ఘనంగా ఏక్తా దివస్ ర్యాలీ
గుంటూరు వెస్ట్ : దేశ సమైక్యతకు సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసిన కృషిని ప్రజలు ఎన్నటికీ మరువలేరని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ కొనియాడారు. మైభారత్ (నెహ్రూ యువ కేంద్ర)ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక కలెక్టరేట్ నుంచి నిర్వహించిన సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి రాష్ట్రీయ ఏక్తా దివాస్ (జాతీయ సమైక్య దినోత్సవం)లో భాగంగా ర్యాలీని మంత్రి జెండా ఊపి ప్రారంభించారు. ర్యాలీ ప్రభుత్వ మహిళా కళాశాల వరకు సాగింది. అనంతరం అక్కడ జరిగిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ దేశ చరిత్రలో సర్దార్ వల్లభాయ్ పటేల్ పేరును సువర్ణ అక్షరాలతో లిఖించ వచ్చని అన్నారు. జిల్లా కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా మాట్లాడుతూ సర్దార్ వల్లభాయ్ పటేల్ కేవలం నాయకుడే కాదని, దేశ ఐక్యతకు చిహ్నం అన్నారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, జీఎంసీ కమిషనర్ పులి శ్రీనివాసులు, పశ్చిమ, తూర్పు శాసన సభ్యులు గళ్ళా మాధవి, మొహమ్మద్ నసీర్ అహ్మద్, నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర, డిప్యూటీ మేయర్ షేక్ సజీలా, జిల్లా రెవెన్యూ అధికారి ఎన్.ఎస్.కె.ఖాజావలి, జీఎంసీ అదనపు కమిషనర్ చల్లా ఓబులేసు, మై భారత్ డిప్యూటీ డైరెక్టర్ కిరణ్మయి దేవిరెడ్డి పాల్గొన్నారు.


