పరిష్కారాలు అన్వేషించడం విద్యార్థులకు ముఖ్యం
తాడేపల్లి రూరల్ : సేవాభావం, సహనం, త్యాగనిరతితోపాటు సవాళ్లకు భయపడకుండా ఉండడం, సమస్యలకు నైపుణ్యంతో పరిష్కారాలను అన్వేషించడం వంటివి విద్యార్థులు పెంపొందించుకోవాలని టుబాకో బోర్డు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ విశ్వశ్రీ స్పష్టం చేశారు. శుక్రవారం తాడేపల్లి రూరల్ పరిధిలోని వడ్డేశ్వరం కేఎల్ విశ్వవిద్యాలయంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని ఐక్యత దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా విశ్వశ్రీ మాట్లాడుతూ విద్యార్థి దశలో ఎదురయ్యే ప్రతి సంఘటను ఒక పాఠంగా తీసుకుని ఫలితం కన్నా లక్ష్యంపై దృష్టి సారిస్తే విజయం సాధ్యమన్నారు. అనంతరం విద్యార్థుల స్టడీస్ టూర్స్, వర్తమాన సమాజ సమస్యలు, మోటివేషన్ స్పీచ్ వంటి వాటిపై వారు రాసిన అంశాలతో కూడిన డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఆర్ట్స్ నిర్వహిస్తున్న అంతర్జాల మాసపత్రిక ‘ప్రజ్ఞ’ను ప్రారంభించారు. యూనివర్సిటీ బీఏ విభాగాధిపతి డాక్టర్ కె. అనిల్ కుమార్ మాట్లాడుతూ దేశంలో అత్యున్నత సర్వీస్ అయిన సివిల్ సర్వీసెస్ సాధించాలనే తపన, లక్ష్యం ఉన్న విద్యార్థుల కోసం బీఏ (ఐఎఎస్) కోర్సు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. విశ్వవిద్యాలయ విద్యార్థి విభాగ ఇన్‌చార్జి డీన్ డాక్టర్ కేఆర్‌ఎస్ ప్రసాద్ మాట్లాడుతూ స్వదేశీ సంస్థానాలను భారతదేశంలో ఐక్యం చేసి అఖండ భారతాన్ని ఆవిష్కరించడంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ పాత్ర మరువలేనిదన్నారు. అనంతరం రాష్ట్రీయ ఏక్తా దివస్ ప్రమాణాన్ని చేయించారు. కార్యక్రమంలో వర్సిటీ వీసీ డాక్టర్ పార్థసారథి వర్మ, ప్రో వీసీలు డాక్టర్ ఏవీఎస్ ప్రసాద్, డాక్టర్ ఎన్ వెంకట్‌రామ్, డాక్టర్ రాజశేఖరరావు, రిజిస్ట్రార్ డాక్టర్ సుబ్బారావు, ఎంహెచ్‌ఎస్ అంతర్జాతీయ సంబంధాల డీన్ డాక్టర్ కిషోర్‌బాబు, సీఎస్‌టీసీ అధిపతి శ్రీనివాసరావు, ప్రోగ్రాం కన్వీనర్ మునీష్, స్వాతి, డాక్టర్ రాజీవ్‌రెడ్డి, విద్యార్థులు పాల్గొన్నారు.


