యర్రబాలెంలో స్పటిక రాళ్లు చోరీ
●బీభత్సం సృష్టించిన
గుర్తు తెలియని వ్యక్తులు
●వాచ్‌మన్‌ను బంధించి రూ. 5 లక్షల విలువైన రాళ్లు అపహరణ
మంగళగిరి టౌన్: మంగళగిరి నగర పరిధిలోని యర్రబాలెంలో క్రిస్టల్స్ (స్పటిక రాళ్లు) చోరీకి గురైన ఘటన శనివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. సేకరించిన వివరాల మేరకు.. యర్రబాలెం – పెనుమాక రహదారిలో కొన్నేళ్లుగా పలువురు భాగస్వామ్యంతో క్రిస్టల్స్ వ్యాపారం నిర్వహిస్తున్నారు. శనివారం తెల్లవారుజామున రెండు గంటలకు గుర్తు తెలియని వ్యక్తులు బీభ త్సం సృష్టించారు. నెంబరు ప్లేట్లు లేని మూడు కా ర్లలో వచ్చి వాచ్‌మన్ కుటుంబాన్ని బెదిరించి, తాళ్ల తో బంధించారు. కేకలు వేయకుండా నోటిపై ప్లాస్టి క్ స్టిక్కర్లు అతికించారు. అనంతరం గోడౌన్ షట్టర్ తాళాన్ని కటింగ్ మిషన్‌తో కట్ చేసి, సీసీ కెమెరాల కనెక్షన్‌ను సైతం తొలగించారు. గోడౌన్‌లోకి ప్రవేశించి కొన్ని క్రిస్టల్స్‌ను గోతాల్లో నింపుకుని, వారు వచ్చిన కారుల్లో వేసుకుని పరారయ్యారు. అపహరణకు గురైన క్రిస్టల్స్ విలువ 5 లక్షల రూపాయలు విలువ చేస్తుందని సమాచారం.
ముందుగానే చోరీకి వ్యూహం
దుండగులు పక్కా వ్యూహంతోనే చోరీకి పాల్పడినట్లు తెలుస్తోంది. రెండు నెలల కిందట ఇదే విధంగా గుర్తు తెలియని వ్యక్తులు క్రిస్టల్స్ చోరీకి యత్నించారు. గోడౌన్ బయట వున్న కెమెరాల కనెక్షన్‌ను కూడా కత్తిరించారు. గమనించిన వాచ్ మన్ కుటుంబీకులు పెద్దగా కేకలు వేయడంతో పారిపోయే క్రమంలో వాకీటాకీని జారవిడుచుకున్నారు. అప్పట్లో జరిగిన ఘటనపై ఫిర్యాదు చేసి, దుండగులు వదిలి వెళ్లిన వాకీటాకీని సైతం పోలీసులకు అప్పగించినట్లు విశ్వసనీయ సమాచారం.
విభేదాలే కారణమా?
నలుగురు భాగస్వాములు ఈ వ్యాపారం నిర్వహిస్తున్నారు. వారి మధ్య విభేదాల కారణంగానే ఈ చోరీ జరిగినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నలుగురిలో ఒక భాగస్వామి వేరే ప్రాంతంలో క్రిస్టల్స్ వ్యాపారం చేస్తున్నట్లు సమాచారం. ఆయనే ఈ ముఠాను పంపి భీభత్సం సృష్టించడంతో పాటు దొంగిలించుకుపోయారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. చోరీకి జరిగిన తీరులో కొంత భాగం కెమెరాల్లో నమోదైంది. గోడౌన్ లోపలికి ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు ముసుగులు ధరించిన ప్రవేశించినట్లు స్పష్టంగా తెలుస్తోంది. వారిలో ఒక వ్యక్తి గతంలో ఇదే గోడౌన్‌కు వచ్చాడని, వాచ్‌మేన్ కుటుంబ సభ్యులు ప్రాథమికంగా గుర్తించినట్లు సమాచారం.
ఘటనా స్థలాన్ని పరిశీలించిన
రూరల్ పోలీసులు
ఘటనపై మంగళగిరి రూరల్ పోలీసులకు సమాచారం రావడంతో శనివారం ఉదయం గోడౌన్‌ను సీఐ ఎ.వి. బ్రహ్మం, ఎస్‌ఐ వెంకట్ సిబ్బందితో పరిశీలించారు. లోపల, బయట పరిశీలించి కొన్ని ఆధారాలు సేకరించి, దర్యాప్తు ప్రారంభించినట్లు సమాచారం.


