
‘కిల్కారి’ అమలు పరిశీలన
గుంటూరు మెడికల్: కిల్కారి అమలు తీరును పరిశీలించేందుకు కేంద్రం బృందం వచ్చింది. జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయాన్ని మంగళవారం ఢిల్లీ నుంచి వచ్చిన బృంద సభ్యులు సందర్శించారు. జిల్లా బృందంతో సమావేశం అయ్యారు. గర్భిణులు, బాలింతలకు ఉపయోగపడుతున్న తీరు అడిగి తెలుసుకున్నారు. జిల్లా బృందం ఈ సేవలను మెరుగుపరచడానికి తీసుకుంటున్న చర్యలను పరిశీలించారు. డీపీహెఎన్‌ఓ డాక్టర్ ప్రియాంక మాట్లాడుతూ అమలు తీరు వివరించారు. 911 60010 3660 అనే నెంబర్ కాల్ వస్తుందని, ఈ నెంబర్ సేవ్ చేసుకోవాలన్నారు. తిరిగి వినాలి అంటే 14423 నెంబర్‌కి కాల్ చేయాలని చెప్పారు.
గుంటూరు ఎడ్యుకేషన్: ప్రత్తిపాడు మండలం బోయపాలెంలోని ఈనెల 11, 12వ తేదీల్లో నిర్వహించనున్న కళా ఉత్సవాలను జయప్రదం చేయాలని గుంటూరు, పల్నాడు జిల్లాల విద్యాశాఖాధికారులు సీవీ రేణుక, ఎల్. చంద్రకళలు తెలిపారు. మంగళవారం డీఈవో కార్యాలయంలో డీఈవో రేణుకకు నోడల్ అధికారి డాక్టర్ ఎన్. విమల కుమారి ఆహ్వాన పత్రాన్ని అందజేశారు. రేణుక మాట్లాడుతూ ఉమ్మడి గుంటూరు జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో 9, 10, 11, 12వ తరగతుల విద్యార్థులు అర్హులని పేర్కొన్నారు. విజేతలకు బహుమతులతోపాటు పాల్గొన్న ప్రతి ఒక్కరికి సర్టిఫికెట్ అందజేస్తామని తెలిపారు. రెండు రోజులపాటు భోజన ఏర్పాట్లు ఉంటాయన్నారు. కార్యక్రమంలో ఉర్దూ డీఐ షేక్ ఎండీ ఖాసీం పాల్గొన్నారు.
నెహ్రూనగర్: స్వయం ఉపాధి, నైపుణ్యాభివృద్ధి కోర్సులలో ప్రవేశ ఎంపికకు ట్రాన్స్‌జండర్ల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు విభిన్న ప్రతిభావంతులు, ట్రాన్స్‌జండర్లు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ డి. దుర్గాబాయి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇంటర్మీడియెట్ లెవల్ కోర్సులో ఆప్టిట్యూడ్, లాజికల్ రీజనింగ్, జనరల్ నాలెడ్జ్, పబ్లిక్ స్పీకింగ్, ప్రాక్టీస్ టెస్టులు ఉంటాయన్నారు. డిగ్రీ లెవల్‌లో అడ్వాన్స్ ఆప్టిట్యూడ్, న్యూస్ పేపర్ అనాలసిస్ట్, కంప్యూటర్ ప్రావీణ్యాలు ఉంటాయని పేర్కొన్నారు. సంబంధిత శాఖ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

‘కిల్కారి’ అమలు పరిశీలన