రైతులకు కన్నీరు మిగిల్చిన కూటమి ప్రభుత్వం
రైతులకు కన్నీరు మిగిల్చిన కూటమి ప్రభుత్వం తెనాలి: రైతులకు కన్నీరు మిగిల్చిన కూటమి ప్రభుత్వం వారి కన్నీటిలోనే కొట్టుకుపోతుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో ఖరీఫ్ సాగు రైతులకు అవసరమైన యూరియాను వెంటనే పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే రైతుల ఆగ్రహాన్ని చవిచూడాల్సి వస్తుందని స్పష్టం చేశారు. యూరియా దొరక్క రైతులు పడుతున్న అవస్థలపై వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పిలుపు మేరకు ‘అన్నదాత పోరు’ కార్యక్రమం మంగళవారం తెనాలిలో జరిగింది. రామలింగేశ్వరపేట నుంచి బోసు రోడ్డు మీదుగా సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు నిరసన ప్రదర్శన సాగింది. అనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయంలో తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణకు తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని పార్టీ నాయకులు అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పంటలకు గిట్టుధరలు లేవన్నారు. రైతులు అయినకాడికి అమ్ముకోవాల్సిన దుర్భర పరిస్థితులు దాపురించాయని గుర్తుచేశారు. ప్రస్తుత ఖరీఫ్ సీజనులో అవసరమైన యూరియాను ఇవ్వలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందని చెప్పారు. వ్యవసాయం దండగ అనే అభిప్రాయం కలిగిన చంద్రబాబు పాలనలో రైతులు ఎప్పటి మాదిరిగానే అవస్థలు పడాల్సి వస్తోందన్నారు.
పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నందమూరి లక్ష్మీపార్వతి మాట్లాడుతూ గతంలో వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వం రైతులకు నాణ్యమైన విత్తనాలను, ఎరువులను ఇచ్చిందన్నారు. పంటలను కల్లాల్లోనే మద్దతు ధరకు కొనుగోలు చేశారని గుర్తుచేశారు. గతంలో రైతుభరోసా కింద రూ.13,500 ఇస్తే.. చంద్రబాబు వచ్చాక రూ.5 వేలు మాత్రమే ఇచ్చారని ధ్వజమెత్తారు. రైతులపాలిట చంద్రబాబు శనిలా దాపురించారని ఆరోపించారు. యూరియా దొరకటం లేదని రైతులు అల్లాడిపోతుంటే పిట్టకథలు, కట్టుకథలు చెబుతున్నారని విమర్శించారు.
తెనాలి నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ మాట్లాడుతూ.. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం దేశంలోనే ఎక్కడా లేనివిధంగా ఆర్‌బీకే కేంద్రాలను తీసుకొచ్చి సమస్త సేవలను అందించినట్లు చెప్పారు. పంటలను మద్దతు ధరకు కొనుగోలు చేసిందన్నారు. చంద్రబాబు, లోకేష్‌లు రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలను దెబ్బతీస్తున్నారని విమర్శించారు. రైతులు యూరియా కోసం ఇబ్బంది పడుతుంటే... పంటకు యూరియా ఎక్కువేస్తే అనారోగ్యం వస్తుందని చంద్రబాబు, వ్యవసాయ శాఖ మంత్రి అనటం దారుణమన్నారు. వపన్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, మంత్రులు ఆయన సినిమా టికెట్ల ప్రమోషన్లలోనే మునిగితేలుతున్నారని విమర్శించారు.
వైఎస్సార్‌సీపీ మహిళా నేత శ్యామల మాట్లాడుతూ ఇటీవల పట్టిన చంద్రగ్రహణం మూడు గంటల్లో పోతే, రాష్ట్రానికి పట్టిన ‘చంద్ర’గ్రహణం ఇంకా మూడున్నరేళ్లు భరించాల్సిందేనని అన్నారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు ఆ గ్రహణం చీకటిలోనే మగ్గుతున్నారని చెప్పారు. యూరియా ఇచ్చామని చెబుతున్న ప్రభుత్వం.. రైతులు ఊరూరా చెప్పులు, సంచుల వరసలు పెట్టి ఎందుకు మగ్గిపోతున్నారో వివరించాలని నిలదీశారు.
మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి మాట్లాడుతూ.. డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి, వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పాలనలో రైతులు హాయిగా ఉన్నారని గుర్తుచేశారు. ప్రస్తుతం రైతుల కష్టాలు పాలకులకు పట్టటం లేదన్నారు. బఫేలో భోజనాల ప్లేట్లు పట్టుకుని నిలబడటం లేదా... యూరియా కోసం క్యూలైనులో నిల్చుంటే తప్పేముందని ఒక నాయకుడు అనటం రైతులను అవమానించినట్టేనని అన్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, సరైన సమయంలో తగిన గుణపాఠం చెబుతారని పేర్కొన్నారు.
పార్టీ పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ మాట్లాడుతూ రైతులకు వెంటనే సరిపడా యూరియా ఇవ్వాలన్నారు. కొండవీటివాగు ముంపుతో గుంటూరు చానల్‌కు గండ్లు పడి 30 వేల ఎకరాలలో పంట నీట మునిగినందున పొన్నూరు నియోజకవర్గంలోని రైతులకు ఎకరాకు రూ.10 వేల చొప్పున ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, పార్టీ పరిశీలకుడు గులాం రసూల్, మున్సిపల్ చైర్‌పర్సన్ తాడిబోయిన రాధిక, వైస్ చైర్మన్ అత్తోట నాగవేణి, మూడు నియోజకవర్గాలకు చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.
● కన్నీటిలోనే పాలకులు
కొట్టుకుపోవడం ఖాయం
● ‘అన్నదాత పోరు’లో ఎమ్మెల్సీ
లేళ్ల అప్పిరెడ్డి, పార్టీ సమన్వయకర్తలు
మురళీకృష్ణ, వేమారెడ్డి, శివకుమార్‌లు
బాబు పాలనలో అన్నీ కష్టాలే
రైతులపాలిట శనిలా చంద్రబాబు
సీఎం వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యం
‘చంద్ర’గ్రహణం చీకటిలో రాష్ట్రం
కూటమికి గుణపాఠం తప్పదు
ఎకరాకు రూ.10 వేలు పరిహారం ఇవ్వాలి
ఎడ్లబండిపై వస్తున్న లేళ్ల అప్పిరెడ్డి, లక్ష్మీపార్వతి, శ్యామల,
శివకుమార్, వేమారెడ్డి, మురళీకృష్ణ, హనుమంతరావు
తెనాలిలో నిరసన ప్రదర్శనలో పాల్గొన్న పార్టీ శ్రేణులు, రైతులు
1/3
రైతులకు కన్నీరు మిగిల్చిన కూటమి ప్రభుత్వం
2/3
రైతులకు కన్నీరు మిగిల్చిన కూటమి ప్రభుత్వం
3/3
రైతులకు కన్నీరు మిగిల్చిన కూటమి ప్రభుత్వం