స్టాంపు డ్యూటీ చెల్లించండి మహాప్రభో...
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల్లో స్టాంప్ డ్యూటీ ఆదాయం రూ.18 కోట్లుగా అంచనా అర్ధ సంవత్సరానికి రూ.9 కోట్లు రావాల్సి ఉండగా జెడ్పీకి వచ్చింది రూ.41.18 లక్షలు మాత్రమే మంత్రి అనగాని సత్యప్రసాద్‌కు విజ్ఞప్తి చేసినా ప్రయోజనం శూన్యం గత బకాయిలు మరో రూ.35 కోట్లు కూడా ఇవ్వని కూటమి ప్రభుత్వం నిధులు అందక ఉమ్మడి జిల్లాలో ముందుకు సాగని అభివృద్ధి పనులు
మంత్రి, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం శూన్యం
పంచాయతీరాజ్, స్థానిక సంస్థలకు విడుదల కాని స్టాంప్ డ్యూటీ నిధులు
గుంటూరుఎడ్యుకేషన్: కూటమి ప్రభుత్వ పాలనలో స్థానికసంస్థలు ఆర్థికంగాకొట్టుమిట్టాడుతున్నాయి. పంచాయతీరాజ్, స్థానిక సంస్థలు ఆర్థికంగా బలోపేతం కావడంతోపాటు అభివృద్ధి పనులకు నిధుల కోసం ప్రభుత్వాలపై ఆధారపడాల్సిన పనిలేకుండా గ్రామ, మండల, జిల్లాస్థాయిలో జరిగే భూములు, ఆస్తుల క్రయవిక్రయాల రిజిస్ట్రేషన్ల నుంచి స్టాంప్ డ్యూటీ పేరుతో ఆదాయ వనరులను పొందే విధంగా పంచాయతీరాజ్ చట్టంలో పొందుపర్చారు.
ప్రభుత్వ దయాదాక్షిణ్యాలపై ఆధారపడాల్సిన దుస్థితి...
జిల్లాలో ఆస్తులకు సంబంధించి రిజిస్ట్రేషన్ జరిగిన వెంటనే స్టాంప్ డ్యూటీ జిల్లా పరిషత్‌కు జమ చేయాలి. అయితే తమకు ఇష్టం ఉన్నప్పుడు నిధులు విడుదల చేస్తామనే ధోరణిలో కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తోంది. రిజిస్ట్రేషన్ల శాఖ నుంచి స్థానిక సంస్థలైన జెడ్పీ, మండల పరిషత్, గ్రామ పంచాయతీలకు రావాల్సిన స్టాంప్ డ్యూటీ ఆదాయాన్ని తన గుప్పెట్లో ఉంచుకున్న ప్రభుత్వం దానిని ఇతర కార్యక్రమాలకు మళ్లిస్తోంది.
స్టాంప్ డ్యూటీలో 95 శాతం స్థానిక సంస్థలకే
రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో భూములు, ఆస్తుల క్రయ, విక్రయాల ద్వారా వచ్చే ఆదాయంలో 95 శాతం స్టాంప్ డ్యూటీ స్థానిక సంస్థలకే చెందుతుంది. ఈ విధంగా ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలో జరిగే రిజిస్ట్రేషన్లలో స్టాంప్ డ్యూటీ ఆదాయంలో నూటికి రూ.95 స్థానిక సంస్థలకు బదలాయించాలి. ప్రతి రూ.100లో రిజిస్ట్రేషన్ శాఖ రూ.ఐదు మినహాయించుకుని, జెడ్పీకి రూ.19, మండల పరిషత్‌కు రూ.19, గ్రామ పంచాయతీకి రూ.57 బదలాయించాలని చట్టంలో స్పష్టంగా ఉంది. వాస్తవ పరిస్థితుల్లో ఇది ఎక్కడా అమలు కావడం లేదు. స్టాంప్ డ్యూటీ మొత్తం నేరుగా రెవెన్యూ శాఖ ద్వారా ఆర్థిక శాఖకు చేరుతోంది. సీఎఫ్‌ఎంఎస్ ద్వారా తిరిగి స్థానిక సంస్థలకు వాటా ప్రకారం ఇవ్వాల్సిన నిధులు వెనక్కు రావడం లేదు.
అర్ధ సంవత్సరానికి కేవలం రూ.41.18 లక్షలు
ఉమ్మడి జిల్లాలో 2025–26 ఆర్థిక సంవత్సరానికి స్టాంప్ డ్యూటీ ద్వారా రూ.18 కోట్లు వస్తుందని బడ్జెట్ ప్రణాళికలో అంచనా వేశారు. ఈ విధంగా అర్ధ సంవత్సరానికి రూ.తొమ్మిది కోట్లు జమ కావాల్సి ఉండగా, ఇప్పటివరరూ రూ.41.18 లక్షలు మాత్రమే వచ్చాయి. దీంతోపాటు గత ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి స్టాంప్ డ్యూటీ ద్వారా రూ.35 కోట్లు బకాయిలు రావాల్సి ఉన్నాయి.
స్టాంప్ డ్యూటీ కింద రావాల్సిన నిధులతో పాటు రూ.35 కోట్ల బకాయిలను కూడా విడుదల చేయాలని రెవెన్యూ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్‌తో పాటు ఆ శాఖ ఉన్నతాధికారులకు పదే, పదే విజ్ఞప్తులు చేసినా ప్రయోజనం శూన్యం. బకాయిలు చెల్లించడంతో పాటు స్టాంప్ డ్యూటీ నిధులు ఎప్పటికప్పుడు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని జెడ్పీ నుంచి కోరుతున్నప్పటికీ ప్రభుత్వంలో చలనం లేదు. నిధులు అందక గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి పనులు ముందుకు సాగడం లేదని జెడ్పీటీసీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


