
పల్నాడు జిల్లా కలెక్టర్‌గా కృతిక శుక్లా నియామకం
సాక్షి, నరసరావుపేట: పల్నాడు జిల్లా కలెక్టర్‌గా 2013వ బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారిణి కృతికా శుక్లా నియమితులయ్యారు. ప్రస్తుతం ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న ఆమెను జిల్లాకు కలెక్టర్‌గా బదిలీ చేస్తూ ప్రభుత్వం గురువారం జీఓ జారీ చేసింది. జమ్మూ అండ్ కశ్మీర్ రాష్ట్ర కేడర్‌కు చెందిన కృతికా శుక్లా తన బ్యాచ్‌కే చెందిన ఏపీ క్యాడర్ ఐఏఎస్ అధికారి హిమాన్షు శుక్లాను వివాహం చేసుకొని ఏపీ క్యాడర్‌కు బదిలీ అయ్యారు. కృతిక శుక్లా 2016 నవంబర్ 11వ తేదీ నుంచి 2018 ఆగస్టు 12వ తేదీ వరకు ఉమ్మడి గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్‌గా పనిచేసిన అనుభవం ఉంది. విశాఖపట్నం అసిస్టెంట్ కలెక్టర్, మదనపల్లి సబ్ కలెక్టర్, ఉమ్మడి కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్‌గానూ విధులు నిర్వహించారు. మహిళా, శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్; దిశా స్పెషల్ ఆఫీసర్, కాకినాడ కలెక్టర్, ఇంటర్మీడియట్ బోర్డు సెక్రటరీ తదితర హోదాలలో పనిచేశారు.
అరుణ్‌బాబుకు దక్కని పోస్టింగ్
గత ఏడాది కాలంగా జిల్లా కలెక్టర్‌గా పనిచేస్తున్న పి.అరుణ్‌బాబుకు తాజా బదిలీలలో పోస్టింగ్ ఇస్తున్నట్లు జీఓలో పేర్కొనలేదు. గతంలో నరసరావుపేట, గురజాల ఆర్డీఓగా పనిచేసిన అరుణ్‌బాబు 2024 ఆగస్టు 7వ తేదీన పల్నాడు జిల్లా మూడవ కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. పీజీఆర్‌ఎస్‌కు వచ్చే అర్జీదారుల కోసం కలెక్టర్ ప్రాంగణంలో ప్రత్యేక షెడ్ ఏర్పాటు చేయించారు. ఉచితంగా అర్జీలు రాసిచ్చే ప్రక్రియను చేపట్టారు. ప్రతి మూడో శనివారం కలెక్టరేట్‌లో ఎస్‌సీ, ఎస్‌టీలకు ప్రత్యేక పీజీఆర్‌ఎస్ నిర్వహిస్తూ వారి సమస్యలు తీర్చేందుకు ప్రయత్నాలు చేశారు. కలెక్టరేట్‌కు దగ్గరలో పరేడ్ గ్రౌండ్ ఏర్పాటులో కూడా కీలక పాత్ర పోషించారు. శంకరభారతీపురం జెడ్పీ హైస్కూలును దత్తత తీసుకున్నారు.