దొడ్లేరు రైతుల పోరాటం స్ఫూర్తిదాయకం
క్రోసూరు: దొడ్లేరు చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకులో తాకట్టు పెట్టిన బంగారం వస్తువుల కోసం బాధితులందరూ సమష్టిగా పోరాటం చేసిన ఫలితంగానే పరిహారం లభించిందని కౌలు రైతు, రైతు, వ్యసాయ కార్మిక సంఘం నాయకులు తెలిపారు. ఈ మేరకు కరపత్రాలు పంపిణీ చేశారు. కౌలు రైతు సంఘం పల్నాడు జిల్లా కమిటీ సభ్యుడు తిమ్మిశెట్టి హనుమంతరావు మాట్లాడుతూ రెండున్నర సంవత్సరాల కిందట దొడ్లేరు చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకులో బంగారం కోల్పోయి, సరైన రసీదులు లేక అయోమయ పరిస్థితిలో ఆందోళన చేస్తూ రోడ్డెక్కిన రైతన్నలకు కౌలురైతు, రైతు – వ్యవసాయ కార్మిక సంఘాలు అండగా నిలిచాయని తెలిపారు. 2500 ఖాతాలు పరిశీలించి 500 మంది ఖాతాదారులు బంగారం కోల్పోయినట్లు నిర్ధారించినట్లు తెలిపారు. మొదటి దశలో 370 మందికి వడ్డీతో సహా రూ.2 కోట్ల 50 లక్షలు నష్టపరిహారం చెల్లించారని తెలిపారు. మిగిలిన 120 మందికి సరైన ఆధారాలు లేకపోవడం వలన నష్టపరిహారం ఇవ్వడం సాధ్యం కాదని బ్యాంకు అధికారులు చెప్పిన నేపథ్యంలో మరింత పట్టుదలతో ప్రజా సంఘాల సహకారంతో 2 సంవత్సరాల 4 నెలలపాటు పోరాటం చేసి చివరగా 474 మంది రైతులకు రూ.3.50 కోట్ల నష్టపరిహారాన్ని సాధించుకున్నట్లు తెలిపారు. దొడ్లేరు రైతాంగం చేసిన ఈ పోరాటం ఎలాంటి సమస్యనైనా సమష్టిగా పోరాటం చేయడం ద్వారా సమస్యను పరిష్కరించుకోవచ్చని రుజువు చేసిందని, నేటి ప్రజానీకానికి ఎంతో స్ఫూర్తిదాయకం అని అన్నారు. కార్యక్రమంలో శిలర్షా, ఈశ్వర్‌రెడ్డి, దగ్గు నటరాజు, తదితరులు పాల్గొన్నారు.
కౌలు రైతు, రైతు, వ్యవసాయ కార్మిక సంఘాలు


