పోలీసు రక్షణలో తప్పిపోయిన బాలిక
●36 గంటల్లో కేసు ఛేదన
● పెంపుడు తల్లిదండ్రుల నుంచి పారిపోయానన్న ఏడేళ్ల పాప
కారంచేడు: తప్పిపోయిన ఏడు సంవత్సరాల బాలిక చెవుటూరి నాగేంద్రాన్ని పోలీసులు గురువారం కనుగొన్నారు. తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు బృందాలుగా ఏర్పడి వెతకడం ప్రారంభించారు. కేసు నమోదు అయిన 36 గంటల్లో పాపను పట్టుకున్నారు. కారంచేడు ఎస్‌ఐ షేక్ ఖాదర్‌బాషా అందించిన సమాచారం మేరకు.. మండల కేంద్రమైన కారంచేడు గ్రామానికి చెందిన చెవుటూరి వెంకటేశ్వర్లు, లక్ష్మి దంపతుల పెంపుడు కుమార్తె నాగేంద్రం ఈనెల 9వ తేదీన ఇంటి నుంచి బైటకు వెళ్లి అదృశ్యమైంది. దీంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన ఎస్‌ఐ ఖాదర్‌బాషా బాపట్ల ఎస్పీ ఆదేశాల మేరకు చీరాల డీఎస్పీ సూచనలతో ఇంకొల్లు సీఐ వైవీ రమణయ్య సారథ్యంలో కారంచేడు, ఇంకొల్లు ఎస్‌ఐ సురేష్, చినగంజాం ఎస్‌ఐ రమేష్‌లు తమ సిబ్బందితో ఎనిమిది బృందాలను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో గురువారం తమ సిబ్బంది చిలకలూరిపేట ప్రాంతంలో వెతుకుతుండగా పాప ఆ ప్రాంతంలో సంచరించిన విషయం గమనించిన పోలీసులు పాపను జాగ్రత్తగా విచారించారు. తన పెంపుడు తల్లిదండ్రులు కొడుతుండటంతోనే తాను ఇంటి నుంచి పారిపోయానని తెలపడంతో పోలీసులు నిర్ఘాంతపోయారు. ఎస్‌ఐ ఖాదర్‌బాషా విషయాన్ని జిల్లా పోలీస్ యంత్రాంగానికి తెలపడంతో వారి సూచనలతో పాపను బాపట్ల వన్‌స్టాప్ సఖి సెంటర్‌కు తరలించామన్నారు. పాప ఇష్ట్రపకారమే ఆమె పెంపుడు తల్లిదండ్రులకు అప్పగించలేదని తెలిపారు.


