భవానీ.. శరణు శరణు
భవానీ దీక్షల విరమణకు తరలివస్తున్న భక్తులు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీదుర్గామల్లేశ్వర స్వామి వార్లు కొలువైన ఇంద్రకీలాద్రికి భవానీ మాలధారులు తరలివస్తున్నారు. భవానీల రాకతో ఆలయ పరిసరాలు ఎరుపెక్కాయి. మూడో రోజైన శనివారం లక్ష మంది మాలవిరమణ చేశారని ఆలయ అధికారులు పేర్కొన్నారు. తెల్లవారుజాము రెండు గంటలకు అమ్మవారికి నిత్య పూజల అనంతరం భవానీలను దర్శనానికి అనుమతించారు. చలి తీవ్రత అధికంగా ఉన్నా భవానీలు పెద్ద సంఖ్యలో ఇంద్రకీలాద్రికి చేరుకుని దీక్షలు విరమిస్తున్నారు. శనివారం వేకువ జాము రెండు నుంచి ఉదయం ఎనిమిది గంటల వరకు ఆలయానికి భవానీలు భారీగా తరలివచ్చారు. వీఎంసీ కార్యాలయం, సీతమ్మ వారి పాదాల వద్ద ఏర్పాటు చేసిన కంపార్టుమెంట్టు కిటకిటలాడాయి.
సాయంత్రమే అధికం
గిరిప్రదక్షిణ మార్గంలో పగటి వేళ కంటే రాత్రి వేళలోనే భవానీల రద్దీ అధికంగా కనిపిస్తోంది. కుటుంబ సమేతంగా దీక్షల విరమణకు వస్తున్న భవానీలు సాయం సమయంలో ప్రశాంత వాతావరణంలో గిరిప్రదక్షిణ చేసి, తెల్లవారుజామున అమ్మవారి దర్శనం చేసుకుని తిరుగు ప్రయాణం అవుతున్నారు. వినాయకుడి గుడి నుంచి క్యూలైన్‌లో చేరుకున్న తర్వాత రెండు గంటల్లో అమ్మవారి దర్శనం, ఇరుముడి, హోమ గుండంలో నేతి కొబ్బరి కాయ సమర్పణ, ప్రసాదాల కొనుగోలు పూర్తవుతోందని భవానీలు పేర్కొంటున్నారు. ఉదయం ఆరు గంటల లోపే భవానీలు దీక్షలను పరిపూర్ణం చేసుకుని రైల్వేస్టేషన్, బస్టాండ్‌కు చేరుతున్నారు. విశాఖపట్నం వైపు రత్నాచల్, హైదరాబాద్ వైపు శాతవాహన, చెన్నయ్ వైపు పినాకినీ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఉదయం ఆరు నుంచి ఆరున్నర గంటల లోపు అందుబాటులో ఉండటం ఇందుకు కారణం.


