
సీనియర్ ఉపాధ్యాయులకు అన్యాయం జరగకుండా చూడాలి
చిలకలూరిపేట: సీనియర్ ఉపాధ్యాయులకు అన్యాయం జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఎస్టీయూ రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి కె కోటేశ్వరరావు, డైరీ కమిటీ కన్వీనర్ పోటు శ్రీనివాసరావులు కోరారు. పట్టణంలోని ఎస్టీయూ ప్రాంతీయ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన యూనియన్ సమావేశంలో వారు మాట్లాడుతూ డీఎస్సీ –2025 ద్వారా నియామకం అవుతున్న ఉపాధ్యాయులు విధుల్లో చేరకముందే, సీనియర్ ఉపాధ్యాయులకు పాఠశాలల్లో ఉన్న ఖాళీ స్థానాల్లో సర్దుబాటు చేసి, క్లస్టర్ వేకెన్సీలలో కొత్త ఉపాధ్యాయులను నియమించాలన్నారు. సీనియర్ ఉపాధ్యాయులు క్లస్టర్‌లో ఉండి జూనియర్ ఉపాధ్యాయులు పాఠశాలల్లో ఉండడం జరిగితే సీనియర్లకు తీవ్ర నష్టం కలుగుతుందన్నారు. ప్రస్తుతం పనిచేస్తున్న ఉపాధ్యాయులు స్కూల్ అసిస్టెంట్లుగా 2025 డీఎస్సీలో ఎంపికై న ఖాళీలను కూడా ఈ నియామకాల్లోనే భర్తీ చేయాలని, లేనిచో ఏకోపాధ్యాయ పాఠశాలలు పెరిగే అవకాశం ఉంటుందన్నారు. ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖ వివరాలు తీసుకొని పరిశీలించాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. జూన్ మాసంలో ఉపాధ్యాయ బదిలీలు జరిగిన తర్వాత ఉద్యోగ విరమణ పొందిన వారి స్థానంలో కూడా విద్యార్థులకు అనుగుణంగా ఉపాధ్యాయులను నియమించాలని కోరారు. సమావేశంలో ఎస్టీయూ జిల్లా కార్యదర్శి వినుకొండ అక్కయ్య, నాయకులు మేకల కోటేశ్వరరావు, వడ్లాన జయప్రకాశ్ పాల్గొన్నారు.
ఎస్టీయూ రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి కె.కోటేశ్వరరావు