
రైలులో లైంగిక దాడికి పాల్పడిన నిందితుడి అరెస్టు
లక్ష్మీపురం: రైలులో మహిళపై లైంగిక దాడికి పాల్పడిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. రైల్వే పోలీసులు తెలిపిన వివరాలు.. రైలు నంబర్ 07222 సంత్రాగచి– చర్లపల్లి ప్రత్యేక ఎక్స్‌ప్రెస్‌లో రాజమండ్రి రైల్వే స్టేషన్‌లో ఈనెల 13వ తేదీన మహిళా బోగిలో రాజమండ్రి ప్రాంతానికి చెందిన మహిళ ఎక్కింది. చర్లపల్లి వెళ్తుండగా సుమారు రాత్రి 7.05 గంటల సమయంలో రైలు గుంటూరు రైల్వే స్టేషన్‌కు చేరింది. మహిళా బోగిలో ఉన్న తోటి ప్రయాణికులందరూ బోగిలో నుంచి దిగిపోయారు. ఇది గమనించిన పల్నాడు జిల్లా, సత్తెనపల్లి మండలం, లక్కరాజు గార్లపాడు గ్రామానికి చెందిన జొన్నలగడ్డ రాజారావు, రైలు కదిలే సమయంలో మహిళా బోగిలో ఎక్కేందుకు తలుపు తీయాల్సిందిగా కోరాడు. దీంతో బాధితురాలు ఇది మహిళా బోగి అని ఎంత చెప్పిన వచ్చే రైల్వే స్టేషన్‌లో దిగి పోతానని చెప్పి బాధితురాలిని తలుపు తీసేందుకు ఒప్పించాడు. దీంతో బాధితురాలు బోగి తలుపులు తీయడంతో లోపలికి ప్రవేశించి తలుపులు లోపలి నుంచి మూసి వేశాడు. రైలు నల్లపాడు రైల్వే స్టేషన్ దాటిన తరువాత నిందితుడు, బాధితురాలికి కత్తి చూపించి, బెదిరించి ముఖంపై చేతులు వేసి ఆమెను కొట్టి బాధితురాలిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ తరువాత రైలు నెమ్మదిగా పెదకూరపాడు రైల్వే స్టేషన్‌ను సమీపిస్తుండగా బాధితురాలి వద్ద ఉన్న రూ.5,600, పరుసు, సెల్‌ఫోన్ లాక్కుని నిందితుడు రైలు నుంచి దూకి పారిపోయాడు. బాఽధితురాలు అదే రైలులో సికింద్రబాద్ స్టేషన్‌కు చేరుకుని జీఆర్పీ పోలీసులకు ఫిర్యాదు చేయడం జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి బాధితురాలిని వైద్య పరీక్షలకు ప్రభుత్వ సమగ్రాస్పత్రికి తరలించారు.
నడికుడికి కేసు బదిలీ..
ఈ ఘటన చోటు చేసుకున్న ప్రాంతం నడికుడి జీఆర్పీ పరిధిలో ఉండడంతో కేసును నడికుడికి బదిలీ చేశారు. దీంతో అప్రమత్తం అయిన నడికుడి జీఆర్పీ పోలీసులు కేసు నమోదు చేశారు. సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి నిందితుడిని గాలించేందుకు ప్రత్యేక బృందాలుగా ఏర్పాటు చేశారు. గాలింపు చర్యల్లో భాగంగా ఆదివారం ఉదయం 11 గంటల సమయంలో గుంటూరు రైల్వే స్టేషన్‌లో తనిఖీలు చేస్తున్న రైల్వే పోలీసులకు 8వ ప్లాట్‌ఫారంపై ఓ వ్యక్తి పారిపోతుండగా అదుపులో తీసుకున్నారు. స్టేషన్‌కు తరలించగా సీసీ కెమెరాల్లో గుర్తించిన వ్యక్తిగా నిర్ధారించారు. విచారించగా నేరం అంగీకరించడంతో పోలీసులు రాజారావును అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసులో గుంటూరు ఐఆర్‌పీ లైన్ సీఐ కరుణకరరావు, జీఆర్పీ సీఐ అంజిబాబు, ఆర్పీఎఫ్ సీఐ వీరబాబు, ఎస్‌ఐలు పి.రమేష్, రాజమోహన్, శ్రీనివాసరారెడ్డి, కానిస్టేబుల్ ఆశ్వీన్, నాసర్ వలి, హెడ్ కానిస్టేబుల్ వి.శంకర్లను అధికారులు అభినందించారు.
వివరాలు వెల్లడించిన రైల్వే పోలీసులు