రైతులపై అంత కక్ష ఎందుకు? గుంటూరు వెస్ట్: ప్రజలకు అన్నం పెట్టే రైతన్నను ఇబ్బంది పెడితే రాష్ట్రానికి మంచిది కాదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు పేర్కొన్నారు. వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు అంబటి రాంబాబు ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక ఆర్డీఓ కార్యాలయ సమీపంలో అన్నదాత పోరు కార్యక్రమానికి విశేషంగా జనం తరలివచ్చారు. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో పార్టీ శ్రేణులు, రైతులు హోరెత్తించారు. కార్యక్రమాన్ని భగ్నం చేసేందుకు పోలీసులు చేసిన ప్రయత్నాలను నాయకులు, కార్యకర్తలు అధిగమించారు. హుందాగా వ్యవహరించిన తీరు అధికారులను సైతం ఆశ్చర్యపరచింది. కార్యక్రమంలో బాధిత రైతులు పెద్ద ఎత్తున పాల్గొని తమ ఇబ్బందులను విలేకరులకు వివరించారు. వినతిపత్రం తీసుకోవాల్సిన ఆర్డీఓ కె.శ్రీనివాసరావు అందుబాటులో లేకుండాపోయారు. చివరకు ఇన్‌చార్జి ఏఓ రమేష్‌కు నాయకులు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా అంబటి రాంబాబు విలేకరులతో మాట్లాడుతూ... రైతులు పంటల సాగు కోసం యూరియా అడుగుతుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి వారి అరెస్ట్‌కు ఆదేశాలిస్తున్న తీరు బాధగా ఉందన్నారు. వ్యవసాయం తప్పితే మరో ప్రపంచం తెలియని రైతులపై ఎందుకు ప్రభుత్వం కక్ష కడుతుందో అర్థం కావడం లేదన్నారు. యూరియా పంపిణీ ఇవ్వక.. పంటలకు గిట్టుబాటు కల్పించక ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. ఇలా అయితే రైతులు ఏం చేయాలి, ఎలా జీవించాలని ప్రశ్నించారు. 40 శాతానికి పైగా ప్రజలు తమకు ఓట్లు వేశారని, రైతు పక్షపాతిగా ముద్రపడ్డ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి రైతుకు మద్దతుగా పోరుబాట పడితే ప్రభుత్వం ఓర్చుకోలేకపోతోందన్నారు. గత ప్రభుత్వ హయాంలో రైతు భరోసా కేంద్రాల ద్వారా సరిపడా ఎరువులు, విత్తనాలు, పంటల బీమా, రైతు భరోసా అందించినట్లు చెప్పారు. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అన్ని వర్గాలపైనా కక్ష సాధింపే కనిపిస్తోందని విమర్శించారు. మంత్రులు, ప్రజాప్రతినిధులు తమ వసూళ్ల కోసమే తప్ప ప్రజల బాగోగులు చూసే సమయం లేకుండా పోయిందన్నారు. సుగాలి ప్రీతి కేసు, తురకపాలెం అకాల మరణాల విషయంలో తమ పార్టీ చేసిన పోరాటాల ఫలితంగానే ప్రభుత్వం స్పందించిందని తెలిపారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు పార్లమెంట్ పరిశీలకులు పోతుల మహేష్ మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో రైతు భరోసా కింద ప్రతి ఏడాది క్రమం తప్పకుండా నిధులు అందజేసిందన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తొలి ఏడాది ఇవ్వకుండా.. రెండో ఏడాది రూ.5 వేలు మాత్రమే ఇచ్చిందన్నారు. తాము ఇచ్చిన ఉచిత పంటల బీమా రైతుల కష్టాలను అధిగమించేట్లు చేశామన్నారు. ప్రభుత్వానికి మద్యం వ్యాపారం, వసూళ్లపై ఉన్న శ్రద్ధ కష్టపడి పనిచేసే రైతుల సమస్యల పరిష్కారంపై చూపిస్తే నేడు రోడ్లు ఎక్కాల్సిన అవసరం రాదన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ చంద్రగిరి ఏసురత్నం, గుంటూరు నగర అధ్యక్షులు నూరి ఫాతిమా, తాడికొండ, ప్రత్తిపాడు నియోజకవర్గాల సమన్వయకర్తలు వనమా బాల వజ్రబాబు (డైమండ్ బాబు), బలసాని కిరణ్ కుమార్, రాష్ట్ర కార్యదర్శులు నిమ్మకాయల రాజనారాయణ, షేక్ మస్తాన్ వలి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మెట్టు వెంకటప్పారెడ్డి, ఏపీ కుమ్మరి, శాలివాహన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మండేపూడి పురుషోత్తమ్, నగర యువజన విభాగం అధ్యక్షుడు యేటి కోటేశ్వరరావు, అనుబంధ విభాగం జిల్లా అధ్యక్షుడు పఠాన్ సైదా ఖాన్, నల్లమోతు రామకృష్ణ, కొర్రపాటి ప్రేమ్ కుమార్, వాసుమల్ల విజయ్, పవన్ శేషగిరి, దానం వినోద్, ఉడుముల పిచ్చిరెడ్డి, దాసరి రాజు, కార్పొరేటర్లు అచ్చాల వెంకటరెడ్డి, పడాల సుబ్బారెడ్డి, అంబేద్కర్, అజయ్, మల్లవరపు రమ్య, గేదెల రమేష్, పోలవరపు వెంకటేశ్వర్లు, బోడపాటి కిషోర్, బత్తుల దేవానంద్, భాను, సురసాని వెంకట రెడ్డి, రజియా బేగం, పూనూని నాగేశ్వరరావు, ఓలేటి అరవింద్ రైతులు పాల్గొన్నారు.
కార్యక్రమంలో పాల్గొన్న రైతులు యూరియా లభించక నానా ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేసారు. గత ప్రభుత్వ హయాంలో చిన్న ఇబ్బంది ఉన్నా సర్కారు స్పందించి న్యాయం చేసేదని గుర్తుచేశారు. రైతు భరోసా కేంద్రాలు, గ్రామ, వార్డు సచివాలయాల్లో చెబితే తక్షణం స్పందించేవారన్నారు. కొందరు రైతులు తమ అభిప్రాయాలను వెలిబుచ్చారు.
అణగదొక్కడమే ప్రభుత్వం పని
మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోకుండా ప్రతిపక్షాలను అణగదొక్కే ప్రయత్నం చేస్తోందన్నారు. తమను ఎంత అణగదొక్కితే అంతలా ఉద్యమిస్తామని చెప్పారు. దానికి తమ నాయకుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి స్ఫూర్తిగా నిలిచారని తెలిపారు. జిల్లాలో 100 రకాలకు పైగా పంటలు పండుతాయన్నారు. ఆసియా ఖండంలోనే అతి పెద్దదైన మిర్చి యార్డు ఇక్కడే ఉందని గుర్తుచేశారు. పత్తి, పొగాకు వంటి పంటలకు జిల్లా ఎంతో పేరుగాంచిందన్నారు. వ్యవసాయ శాఖ మంత్రి ఇటువైపు కూడా కన్నెత్తి చూడలేదన్నారు. అందుకే రైతుల తరఫున జిల్లాలో తమ పార్టీ నిరంతర ఉద్యమాలు చేపడుతోందన్నారు. గత ప్రభుత్వ హయాంలో రైతుల ఇబ్బందులను ముందే గ్రహించి రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశారన్నారు. వారికి చేదోడు వాదోడుగా ఉన్నామని తెలిపారు. అన్నదాతలను ఇంతలా వేధిస్తున్న కూటమి ప్రభుత్వాన్ని మరో మూడేళ్లు భరించాల్సిందేనని చెప్పారు. ప్రతిపక్షాలంటే పాకిస్తాన్ ఉగ్రవాదుల్లా చూస్తున్నారని పేర్కొన్నారు. పోలీసులను తమపైకి ఉసుగొలిపి వేడుక చూస్తున్నారని పేర్కొన్నారు. విత్తనాలుండవు, గిట్టుబాటు ధర ఇవ్వరు, పంటల బీమాకు మంగళం పాడేశారన్నారు. ఈ–క్రాప్ నమోదు అంతంత మాత్రంగానే ఉందని తెలిపారు. తాము రైతుల తరఫున పోరాటం చేస్తున్నామన్నారు. 2019–24 కాలంలో రైతులు ఏనాడైనా రోడ్డుపైకి వచ్చారా? అని ప్రశ్నించారు. రైతులకు న్యాయం చేస్తే తాము ధర్నాలు ఎందుకు చేస్తామని మోదుగుల పేర్కొన్నారు.
150 ఎకరాల్లో వరి వేశా. ఎకరానికి 3 యూరియా బస్తాలు అవసరం. అంటే సుమారు 450 బస్తాలు కావాల్సి ఉండగా ఒక్కటీ అందలేదు. గత్యంతరం లేని స్థితిలో డీఏపీ వాడుతున్నాం. రాష్ట్రంలో 67 శాతానికి పైగా వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నారు. రైతుల కష్టాలను వినేందుకు వ్యవసాయ శాఖ మంత్రిగానీ, అధికారులుగానీ సిద్ధంగా లేరు. ఇలాంటి విధానాలు అమలు చేస్తే భవిష్యత్తులో రైతు కనుమరుగయ్యే పరిస్థితి ఉంటుంది.
జిల్లా యంత్రాగానికి, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య సమన్వయం లేదు. యూరియా గురించి పూర్తి సమాచారం చెప్పడం లేదు. వచ్చే కొద్దిపాటి బస్తాలు కూటమి నాయకుల అనుకూల వర్గీయులకు వెళుతున్నాయి. చిన్న, సన్నకారు రైతుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. వ్యవసాయం చేయాలంటే భయమేస్తోంది. చాలా రోజుల నుంచి యూరియా కొరత గురించి చెబుతున్నా పట్టించుకోవడంలేదు. ప్రత్తిపాడు మండలంలో నాతోపాటు మా బంధులువులు వ్యవసాయం చేస్తుంటారు. పంటకు యూరియా ఎంతో కీలకం. దానిని మార్కెట్‌లోకి తేవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.
ఆర్థికంగానూ నష్టపోయేలా పాలన
కూటమి పాలనలో ఇబ్బందులు
దిక్కుతోచని స్థితిలో ఉన్నా
బ్లాకులో జోరుగా విక్రయాలు