘాల వ్యాపార ఉత్పత్తులతో విక్రయాలు, ప్రదర్శన శాలలను ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో పేదరిక నిర్మూలన సంస్థ ముఖ్య కార్యనిర్వహణ అధికారి వాకాటి కరుణ, జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, సెర్ప్ సంచాలకులు శివ శంకర్ ప్రసాద్, డీఆర్‌డీఏ ఇన్‌చార్జి ప్రాజెక్టు డైరెక్టర్ వి.విజయలక్ష్మి, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి వి.జ్యోతిబసు, జిల్లా పంచాయతీ అధికారి బి.వి.నాగసాయి కుమార్, స్వయం సహాయక సంఘాల సభ్యులు పాల్గొన్నారు.


