హత్య కేసులో నిందితుల అరెస్టు | - | Sakshi
Sakshi News home page

హత్య కేసులో నిందితుల అరెస్టు

Oct 17 2025 9:46 AM | Updated on Oct 17 2025 9:46 AM

హత్య

హత్య కేసులో నిందితుల అరెస్టు

పట్నంబజారు (గుంటూరు ఈస్ట్‌) : పరువు హత్య కేసులో నిందితులను పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. పాత గుంటూరు పోలీసు స్టేషన్‌లో ఈస్ట్‌ సబ్‌ డివిజన్‌ డీఎస్పీ షేక్‌ అబ్దుల్‌ అజీజ్‌, ఎస్‌హెచ్‌ఓ కె.వెంకట ప్రసాద్‌, ఎస్‌ఐ ఎన్‌.సి.ప్రసాద్‌లు గురువారం వివరాలను వెల్లడించారు. పొన్నూరు రోడ్డులో ఈనెల 7న కుర్రా నాగ గణేష్‌ (25)ను హత్య చేశారు. బుడంపాడులో నివాసం ఉండే నాగ గణేష్‌ కొలకలూరు గ్రామానికి చెందిన కీర్తి వీరాంజనేయదేవిని ప్రేమించి వివాహం చేసుకున్నాడు. వివాహం ఇష్టం లేని ఆమె సోదరుడు కీర్తి దుర్గారావు ఈనెల 7న స్నేహితులతో కలిసి నాగ గణేష్‌ను హత్య చేశాడు. ఈ క్రమంలో మృతుడు తండ్రి శివాంజనేయులు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు అనంతరం తెనాలి కొలకలూరు గ్రామానికి చెందిన షేక్‌ నూర్‌బాషా అలియాస్‌ జలాలి, బత్తిన లోకేష్‌, నందివెలుగు గ్రామానికి చెందిన తుమ్మల శివయ్య, జంపని వంశీ, గుంటూరు రూరల్‌ మండలం నివాసగొర్లవారిపాలేనికి చెందిన శాఖమూరి గోపీకృష్ణ, కీర్తిపాములు, కుంచనపల్లికి చెందిన దాసరి వీరయ్య అలియాస్‌ చుక్కపల్లి వీరయ్యను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు.

పోలీసులను ఆశ్రయించిన హతుడు

సెప్టెంబరు 25న వివాహం జరిగిన తరువాత వీరాంజనేయదేవి కుటుంబ సభ్యుల నుంచి ప్రాణ హాని ఉందని కుర్రా నాగ గణేష్‌ ఆమెతో కలిసి నల్లపాడు పోలీసులను ఆశ్రయించాడు. అప్పటికే పలుమార్లు గణేష్‌ను చంపుతామంటూ ప్రధాన నిందితుడు దుర్గారావు బెదిరింపులకు పాల్పడిన పరిస్థితులున్నాయి. నాగ గణేష్‌, స్నేహితుడు సంగుల కరుణతో కలిసి ఈనెల 7న ముత్తూట్‌ ఫైనాన్స్‌ కార్యాలయానికి వచ్చి తిరిగి వెళుతున్నాడు. ఈ క్రమంలో పొన్నూరు రోడ్డులోని ఎం. కన్వెన్షన్‌ పంక్షన్‌ హాలు సమీపంలో దుర్గారావు ఇద్దరు వ్యక్తులతో వచ్చి మృతుడిని విచక్షణారహితంగా పొడిచి అక్కడి నుంచి పరారయ్యాడు. పక్కనే ఉన్న స్నేహితుడు గణేష్‌ను ఆసుపత్రికి తీసుకెళ్లే సరికి అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈనెల 15న రాత్రి తొమ్మిది గంటల సమయంలో గుంటూరు రూరల్‌ మండలం అడవితక్కెళ్లపాడు పంచాయతీ గొర్లవారిపాలెం వెళ్లే రోడ్డులో నిందితులు ఉన్నట్లు పక్కా సమాచారం అందుకున్న పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. ఇదే కేసులో ఏ–8గా పేర్కొన్న దాసరి వీరయ్య హత్యకు కుట్ర చేసి ప్రొత్సహించిన నేపథ్యంలో అరెస్టు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. నిందితుల నుంచి హత్యకు వినియోగించిన ఆయుధాలను స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు.

దాసరి వీరయ్యకు రిమాండ్‌

గుంటూరు లీగల్‌: హత్య కేసులో దాసరి వీరయ్య అలియాస్‌ చుక్కపల్లి వీరయ్యను రిమాండ్‌కు పంపుతూ ఆరవ అదనపు జూనియర్‌ సివిల్‌ కోర్టు జడ్జి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. బుడంపాడు గ్రామానికి చెందిన కుర్రా నాగ గణేష్‌ హత్య కేసులో వీరయ్య ప్రమేయం ఉందంటూ నేరారోపణ ఉన్న క్రమంలో 8వ ముద్దాయిగా గుర్తిస్తూ పోలీసులు అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో కోర్టులో వాద ప్రతివాదనల అనంతరం వీరయ్యకు 14 రోజుల వరకు రిమాండ్‌ విధించారు. ఆయన్ను పోలీసులు జిల్లా జైలుకు తరలించారు.

హత్య కేసులో నిందితుల అరెస్టు 1
1/1

హత్య కేసులో నిందితుల అరెస్టు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement