ఉద్యానం... అధ్వానం
ప్రత్తిపాడు: నియోజకవర్గంలో ఉద్యాన శాఖ పనితీరు అధ్వానంగా మారింది. ఇక్కడ ప్రత్తిపాడు, పెదనందిపాడు, కాకుమాను, వట్టిచెరుకూరు, గుంటూరు రూరల్ మండలాలు ఉన్నాయి. ఆయా మండలాల్లోని రైతులు ఉద్యాన పంటలైన మిరప, బొప్పాయి, పూలతోటలు, కూరగాయలు సాగు చేశారు. ఇటీవల మోంథా తుపాను ప్రభావంతో వీచిన ఈదురుగాలులకు పంటలు నేలవాలి దెబ్బతిన్నాయి. మిరప నీట మునిగింది. ఎలాగోలా సస్యరక్షణ చర్యలు చేపట్టి పంటను ఓ దారికి తెచ్చుకోగలిగారు. కానీ ప్రస్తుతం మిర్చి పంటను తెగుళ్లు ఆశిస్తున్నాయి. ఇప్పటికే బొబ్బర తెగులు పంటను కబళించింది. మొక్కలు వాడిపోయి, ఆకులు మడుచుకుపోయాయి. పూత రాలిపోతోంది. కొన్ని సందర్భాల్లో అసలు పూత రావడం లేదు. ఈ నేపథ్యంలో దిగుబడి ఎలాగూ రాదని భావించి రైతులు పంటను పీకేస్తున్నారు.
ఐదు మండలాలకు ఒక్క చోట కూడా తుపానుకు ముందు వరకు ఉద్యాన శాఖ అధికారులు లేరు. రైతులకు విపత్తు వేళ మాట సాయం కూడా కరువైంది. సలహాలు, సూచనలు ఇచ్చి పంటను ఎలా కాపాడుకోవాలో చెప్పే దిక్కులేకుండా పోవడంతో వారి పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. తుపాను తరువాత ఓ హార్టికల్చర్ అధికారిని గుంటూరుకు డెప్యూటేషన్‌పై తీసుకువచ్చారు. ఆయన రాక కూడా చుట్టం చూపుగానే ఉండటంతో రైతులకు మాట సాయం కరువైంది. మండలాలవారీగా చూస్తే ప్రత్తిపాడులో 352, పెదనందిపాడులో 187, వట్టిచెరుకూరులో 421, కాకుమానులో 11 ఎకరాల్లో మిర్చి పంటను సాగు చేశారు. మరికొన్ని ఎకరాల్లో కూరగాయలు, పూలతోటలు కూడా సాగులో ఉన్నాయి.
ఉద్యాన శాఖ సస్యరక్షణపై రైతులను చైతన్య పరచాలి. తెగుళ్లను నివారించడానికి, పైరు నిలదొక్కుకోవడానికి తీసుకోవలసిన జాగ్రత్తలు చెప్పాలి. క్షేత్ర పర్యటనలు చేసి పరిస్థితులను అంచనా వేయాలి. కానీ హార్టికల్చర్ అసిస్టెంట్ల కొరతతో ఇవేమీ జరగడం లేదు.
రైతులకు సలహాలు ఇస్తున్నాం
హార్టికల్చర్ అసిస్టెంట్ల ద్వారా రైతులకు సలహాలు, సూచనలు అందిస్తున్నాం. తాజాగా ప్రభుత్వం గుంటూరు రూరల్‌కు ఒక హెచ్‌వోను డెప్యూటేషన్‌పై నియమించింది. క్షేత్ర పర్యటనలు నిర్వహించి మిర్చి రైతులకు అవగాహన కల్పిస్తున్నాం.
● అస్తవ్యస్తంగా ఉద్యాన శాఖ పనితీరు
● ఐదు మండలాలకు ఒక్కరే
హార్టికల్చర్ అధికారి
● తెగుళ్ల బారిన మిర్చి పంట
● దిక్కుతోచని స్థితిలో పంటను
పీకేస్తున్న రైతులు
● సలహాలు, సూచనలు ఇచ్చే
వారే కరువు
● హెచ్‌వోల కొరతతో పత్తా లేని
ఉద్యాన శాఖ అధికారులు
ఒక్కరే అధికారి..
హెచ్‌వోల కొరత
– బి.రవీంద్రబాబు,
డీడీ, ఉద్యాన శాఖ, గుంటూరు జిల్లా