దేశ సమైక్యతకు పటేల్ కృషి స్మరణీయం
నగరంపాలెం (గుంటూరు వెస్ట్): దేశ ఐక్యత, సమగ్రత, భద్రత కోసం సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసిన కృషి మరువలేనిదని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ అన్నారు. శుక్రవారం పటేల్ జయంతి సందర్భంగా నగరంపాలెంలోని పోలీస్ పరేడ్ మైదానంలో ఐక్యత దినోత్సవం నిర్వహించారు. తొలుత ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి పోలీస్ గౌరవ వందనంతో నివాళులర్పించారు. అనంతరం ప్రతిజ్ఞ చేశారు. ఆకాశంలోకి పావురాలు, జాతీయ జెండా రంగుల బెలూన్లను ఎగురవేశారు. ఐక్యత పరుగును జెండా ఊపి ప్రారంభించారు. నగరంపాలెం, కన్నావారితోట, మూడు బొమ్మల కూడలి నుంచి పోలీస్ పరేడ్ మైదానం వరకు ఇది కొనసాగింది. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ఐక్యంగా ఉంటే బలంగా ఉంటామనే సందేశాన్ని అందించడమే ఈ కార్యక్రమం ఉద్దేశమన్నారు. దేశాన్ని సమగ్రంగా, బలంగా నిర్మించడంలో పటేల్ కీలకపాత్ర పోషించారని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా ఏఎస్పీ (ఏఆర్) హనుమంతు, డీఎస్పీలు శ్రీనివాసరెడ్డి (మహిళా పీఎస్), బెల్లం శ్రీనివాస్ (ట్రాఫిక్), అబ్దుల్‌అజీజ్ (గుంటూరు తూర్పు), అరవింద్ (గుంటూరు పశ్చిమ), ఏడుకొండలరెడ్డి (ఏఆర్), సీఐలు, ఆర్‌ఐలు, పోలీస్ అధికార, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
డీఆర్‌ఎం కార్యాలయంలో ఐక్యత దినోత్సవం
లక్ష్మీపురం: దేశ ఐక్యతకు సర్దార్ వల్లభాయ్ పటేల్ అద్భుత నాయకత్వం ఎంతో ఉపయోగపడిందని గుంటూరు రైల్వే డివిజన్ డీఆర్‌ఎం సుథేష్ఠ సేన్ పేర్కొన్నారు. పట్టాభిపురంలోని కార్యాలయంలో శుక్రవారం ఐక్యత దినోత్సవం నిర్వహించారు. ముందుగా డివిజన్ అధికారులు, సిబ్బందితో కలసి డీఆర్‌ఎం ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలతో ఐక్యత స్ఫూర్తి మరింత బలపడుతుందని అన్నారు. అనంతరం డీఆర్‌ఎం కార్యాలయం నుంచి ర్యాలీని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏడీఆర్‌ఎం రమేష్ కుమార్, డివిజనల్ డీపీఓ షహబాజ్ హనూర్ తదితరులు పాల్గొన్నారు.
దేశ సమైక్యతకు పటేల్ కృషి స్మరణీయం


