‘కిసాన్ పక్వాడా’తో రైతులకు చేయూత
గుంటూరు రూరల్: బ్యాంక్ ఆఫ్ బరోడా గుంటూరు ప్రాంతీయ కార్యాలయం ఆధ్వర్యంలో గురువారం పెదనందిపాడులో కిసాన్ పక్వాడా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బ్యాంక్ ఆఫ్ బరోడా చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్, ఇనుమెల్ల వి.ఎల్.శ్రీధర్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ రైతులకు బ్యాంకింగ్ సేవలు, వ్యవసాయ రుణాలు, ప్రభుత్వ పథకాలు, సబ్సిడీలను చేరవేయడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని తెలిపారు. ‘రైతు బలమే దేశ బలం – రైతు అభివృద్ధి దేశ అభివృద్ధి‘ అనే నమ్మకంతో బ్యాంక్ ఆఫ్ బరోడా ఎల్లప్పుడూ రైతుల పక్షాన నిలబడుతోందని చెప్పారు. జనరల్ మేనేజర్, జోనల్ హెడ్ రితేష్ కుమార్ డిజిటల్ బ్యాంకింగ్ సౌకర్యాల ప్రాధాన్యాన్ని వివరించారు. రైతులు సులభంగా, సౌకర్యవంతంగా రుణాలు పొందడంలో, డిజిటల్ లావాదేవీలు నిర్వహించడంలో నైపుణ్యం పెంపొందించుకోవాలని ఆయన సూచించారు. చిన్న పొదుపుల ప్రాముఖ్యతను వివరించారు. రికరింగ్ డిపాజిట్ ద్వారా పొదుపు అలవాటు చేసుకోవాలని ప్రోత్సహించారు. గుంటూరు సంయుక్త వ్యవసాయ సంచాలకురాలు ఎం. పద్మావతి మాట్లాడుతూ డిమాండ్ ఆధారిత పంటల మార్పిడిపై దృష్టి పెట్టాలని రైతులకు సూచించారు. వ్యవసాయ రుణ పథకాలు కిసాన్ క్రెడిట్ కార్డ్, పంట – అనుబంధ కార్యకలాపాల ఫైనాన్స్, సూక్ష్మ బీమా, సామాజిక భద్రత పథకాలు తదితర వివరాలను ప్రాంతీయ మేనేజర్ ఎస్.కె.కిరణ్ రెడ్డి రైతులకు వివరించారు. బ్యాంక్ ఆఫ్ బరోడా రైతులకు అందిస్తున్న కిసాన్ క్రెడిట్ కార్డ్, ఎస్‌హెచ్‌జీఎస్, ఇతర పథకాలను గుంటూరు ఎల్డీఎం రత్న మహిపాల్‌రెడ్డి, నాబార్డ్ డీడీఎం జి.శరత్‌బాబు, గుంటూరు డీఆర్డీఏ డీపీఎం కేశవ్ కుమార్ వివరించారు. బురక్రథ రూపంలో బ్యాంక్ ఉత్పత్తులు, సేవలను వివరించే సాంస్కృతిక కార్యక్రమాలు, సంప్రదాయ నృత్యాలు ఆకట్టుకున్నాయి. అనంతరం వివిధ పథకాల కింద రైతులకు రూ. 60.25 కోట్ల విలువైన రుణాల చెక్కులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారి సుబ్రహ్మణ్యం, పెదనందిపాడు బ్యాంక్ ఆఫ్ బరోడా చీఫ్ మేనేజర్ వెంకటేశ్వరరావు, బ్యాంకు సిబ్బంది, ఖాతాదారులు పాల్గొన్నారు.


