ప్రైవేటీకరణపై నిరసన సంతకం
ప్రభుత్వం మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణపై ప్రజాగ్రహం స్వచ్ఛందంగా సంతకాలు చేసిన యువత, మహిళలు నియోజకవర్గంలో 71,226 సంతకాల సేకరణ ఇంటింటికీ వెళ్లి ప్రజలను చైతన్యపరిచిన వైఎస్సార్ సీపీ శ్రేణులు
అన్ని వర్గాల మద్దతు
ప్రత్తిపాడు నియోజకవర్గంలో కోటి సంతకాల సేకరణకు అపూర్వ స్పందన
ప్రత్తిపాడు: ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటీకరించాలన్న అనాలోచిత నిర్ణయంపై ప్రజల నుంచి ఆగ్రహజ్వాలలు ఎగసిపడ్డాయి. ఊరూ, వాడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి ప్రజా ఉద్యమంలో మేము సైతం అంటూ నిరసన ‘సంతకం’ చేశారు. చంద్రబాబూ.. ఇదేం తీరు... అంటూ తల్లిదండ్రులు ఆవేదన వెళ్లగక్కారు. సారూ.. భవిష్యత్తు ఏంటంటూ యువత నిగ్గదీసి అడిగింది. ఇక ఆరోగ్యం దేవుడి దయేనా.. అంటూ పేదలు నిష్టూర్చారు. యువత, మహిళలు, పెద్దలు, పేద, మధ్య తరగతి ప్రజలు ముక్తకంఠంతో నిరసన గళం వినిపించారు. తమ నిరసనను ప్రజాస్వమ్య పద్ధతిలో వ్యక్తం చేస్తూ సంతకాల సేకరణ ఉద్యమంలో భాగస్వాములు అయ్యారు.
నియోజకవర్గంలో అనూహ్య స్పందన
చంద్రబాబు ప్రభుత్వం ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పిలుపు మేరకు శ్రీకారం చుట్టిన కోటి సంతకాల సేకరణ ఉద్యమానికి నియోజకవర్గంలో అనూహ్య స్పందన లభించింది. వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి పిలుపు మేరకు ప్రత్తిపాడు నియోజకవర్గ సమన్వయకర్త బలసాని కిరణ్‌కుమార్ గుంటూరు రూరల్ మండలం జొన్నలగడ్డ గ్రామంలో అక్టోబరు 17వ తేదీన కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
గ్రామాల్లో రచ్చబండలు
అప్పటి నుండి గుంటూరు రూరల్ మండలం పరిధిలోని 11 గ్రామాల్లో, అర్బన్ పరిధిలోని ఎనిమిది డివిజన్లలో, ప్రత్తిపాడు మండలంలోని గొట్టిపాడు, గనికపూడి, పాతమల్లాయపాలెం, కొత్తమల్లాయపాలెం, కోయవారిపాలెం, కొండేపాడు, యనమదల, ఈదులపాలెం, తుమ్మలపాలెం.. సహా మొత్తం 16 గ్రామ పంచాయతీల్లో, పెదనందిపాడు మండలంలోని కొప్పర్రు, పెదనందిపాడు, అన్నపర్రు, పాలపర్రు, జీజీపాలెం, గోగులమూడి.. సహా పద్నాలుగుకు పైగా గ్రామాల్లో, కాకుమాను మండలంలోని కొండపాటూరు, రేటూరు, కెబిపాలెం, చినలింగాయపాలెం.. సహా పదికి పైగా గ్రామాల్లో, వట్టిచెరుకూరు మండలంలోని ముట్లూరు, వట్టిచెరుకూరు, అనంతవరప్పాడు, ఐదవమైలు, పుల్లడిగుంట, గారపాడు సహా మొత్తం పదమూడుకు పైగా గ్రామాల్లో రచ్చబండలో నిర్వహించి కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు.
స్వచ్ఛందంగా సంతకాలు..
నియోజకవర్గ సమన్వయకర్త బలసాని కిరణ్‌కుమార్ ప్రైవేటీకరణ వలన కలిగే అనర్థాలను వివరిస్తూ, అన్ని వర్గాల ప్రజలు తమకు తాముగా సంతకాల ఉద్యమంలో భాగస్వాములు అయ్యేలా ప్రణాళికలు రచించారు. ప్రజలు తమ నిరసన గళాన్ని స్వచ్ఛందంగా సంతకాల రూపంలో వినిపించేలా పార్టీ క్యాడర్‌ను సమాయత్తం చేశారు. ఇప్పటివరకు గుంటూరు రూరల్ మండలంలో సుమారు 8,245, పెదనందిపాడు మండలం 4,416, కాకుమాను మండలం 10,498, ప్రత్తిపాడు మండలం 16,419, వట్టిచెరుకూరు మండలం 3,921, గుంటూరు అర్బన్ మండలం 27,727 కలిపి నియోజకవర్గం మొత్తం మీద సుమారు 71,226 సంతకాల సేకరణ పూర్తి అయింది. చంద్రబాబు ప్రభుత్వం తమకున్న వ్యతిరేకతను ప్రజలు సంతకాల రూపంలో చాటి చెప్పారు.
ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను నిరసిస్తూ చేపట్టిన సంతకాల సేకరణ కార్యక్రమానికి ఊహించిన దాని కంటే ప్రజల నుంచి అనూహ్య స్పందన కనిపిస్తోంది. ముఖ్యంగా యువత, మహిళలు పెద్ద సంఖ్యలో రచ్చబండ వద్దకు వచ్చి స్వచ్ఛందంగా సంతకాలు చేసి నిరసన తెలుపుతున్నారు. ప్రజాసంఘాలు కూడా సంతకాల ప్రజా ఉద్యమంలో భాగస్వాములు అయ్యాయి. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తన హయాంలో ఏకంగా ఏపీకి 17 మెడికల్ కళాశాలలను తీసుకువచ్చారు. వాటిలో ఐదు కళాశాలలను పూర్తి చేశారు. మిగిలిన కళాశాలలను పూర్తి చేయాల్సిన చంద్రబాబు సర్కారు పీపీపీ పేరుతో వాటిని ప్రైవేటీకరించేందుకు పూనుకోవడం సిగ్గుచేటు. ఈ నిర్ణయంపై చంద్రబాబు ప్రభుత్వం వెనక్కి తగ్గే వరకూ వైఎస్సార్ సీపీ పోరాటం ఆగదు.
–బలసాని కిరణ్‌కుమార్,
సమన్వయకర్త, ప్రత్తిపాడు నియోజకవర్గం
ప్రైవేటీకరణపై నిరసన సంతకం
ప్రైవేటీకరణపై నిరసన సంతకం
ప్రైవేటీకరణపై నిరసన సంతకం


