
హేతువాద సాహిత్య పితామహుడు త్రిపురనేని
లక్ష్మీపురం: తెలుగునాట హేతువాద సాహిత్యానికి పునాదులు వేసిన వ్యక్తి త్రిపురనేని రామస్వామిచౌదరి అని ప్రముఖ సాహిత్య విమర్శకుడు జి.లక్ష్మీ నరసయ్య అన్నారు. బ్రాడీపేటలోని సీపీఎం కార్యాలయంలో ఆదివారం సాయంత్రం జరిగిన కవిరాజు త్రిపురనేని రామస్వామిచౌదరి పురస్కార ప్రదాన సభకు మాజీ ఎమ్మెల్సీ కె.ఎస్.లక్ష్మణరావు అధ్యక్షత వహించారు. లక్ష్మీనరసయ్య మాట్లాడుతూ రామస్వామి సాహిత్యానికి వారసుడు కోయి కోటేశ్వరరావుకు, రామస్వామి సామాజిక సంస్కరణ ఉద్యమానికి వారసుడు డాక్టర్ ఆలా వెంకటేశ్వర్లుకు రామస్వామి పురస్కారాలు ఇవ్వడం సముచితమని అన్నారు. విశ్రాంత ఐఏఎస్ అధికారి పీవీ రమేష్ మాట్లాడుతూ వందేళ్ల క్రితం సమాజంలో ఉన్న అసమానతల మీద తిరుగుబాటు సాహిత్యం రచించిన వ్యక్తి త్రిపురనేని రామస్వామి అని అన్నారు. మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ మాట్లాడుతూ తెలుగునాట బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమం ప్రారంభించింది రామస్వామి అని అన్నారు. అనంతరం కోయి కోటేశ్వరరావు, ఆలా వెంకటేశ్వర్లులకు త్రిపురనేని రామస్వామి పురస్కారాలు ప్రదానం చేసి సత్కరించారు. సభలో ప్రముఖ విద్యావేత్త కన్నా మాస్టారు, డాక్టర్ అంబేద్కర్, జాషువా, పూలే, పెరియార్ లిటరరీ ఫౌండేషన్ అధ్యక్షుడు బి.విల్సన్, డాక్టర్ మూకిరి సుధ తదితరులు పాల్గొన్నారు.
సాహిత్య విమర్శకుడు జి.లక్ష్మీనరసయ్య