మానవుల రక్షణార్థం సిలువపై ఏసు మరణం
గుంటూరు రూరల్: ఏసుక్రీస్తు ఈ భువిలో 2025 సంవత్సరాల క్రితం జన్మించి మానవుల రక్షణార్థమై సిలువపై మరణించెనని గుంటూరు రోమన్ క్యాథలిక్ మేత్రాసన పీఠాధిపతులు డాక్టర్ చిన్నాబత్తిని భాగ్యయ్య తెలిపారు. ఏసుక్రీస్తు మార్గము అనుసరణీయమని పేర్కొన్నారు. గుంటూరు మేత్రాసన పరిధిలో ఏసు క్రీస్తు జయంతి 2025 జూబ్లీ వేడుకలు శనివారం నల్లపాడులోని లయోలా పబ్లిక్ స్కూల్ ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు. జగద్గురువులు, కీర్తిశేషులు ఫ్రాన్సిస్ పోపు ద్వారా రూపుదిద్దుకుని, ప్రస్తుత రోమన్ క్యాథలిక్ విశ్వ పీఠాధిపతులు లియో పోపు నేతృత్వంలో జూబ్లీ వేడుకలు విశ్వవ్యాప్తంగా నిర్వహించబడుతున్నాయని తెలిపారు. ప్రత్యేక జూబిలీ ప్రార్థన ద్వారా జ్యోతి ప్రజ్వలన చేసి, గుంటూరు పీఠాధిపతులు మోస్ట్ రెవరెండ్ డాక్టర్ చిన్నాబత్తిని భాగ్యయ్య వేడుకలను ప్రారంభించారు. అనంతరం జూబ్లీ విశిష్టతను గురించి గురు డాక్టర్ చాట్ల మరియదాసు, క్రీస్తు రాకడ కోసం నిరీక్షణ, ఆశయాలు, లక్ష్యాలు అనే అంశంపై గురు పెంటారెడ్డి రాజారెడ్డి, దేవుని వాక్కు శ్రీసభ జీవన విధానం అనే అంశంపై గురు పూదోట స్టౌటన్ తోమాసు వివరించారు. విశ్వాస సంఘాల నిర్మాణం, గురువులు, మఠవాసులు, గృహస్థ క్రైస్తవుల పాత్ర అనే అంశంపై గురు డాక్టర్ గోవిందు రాయన్న భక్తులకు వాక్యోపదేశం చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న క్రీస్తు భక్తులందరికీ భోజన సదుపాయం కల్పించారు. మధ్యాహ్నం ఏసు సభ గురు విద్యార్థులు నిర్వహించిన సంస్కరణ రథసారథి జగద్గురులు ఫ్రాన్సిస్ పోపు జీవిత సందేశ నృత్య, నాటక కళా ప్రదర్శన భక్తులను అలరించింది.
వైభవంగా దివ్య బలిపూజ
స్వస్థత ప్రార్ధనల అనంతరం గుంటూరు మేత్రాసన పీఠాధిపతులు, గుంటూరు మేత్రాసన విశ్రాంత పీఠాధిపతులు మోస్ట్ రెవరెడ్డి డాక్టర్ గాలిబాలిలు ప్రధాన యాజకులుగా, గుంటూరు మేత్రాసనంలోని గురువులందరితో కలిసి జూబ్లీ మహోత్సవ దివ్యబలి పూజను నిర్వహించారు. గురువులు, మఠకన్యలు, విశ్వాసులు 7000 మందికిపైగా పాల్గొన్న కార్యక్రమంలో పీఠాధిపతులు తమ వాక్యోపదేశాన్ని కొనసాగించారు. క్రీస్తు రాక కోసం అనేకమంది నిరీక్షించారన్నారు. ఆయన మనుషావతారంలో ఈ భువిలో జన్మించారన్నారు. గొల్లలు, దేవదూతలు, ముగ్గురు జ్ఞానులు ఆ దివ్య బాల ఏసుని కనుగొని ఆరాధించి, స్తుతించి కానుకలు సమర్పించారని వివరించారు. మనమందరం దివ్య ఏసు రెండో రాక కోసం నిరీక్షించి, క్రీస్తు ప్రభువు చూపించిన మార్గంలో నడిచి, పాప క్షమాపణ పొందాలని తెలిపారు. నూతన జీవితం ద్వారా ఆ దేవదేవుని కృపావరాలకు పాత్రులు కావాలని పిలుపు నిచ్చారు. జూ బ్లీ వేడుకలకు గురు డాక్టర్ గోవిందు రాయన్న, గురు పెంటారెడ్డి రాజారెడ్డి కోర్ కమిటీ సభ్యులుగా బాధ్యతలు నిర్వహించారు. మహోత్సవానికి సహకరించిన లయోలా పబ్లిక్ స్కూల్ యాజమాన్యాని కి, అధ్యాపకులకు, అధ్యాపకేతర బృందానికి, గురువులకు, సిస్టర్స్‌కు, సకల విశ్వాసులకు గురు డాక్టర్ గోవిందు రాయన్న అభినందనలు తెలిపారు.
రోమన్ క్యాథలిక్ మేత్రాసన పీఠాధిపతులు చిన్నాబత్తిని భాగ్యయ్య
మానవుల రక్షణార్థం సిలువపై ఏసు మరణం
మానవుల రక్షణార్థం సిలువపై ఏసు మరణం


