సీతారామయ్య సేవలు చరిత్రాత్మకం
గుంటూరుఎడ్యుకేషన్: సమాజాభివృద్ధిలో పాటిబండ్ల సీతారామయ్య అందించిన సేవలు చరిత్రాత్మకమైనవని, పేదలకు విద్యను చేరువ చేయాలనే ఆశయంతో పాఠశాలలను ఏర్పాటు చేయడం గొప్ప విషయమని ఉమ్మడి రాష్ట్ర విశ్రాంత డీజీపీ డాక్టర్ ఎం.మాలకొండయ్య అన్నారు. శుక్రవారం లక్ష్మీపురంలోని శ్రీ పాటిబండ్ల సీతారామయ్య సీబీఎస్‌ఈ ఉన్నత పాఠశాలలో ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు పాటిబండ్ల సీతారామయ్య 143వ జయంత్యుత్సవాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథి గా పాల్గొన్న మాలకొండయ్య మాట్లాడుతూ సమాజంలోని ఉన్నత వర్గాలతోపాటు పేద, బడు గు, బలహీనవర్గాలకు విద్యను చేరువ చేయాలని సంకల్పించిన పాటిబండ్ల సీతారామయ్య ఆశయాలను నెరవేర్చుతూ ఏర్పాటు చేసిన సీతారామయ్య హైస్కూల్లో చదివిన విద్యార్థులు ఐఏఎస్, ఐపీఎస్, వైద్యులు, ఇంజినీర్లు, ప్రజాప్రతినిధులతోపాటు పారిశ్రామికవేత్తలుగా ఎదిగారని అన్నారు.
సీటు సాధించడం కష్టతరంగా ఉండేది
మాజీ డీజీపీ, ఏపీఎస్ ఆర్టీసీ వైస్ చైర్మన్ అండ్ ఎండీ సీహెచ్ ద్వారకా తిరుమలరావు మాట్లాడుతూ తాను 1974లో ఇదే పాఠశాలలో 6వ తరగతిలో చేరి, టెన్త్ వరకు చదుకున్నానని చెప్పారు. విద్యార్థులకు చదువుతో పాటు సంస్కారాన్ని, క్రమశిక్షణను అలవర్చిందన్నారు.
సీతారామయ్య జీవిత చరిత్రను
పాఠ్యాంశంగా చేర్చాలి
ప్రముఖ రచయిత, చారిత్రక పరిశోధకుడు ఆచార్య డాక్టర్ ముదిగొండ శివప్రసాద్ మాట్లాడుతూ పాటిబండ్ల సీతారామయ్య జీవిత చరిత్రను పాఠ్యాంశంగా చేర్చాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మాజీ హోం మంత్రి వసంత నాగేశ్వరరావు మాట్లాడుతూ ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయ ఏర్పాటు వెనుక సీతారామయ్య కృషి దాగి ఉందని, వర్శిటీకి అవసరమైన వందలాది ఎకరాల భూములను ఉచితంగా అందజేశారని చెప్పారు. పాఠశాల కమిటీ అధ్యక్షుడు దేవినేని మల్లికార్జునరావు, ఉపాధ్యక్షుడు డాక్టర్ సూర్యదేవర హనుమంతరావు, కరస్పాండెంట్ పాటిబండ్ల విష్ణువర్ధన్ మాట్లాడుతూ పాటిబండ్ల సీతారామయ్య ఆశయాలకు అనుగుణంగా స్థాపించిన పాఠశాల ద్వారా లాభాపేక్షకు తావు లేకుండా తక్కువ ఫీజులతో నిర్వహిస్తున్నామని, చదువుతున్న విద్యార్థులు ఇదే పాఠశాల వేడుకలకు ముఖ్య అతిథులుగా వచ్చే స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. వసంత నాగేశ్వరరావు, ప్రముఖ వైద్య నిపుణుడు డాక్టర్ మద్దినేని గోపాలకృష్ణ, స్వధర్మ సేవాసంస్థ అధ్యక్షుడు లంకా సూర్యనారా యణరావు, విశ్రాంత దేవదాయశాఖ కమిషనర్ నర్రా నరసింహారావు, ఆదర్శ రైతు కొండా వీరారెడ్డి, ప్రగతి కళాపరిషత్ వ్యవస్థాపకుడు చాపరాల సూర్యప్రకాష్, లైబ్రేరియన్ నలజాల సుభాషిణిని సత్కరించారు, పురస్కారాలు ప్రదానం చేశారు. కార్యక్రమంలో పాఠశాల కమిటీ సంయుక్త కార్యదర్శి డాక్టర్ వసంతం వీరరాఘవయ్య, కోశాధికారి చేకూరి రామకోటేశ్వర రావు, సభ్యులు మదమంచి రవీంద్ర, కొడాలి నాగమల్లేశ్వరరావు, బొల్లేపల్లి శ్రీనివాసరావు, గింజుపల్లి వరప్రసాద్ రావు, బోధన, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.
విశ్రాంత డీజీపీ మాలకొండయ్య


